Share News

Kadambari Jethwani Case: జెత్వానీ ఫిర్యాదుతో విద్యాసాగర్‌పై కేసు

ABN , Publish Date - Sep 15 , 2024 | 05:37 AM

ముంబై నటి కాదంబరి జెత్వానీ వ్యవహారంలో రెండో అడుగు పడింది. ఇప్పటికే ఇద్దరు పోలీసు అధికారులపై వేటు వేయగా..

Kadambari Jethwani Case: జెత్వానీ ఫిర్యాదుతో విద్యాసాగర్‌పై కేసు
Kadambari Jethwani

  • జెత్వానీ ఫిర్యాదుతో విద్యాసాగర్‌పై కేసు ఏ1గా చేర్చిన

  • ఇబ్రహీంపట్నం పోలీసులు వైసీపీ నేతపై

  • 11 సెక్షన్లు నమోదు ఐపీఎ్‌సలు పీఎస్‌ఆర్‌, కాంతిరాణా,

  • విశాల్‌గున్నీపైనా ముంబై నటి ఫిర్యాదు

విజయవాడ, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ముంబై నటి కాదంబరి జెత్వానీ వ్యవహారంలో రెండో అడుగు పడింది. ఇప్పటికే ఇద్దరు పోలీసు అధికారులపై వేటు వేయగా.. తాజాగా కాదంబరి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. శుక్రవారం రాత్రి ఇబ్రహీంపట్నం పోలీసులు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌, ఇతరులపై కేసు నమోదు చేశారు. ఏ1గా కుక్కల విద్యాసాగర్‌ను చేర్చారు. విద్యాసాగర్‌పై క్రైం నంబర్‌ 469/2024తో 192, 211, 218, 220, 354(డీ), 467, 420, 469, 471, రెడ్‌విత్‌ 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇవి కాకుండా 66(ఏ) ఆఫ్‌ ఐటీ యాక్ట్‌ 2000ను చేర్చారు. కాగా కేంద్ర ప్రభుత్వం కొత్త క్రిమినల్‌ చట్టాలు బీఎన్‌ఎ్‌స(భారతీయ న్యాయ సంహిత), బీఎన్‌ఎ్‌సఎ్‌స(భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత), బీఎ్‌సఏ(భారతీయ సాక్ష్యా అధినియం)లను అమలు చేస్తోంది. ఇబ్రహీంపట్నం పోలీసులు మాత్రం ఐపీసీ సెక్షన్లు చేర్చారు. ఎఫ్‌ఐఆర్‌ కింద మాత్రం అండర్‌ సెక్షన్స్‌ 173 బీఎన్‌ఎస్‌ అని టైపు చేసి ఉంది. ఈ నేరం జూలైకు ముందు జరిగింది కాబట్టి అన్నీ ఐపీసీ సెక్షన్లే వర్తిస్తాయని ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.


ఇదీ ఫిర్యాదు..

