Ys Jagan : దర్జాగా వాడి.. డబ్బివ్వలేదు
ABN , Publish Date - Nov 21 , 2024 | 12:27 AM
వైసీపీ హయాంలో నాటి సీఎం జగన పర్యటనలకు కాన్వాయ్ ఏర్పాటు చేసిన వాహనదారులు అద్దె బిల్లుల కోసం కళ్లకు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. సీఎం కాన్వాయ్‌తోపాటు ఎమ్మెల్సీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలకు వాహనాలను సమకూర్చారు. వాహనాల అద్దెతోపాటు డ్రైవర్ బత్తా సొమ్ము రాలేదు. కొవిడ్ సమయంలో రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి, మృతదేహాలను తరలించడానికి పలువురు వాహనాలను సమకూర్చారు. నాలుగేళ్లు గడిచినా వారికి బిల్లులు చెల్లించలేదు....
జగన కాన్వాయ్‌కి అద్దె వాహనాలు
కొవిడ్, సార్వత్రిక ఎన్నికలకూ వినియోగం
అద్దె బకాయిలు రూ.70 లక్షలకు పైగానే..
అధికారుల చుట్టూ వాహనదారుల ప్రదక్షిణ
గుంతకల్లు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో నాటి సీఎం జగన పర్యటనలకు కాన్వాయ్ ఏర్పాటు చేసిన వాహనదారులు అద్దె బిల్లుల కోసం కళ్లకు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. సీఎం కాన్వాయ్‌తోపాటు ఎమ్మెల్సీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలకు వాహనాలను సమకూర్చారు. వాహనాల అద్దెతోపాటు డ్రైవర్ బత్తా సొమ్ము రాలేదు. కొవిడ్ సమయంలో రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి, మృతదేహాలను తరలించడానికి పలువురు వాహనాలను సమకూర్చారు. నాలుగేళ్లు గడిచినా వారికి బిల్లులు చెల్లించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో రెవెన్యూ శాఖకు ఇచ్చిన వాహనాలకు పది రోజుల్లోనే డబ్బురాగా, పోలీసులకు ఇచ్చిన వాహనాలకు ఇప్పటికీ డబ్బు రాలేదు. దీంతో వాహనదారులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
రూ.70 లక్షలు పెండింగ్
నాటి సీఎం జగన పర్యటనకు అధికారులు ప్రైవేటు వాహనాలను అద్దెకు ఏర్పాటు చేశారు. రెండేళ్లపాటు జిల్లాలో రూ.25 లక్షల అద్దె చెల్లించలేదు. రెండేళ్ల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికలకు సైతం వాహనాలను అద్దెకు తీసుకున్నారు. ఆ బిల్లులు, బత్తాలు రూ.6 లక్షల వరకూ బకాయి ఉన్నాయి. అప్పట్లో డీజల్ మాత్రమే వేయించారు. కొవిడ్ సమయంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో రోగులను ఇళ్ల వద్ద నుంచి ఆసుపత్రికి, ఆసుపత్రుల్లో మరణించినవారి మృతదేహాలను ఖననానికి తరలించడానికి వాహనాలను సమకూర్చారు. ఆ బిల్లులు భారీగా పెండింగ్ ఉన్నాయి. కొవిడ్ సమయంలో అద్దె ఎంత ఇస్తారో చెప్పకుండానే వాహనాలను తీసుకున్నారు. అధికారులు అర్ధరాత్రి చెప్పినా.. వెంటనే వాహనాలను సమకూర్చామని, కానీ పైసా చెల్లించలేదని ఓనర్ కం డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో చెల్లించాల్సిన వాహనాల అద్దె బకాయిలు జిల్లాలో దాదాపు రూ.70 లక్షలు ఉన్నాయని సమాచారం.
కాళ్లరిగేలా తిరిగినా..
ప్రభుత్వ అవసరాలకు నాలుగేళ్లపాటు వాహనాలు పెట్టినవారు బిల్లుల కోసం మోటారు వాహనాల కార్యాలయాల చుట్టూ, ఉన్నతాధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ట్యాక్సీ, ఫోర్ వీలర్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో వాహనాల యజమానులు కలెక్టర్ గ్రీవెన్సులో పలుమార్లు వినతి పత్రాలను సమర్పించారు. గత నెలలో గుంతకల్లులో జరిగిన ఆర్డీవో గ్రీవెన్సుకు వచ్చిన కలెక్టర్‌ను కలిశారు. బిల్లులను చెల్లించాలని మొరపెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో తాడిపత్రిలో ఎన్నికల కమిషన భారీ స్థాయిలో వాహనాలను అద్దెకు వినియోగించింది. జిల్లా వ్యాప్తంగా ఒక్కో వాహనానికి రూ.7 వేల నుంచి రూ.8 వేలదాకా బిల్లులు రావాల్సి ఉంది.
వెంటనే చెల్లించాలి..
కొవిడ్ సమయంలో పెట్టిన వాహనాలకు సైతం బిల్లులు ఇంతవరకూ ఇవ్వలేదు. ఎప్పుడు పిలిచినా ఎదురు ప్రశ్నించకుండా వాహనాలను తెచ్చిపెట్టాం. ప్రాణాలకు తెగించి వాహనాలను నడిపాం. అయినా పైసా కూడా ఇవ్వలేదు. కనీసం ఎన్నికల బిల్లులను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే చెల్లించాలి.
-బ్రహ్మయ్య, ట్యాక్సీ అసోసియేషన కార్యదర్శి, గుంతకల్లు
15 వాహనాలను సమకూర్చాం..
అప్పటి సీఎం జగన ఫిబ్రవరిలో జిల్లా పర్యటనకు వచ్చారు. రెండు రోజులపాటు 15 వాహనాలను సమకూర్చాము. తొమ్మిది నెలలైనా ఇంతవరకూ డబ్బివ్వలేదు. అధికారులు స్పందించి వెంటనే బిల్లులను చెల్లించాలి.
- లక్ష్మీనారాయణ, ఫోర్ వీలర్ ప్యాసింజర్ వెహికల్
అసోసియేషన అధ్యక్షుడు, ఉరవకొండ
మరిన్ని అనంతపురం వార్తల కోసం....