AP News : వైసీపీకి బాలినేని, ఉదయభాను గుడ్‌బై
ABN , Publish Date - Sep 20 , 2024 | 05:04 AM
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఆయన సన్నిహితులు గట్టి షాకే ఇచ్చారు. మాజీ మంత్రి, ఆయన సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, అత్యంత ఆత్మీయుడిగా మెలిగిన జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి గుడ్‌బై చెప్పారు.
జగన్‌కు షాకిచ్చిన సన్నిహితులు.. పవన్‌తో వేర్వేరుగా భేటీ
పవన్ ఆదేశాల మేరకు నడుచుకుంటా
అక్టోబరు 4న జనసేనలో చేరతా
పార్టీలోకి వచ్చేందుకు ప్రకాశం వైసీపీ ఎమ్మెల్యేలూ రెడీ!
వైసీపీలో నేను ఎన్నోసార్లు ఏడ్చిన రోజులున్నాయి
జగన్ విశ్వసనీయత బూటకం
నమ్మిన నేతలను వంచించారు: బాలినేని
వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది
మనసుకు కష్టం కలిగినందునే వీడా
22వ తేదీన జనసేనలో చేరుతున్నా: ఉదయభాను
అమరావతి/ఒంగోలు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఆయన సన్నిహితులు గట్టి షాకే ఇచ్చారు. మాజీ మంత్రి, ఆయన సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, అత్యంత ఆత్మీయుడిగా మెలిగిన జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి గుడ్‌బై చెప్పారు. గురువారం వారు వేర్వేరుగా విజయవాడలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో సమావేశమై చర్చలు జరిపారు. వారిని ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. అక్టోబరు 4న చేరతానని బాలినేని ప్రకటించగా.. ఈ నెల 22వ తేదీన తాను చేరుతున్నట్లు ఉదయభాను తెలిపారు. పవన్‌తో భేటీ అనంతరం వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. తానెలాంటి డిమాండ్లూ పెట్టకుండా బేషరతుగా చేరుతున్నానని బాలినేని చెప్పారు. మంచి రోజు చూసుకుని పార్టీలో చేరతానని, పవన్‌కు వీలైతే అక్టోబరు 4న ఒంగోలులో సభ ఏర్పాటు చేసి పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఆ కార్యక్రమంలో ప్రకాశం జిల్లాలోని తన అనుచరులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు కూడా చేరతారని చెప్పారు. ప్రకాశం జిల్లాలోని ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జగన్‌ను వీడి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
అధిష్ఠానం ఆదేశిస్తే పార్టీలోకి వచ్చే నాయకులతో మాట్లాడతానన్నారు. జగన్ విశ్వసనీయత బూటకమని.. ఆ పేరుతో నమ్మిన నాయకులను మోసం చేశారని విమర్శించారు. ఆయన విధానం పచ్చి మోసమన్నారు. ఆయన వైసీపీ పెట్టగానే మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు వదులుకుని ఆ పార్టీలో చేరిన 17మందిలో ఒక్కరికి కూడా కేబినెట్ విస్తరణ అనంతరం మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదని.. విశ్వసనీయతకు ఆయన మారుపేరయితే.. తన కోసం అన్నీ వదులుకుని వచ్చిన 17 మందినీ ఎందుకు పక్కన పెట్టారని నిలదీశారు. పార్టీలో తనకు చాలా అవమానాలు ఎదురయ్యాయని, అవసరమైనప్పుడు వెల్లడిస్తానని తెలిపారు.
పవన్ కల్యాణ్ తనను బాగా రిసీవ్ చేసుకున్నారని తెలిపారు. తాను అధికారం కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. తాను ప్రజల పరిస్థితిని వివరించడానికి వెళ్తే.. కొంత మంది జగన్‌ను బ్లాక్‌మెయిల్ చేయడానికి వెళ్లానంటూ విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు బయటకు వచ్చాను కాబట్టి వైసీపీపై విమర్శలు చేస్తూ మాట్లాడనని.. తనపై ఎవరైనా విమర్శలు చేస్తే తప్పకుండా బుద్ధి చెబుతానన్నారు. పవన్‌ను కలవక ముందే తాను వైసీపీకి రాజీనామా చేశానని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై ఉన్న ప్రేమతో వైసీపీలో చేరానని.. ఆ పార్టీలో ఉన్న సమయంలో అనేక సార్లు కన్నీరు పెట్టుకున్న రోజులు ఉన్నాయని ఆవేదనతో చెప్పారు. నాడూ, నేడూ జగన్ చుట్టూ అదే కోటరీ నడుస్తోందని విమర్శించారు. తాను కోరిన వెంటనే పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.
జగన్ పట్టించుకోలేదు: ఉదయభాను
వైసీపీ పరిస్థితి దారుణంగా ఉందని ఉదయభాను చెప్పారు. ఎన్నికలకు ముందు అనేక సార్లు జగన్‌ను కలసి చెప్పినా పట్టించుకోలేదని.. మనసుకు కష్టం కలిగినందునే వైసీపీని వీడానన్నారు. వైసీపీలోని పరిణామాలు చూస్తుంటే ఆ పార్టీకి భవిష్యత్ లేదని స్పష్టమవుతోందని.. తమ భవిష్యత్ తాము చూసుకోవలసి ఉన్నందునే బయటకు వచ్చేశానని అన్నారు. తనతో ప్రయాణం చేసేవాళ్లను కూడా జనసేనలోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు. పవన్‌తో అన్ని విషయాలూ మాట్లాడానని... కూటమికి తగ్గట్టుగా వివాదాలకు తావులేకుండా నడచుకుంటానని చెప్పారు. మాజీ మంత్రి బాలినేని కూడా పార్టీలో చేరుతున్నట్లు తెలిసిందన్నారు.