‘‘ముంబై జుహులోని గుల్‌మొహర్‌ రోడ్డులో ఉన్న ఐడియల్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఏ 602 ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాను. మోడలింగ్‌ నా వృత్తి. నా తండ్రి నరేంద్రకుమార్‌ జెత్వానీ రిటైర్డ్‌ నేవీ మర్చెంట్‌ ఆఫీసర్‌. తల్లి ఆశా జెత్వానీ ఆర్బీఐ రిటైర్డ్‌ ఉద్యోగి. నా సోదరుడు అంబరీశ్‌ జెత్వానీ దంతవైద్యుడు. ప్రస్తుతం దుబాయ్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. విద్యాసాగర్‌ మోడలింగ్‌ కో-ఆర్డినేటర్‌గా ఉన్నప్పుడు 2009 నుంచి అతడితో పరిచయం ఉంది. అతడిని మొదటిసారి హైదరాబాద్‌లో కలిశాను. నా ప్రయాణం, వసతి ఏర్పాట్లను విద్యాసాగర్‌ చూసేవాడు. అప్పటి నుంచి అతడు ఖరీదైన గిఫ్ట్‌లు ఇస్తూ ఎర వేశాడు. నేను 2009లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన తర్వాత నటన వైపు వెళ్లాను. హిందీ, మలయాళం చిత్రాల్లో నటించాను. 2011-12లో హౌస్‌సర్జన్‌ పూర్తి చేశాను. ఆ సమయంలో విద్యాసాగర్‌ నిరంతరం ఫోన్లు, మెసేజ్‌లు చేసేవాడు. 2013లో విద్యాసాగర్‌ భార్య విడాకుల నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత నాతో మరింత స్నేహంగా వ్యవహరించేవాడు. నాకు రూ.10వేలు, రూ.20వేలు, రూ.30వేలు పంపి గిఫ్ట్‌లు కొనుక్కోమనేవాడు. తల్లిదండ్రులను హోటళ్లకు డిన్నర్లకు తీసుకెళ్లమనేవాడు. ముంబైలో మా ఇంటికి తరచుగా వచ్చి మా కుటుంబంతో కలిసి డిన్నర్‌ చేసేవాడు. నా తల్లిదండ్రులకు ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వడంతో పాటు వారి అకౌంట్స్‌లోకి డబ్బులు పంపేవాడు. 2013లో విద్యాసాగర్‌ భార్య విడాకుల కేసు గురించి తెలుసుకున్నాను. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి పుట్టిన తేదీ, జాతక వివరాలను పంపాడు. 2014లో తన ఖర్చులతో విజయవాడకు తీసుకొచ్చాడు. ఇక్కడే ఒక హోటల్‌లో వసతి ఏర్పాటు చేశాడు.


విజయవాడ, హైదరాబాద్‌లో విద్యాసాగర్‌ ఇళ్లు ఎక్కడో తెలియదు. అతడి స్వగ్రామం కోసూరు అని మాత్రం తెలుసు. ఆ గ్రామానికి నేను ఎప్పుడూ వెళ్లలేదు. విద్యాసాగర్‌ భార్య విడాకుల ప్రొసీడింగ్స్‌ను 2015లో చదివాను. అప్పుడు అతడి ప్రవర్తన, భార్యను ఏవిధంగా వేధించాడు, వివాహేతర సంబంధాల గురించి తెలుసుకున్నాను. ఓ కళాశాల యువతిని గర్భవతిని చేసి అబార్షన్‌ చేయించాడు. ఈ విషయాలు తెలిసిన తర్వాత అతడితో సంబంధాలను తెంచుకున్నాను. ముంబైలో 2015లో ఓ హోటల్‌లో మరో మహిళతో ఉండడం చూశాను. 2016 జనవరిలో విద్యాసాగర్‌ను చివరిసారిగా చూశాను. నేను అతడిని దూరం పెట్టడంతో దాన్ని చెడుగా తీసుకున్నాడు. తనతో ఉండమని గిఫ్ట్‌లు, డబ్బులు ఆఫర్‌ చేశాడు. రకరకాల మెసేజ్‌లు పంపి హింసించేవాడు. 2018లో తన మొబైల్‌ నుంచి అసభ్యకరమైన ఫొటోను నాకు పంపాడు. సోషల్‌ మీడియాలో ఉన్న నా ప్రొఫైల్‌ ఫొటోలు, డీపీలను 2009 నుంచి సంపాదించి క్రూరంగా వేధించేవాడు. మేము (కుటుంబం) 2017 డిసెంబరులో అహ్మదాబాద్‌కు వెళ్లిపోయాం. అక్కడ 2019 వరకు ఉన్నాం. 2020 జనవరి 30న ముంబైలో ఫ్లాట్‌ కొనుగోలు చేశాం. అయితే ఈ ఫ్లాట్‌ను 2018లో కొనుగోలు చేసినట్టు తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేశారు. అప్పటికి ఈ అపార్ట్‌మెంట్‌ను కనీసం నిర్మించలేదు.


