Share News

Chandrababu : పేదల జీవితాల్లో వెలుగులు నింపుతా

ABN , Publish Date - Aug 16 , 2024 | 05:36 AM

పేదల జీవితాల్లో వెలుగులు నింపుతానని, పేదలకు కడుపునిండాఅన్నంపెడితే అదే మానసిక సంతృప్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలోని రామబ్రహ్మం పార్కులో అన్నక్యాంటీన్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. సీఎం సతీమణి భువనేశ్వరి ప్రజలకు భోజనం వడ్డించారు.

Chandrababu : పేదల జీవితాల్లో వెలుగులు నింపుతా

  • పేదలకు కడుపునిండాఅన్నం పెడితే అదే సంతృప్తి

  • సెప్టెంబరు ఆఖరుకు రాష్ట్రంలో 203 అన్నక్యాంటీన్లు: సీఎం

  • గుడివాడలో అన్నక్యాంటీన్‌ను ప్రారంభించి

  • భోజనం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు

  • అన్న క్యాంటీన్లకు విరాళాల వెల్లువ.. ఒక్క రోజే రూ.2 కోట్లు

  • ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేసిన మున్సిపల్‌ శాఖ

  • అన్న క్యాంటీన్లకు విరాళాల వెల్లువ.. ఒక్క రోజే రూ.2 కోట్లు

  • ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేసిన మున్సిపల్‌ శాఖ

మచిలీపట్నం, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): పేదల జీవితాల్లో వెలుగులు నింపుతానని, పేదలకు కడుపునిండాఅన్నంపెడితే అదే మానసిక సంతృప్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలోని రామబ్రహ్మం పార్కులో అన్నక్యాంటీన్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. సీఎం సతీమణి భువనేశ్వరి ప్రజలకు భోజనం వడ్డించారు.

అనంతరం సీఎం, ఆయన సతీమణి ప్రజలతో కలసి అన్నక్యాంటీన్‌లోనే భోజనం చేశారు. భోజనంచేసే సమయంలో పేదలతో ముఖ్యమంత్రి మాట్లాడారు. త్వరలో జన్మభూమి 2.0 కార్యక్రమాన్ని అమలు చేసి ప్రజల కష్టాలను పరిష్కరిస్తామన్నారు. అన్నక్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలతో మాటామంతీ నిర్వహించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ తిరుపతిలో అన్నదానం ట్రస్ట్‌ను ప్రారంభించారని, ఆయన ప్రారంభించిన అన్నదానం ట్రస్ట్‌ ద్వారా టీటీడీతో సంబంధం లేకుండా రోజుకు లక్షమందికిపైగా భోజనం పెడుతున్నారని అన్నారు.

తూర్పుగోదావరి జిల్లా గన్నవరంలో డొక్కా సీతమ్మ వచ్చిన వారందరికీ భోజనం పెట్టేవారని, వీరిద్దరి స్పూర్తితో 2018లో అన్నక్యాంటీన్లను ప్రారంభించినట్లు తెలిపారు. తొలివిడతగా 100 అన్నక్యాంటీన్లను ప్రారంభిస్తామని, సెప్టెంబరు నెలాఖరుకు రాష్ట్రవ్యాప్తంగా 203 అన్నక్యాంటీన్లను ప్రారంభిస్తామని తెలిపారు. గిరిజనుల కోసం మండల కేంద్రాల్లో అన్నక్యాంటీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. వైసీపీ పాలకులు నిర్థాక్షిణ్యంగా అన్న క్యాంటీన్లను నిలిపివేసి ఐదేళ్లపాటు పేదల కడుపు మాడ్చారని అన్నారు.


ప్రజలతో కలిసి భోజనం చేయడం సంతృప్తినిచ్చింది: భువనేశ్వరి

గుడివాడలో అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రజలతో కలిసి భోజనం చేయడం ఎంతో సంతృప్తిని కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆమె సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు పెట్టారు. ‘స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రజలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం కలిగించింది. ఈరోజు ప్రారంభమైన అన్న క్యాంటీన్లు త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని కోరుకొంటున్నాను.

సామాన్యులందరికీ ఐదు రూపాయలకే రుచి, శుచి కలిగిన భోజనం అందుబాటులోకి రావాలి. రాష్ట్రంలో పేదలందరికీ ఆహార భద్రత లభించాలని ఆశిస్తున్నాను’ అని ఆమె ఆకాంక్షించారు.


దాతలు ముందుకురావాలి

ఒక్కో అన్నక్యాంటీన్‌కు రోజుకు రూ.26,250 ఖర్చవుతుందని, 203 అన్నకాం్యటీన్లకు రూ.53 లక్షలు అవుతుందన్నారు. ఈ ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం భరించలేదని, దాతలు ముందుకు వస్తే పథకాన్ని నిర్విరామంగా కొనసాగించవచ్చన్నారు.

తమ సంపాదనలో ఐదు శాతం నగదును అన్నక్యాంటీన్లకు విరాళాల రూపంలో ఇవ్వాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నక్యాంటీన్లకు విరాళాలు ఇచ్చేవారు 37818165097 ఖాతా నంబరుకు, ఐఎ్‌ఫఎ్‌సకోడ్‌ ఎస్‌బీఐ 0020541 నంబరుకు నగదు పంపవచ్చన్నారు.

డిజిటల్‌ పేమెంట్లను కూడా స్వీకరిస్తామని తెలిపారు. పెళ్లిరోజు, పుట్టినరోజు వేడుకలతోపాటు ఇంటిలో శుభకార్యాలు జరిగే సమయంలో కొంతమేర ఖర్చును తగ్గించుకుని పేదలకు పట్టెడన్నం పెట్టే అన్నక్యాంటీన్లకు విరాళాలు అందజేయాలని కోరారు. జిల్లాకు చెందిన ఎంపీ, ఏడుగురు ఎమ్మెల్యేలు రూ.50 లక్షలను అన్నక్యాంటీన్లకు విరాళాలు ప్రకటించారు. దండమూడి చౌదరి రూ.5,07,779ల చెక్కును సీఎంకు అందజేశారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్‌ రాజా, యార్లగడ్డ వెంకట్రావు, మండలి బుద్ధప్రసాద్‌, బోడే ప్రసాద్‌, కాగిత కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2024 | 06:34 AM