2020 జూలైలో ఆధార్‌కార్డుపై ఉన్న అహ్మదాబాద్‌ చిరునామాను ముంబైకి మార్చుకున్నాం. విద్యాసాగర్‌ అతడికి సంబంధించిన వ్యక్తులు ఈ డాక్యుమెంట్లను నకిలీవిగా తయారు చేశారు. విద్యాసాగర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకుండా చేయడానికి నా సెల్‌ఫోన్లను సీజ్‌ చేశారు. కొంతమంది సివిల్‌ దుస్తుల్లో వచ్చి నా దగ్గర ఉన్న వస్తువులను లాక్కున్నారు. ఐదు సెల్‌ఫోన్లు, ఐప్యాడ్‌ను తీసుకుని మమ్మల్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత నన్ను అరెస్టు చేసిన విషయాన్ని కుక్కల విద్యాసాగర్‌కు తెలియజేశారు. నన్ను జుహు పోలీ్‌సస్టేషన్‌కు తరలించి అక్కడ నుంచి మేజిస్ట్రేట్‌ ఇంటికి తీసుకెళ్లారు. నన్ను, నా తల్లిని వేర్వేరు కార్లలో ఎక్కించారు. అరెస్టు చేసే సమయంలో ఏ పోలీ్‌సస్టేషన్‌ నుంచి వచ్చారో చెప్పలేదు. ఎలాంటి గుర్తింపు కార్డులు, వారెంట్లు చూపించలేదు. నేను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదు. నా తండ్రిని అదే రోజు సాయంత్రం ఇంటి వద్ద ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌తో కూడిన 10-12 మంది పోలీసులు అరెస్టు చేశారు. మా ఇంట్లో మమ్మల్ని దారుణంగా హింసించారు. ముంబై కోర్టు మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచేటప్పుడు కారులో మహిళా పోలీసులు కొట్టారు.


అప్పటి విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణా, ఎస్‌ఐ షరీ్‌ఫకు ఫోన్‌ చేసి మమ్మల్ని అరెస్టు చేశారా లేదా అని తెలుసుకున్నారు. నన్ను, తల్లిదండ్రులను వేర్వేరుగా ఉంచమని చెప్పారు. నవీ ముంబై దాటిన తర్వాత అర్ధరాత్రి మమ్మల్ని ఏపీకి తీసుకెళ్తున్నట్టు చెప్పారు. నన్ను ఒక కారులో, తల్లిదండ్రులను మరో కారులో తీసుకొచ్చారు. విజయవాడకు తీసుకువస్తున్న సమయంలో పోలీసులు మానసికంగా వేధించారు. కేసు నమోదు చేసిన మరుసటి రోజే ఎలాంటి పేపర్‌ వర్క్‌ పూర్తి చేయకుండా ముంబైకి వచ్చారు. ఆ మరుసటి రోజు రాత్రి జైలుకు తీసుకెళ్లిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌ కాపీ తీసుకుని చదివాను. నాపై తప్పుడు కేసు బనాయించారని అప్పుడు అర్థం చేసుకున్నాను. అప్పటి ఇంటెలిజెన్స్‌ డీజీ సీతారామాంజనేయులు, పోలీసు కమిషనర్‌ కాంతిరాణా, డీసీసీ విశాల్‌గున్నీతో ఈ ఆపరేషన్‌ చేయించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పూర్తి చేయడానికి విశాల్‌గున్నీని డిప్యూటేట్‌ చేశారు’’ అని ఫిర్యాదులో కాదంబరి పేర్కొన్నారు.


Also Read:

అవినీతి దందాకు ఆయనే దాదా..!

శోభాయాత్రకు రెడీ.. రూట్ మ్యాప్ ఇదే..

పామాయిల్‌ రైతులకు గుడ్ న్యూస్..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Sep 15 , 2024 | 09:49 AM