Share News

Top Ten: 2024 పాదముద్రలు

ABN , Publish Date - Dec 31 , 2024 | 02:09 AM

రోడ్‌షోలు.. హామీలు.. ప్రలోభాలు.. బెదిరింపులు.. అయినా ప్రశాంతంగానే ఎన్నికలు జరిగాయి. ఆశలు, అంచనాలు తలకిందులయ్యాయి. జగన్‌ పార్టీకి తీవ్ర భంగపాటును 2024 మిగిల్చింది. చంద్రబాబు సారధ్యంలోని కూటమికి అనూహ్యమైన విజయాన్ని అందించింది.

Top Ten: 2024 పాదముద్రలు
ప్రధాన సందర్భాల సమాహారం

చిత్తూరు,ఆంధ్రజ్యోతి: రోడ్‌షోలు.. హామీలు.. ప్రలోభాలు.. బెదిరింపులు.. అయినా ప్రశాంతంగానే ఎన్నికలు జరిగాయి. ఆశలు, అంచనాలు తలకిందులయ్యాయి. జగన్‌ పార్టీకి తీవ్ర భంగపాటును 2024 మిగిల్చింది. చంద్రబాబు సారధ్యంలోని కూటమికి అనూహ్యమైన విజయాన్ని అందించింది. విర్రవీగి, నోటికి పనిచెప్పిన నేతలంతా నేలకరిచారు. అప్పులకుప్పగా మిగిలిన ఏపీలో ఒక సవాలుగా కూటమి పాలన మొదలైంది. రెండు భిన్న దృశ్యాలకు సాక్షిగా మిగిలిన 2024లో చిత్తూరు జిల్లాపై ప్రభావం చూపిన ప్రధాన సందర్భాల సమాహారం ఇది..

జనవరి 2: ఎంఎస్‌ బాబు హడావిడి

పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు జనవరి 2వ తేదీన ప్రెస్‌మీట్‌ పెట్టారు. తనకు ఈ సారి ఎన్నికల్లో వైసీపీ టికెట్‌ ఇవ్వడం లేదంటూ అధిష్ఠానంపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. ‘ పైవారు చెప్పినట్లు చేసిన తనకు ఇప్పుడు మంచి పేరు లేదని టికెట్‌ ఇవ్వకుంటే ఎలా? అంటే దీనికి కారణం పైవారే కదా? దళితులకు అన్యాయం చేస్తున్నారు. సీఎం జగన్‌ ఓసారి కూడా పిలిచి మాట్లాడలేదు’ అంటూ తీవ్ర స్థాయిలో మాట్లాడారు. మళ్లీ జనవరి 5న తేదీన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ‘నేనేం తప్పుగా మాట్లాడలేదు. ఎల్లో మీడియా వక్రీకరించింది’ అంటూ యూటర్న్‌ తీసుకున్నారు.పెద్దిరెడ్డి మందలించడంతో ఆయన మాట మార్చారనే ప్రచారం జరిగింది.చివరకు ఏప్రిల్‌ 6న షర్మిల సమక్షంలో ఎంఎస్‌ బాబు కాంగ్రె్‌సలో చేరి, మళ్లీ పూతలపట్టు నుంచే అసెంబ్లీకి పోటీ చేశారు.

ఫిబ్రవరి 26 : జగన్‌ నవ్వుల పాలు

చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పానికి తామే నీళ్లిచ్చామని చెప్పుకోవడానికి తాపత్రయపడిన అప్పటి సీఎం జగన్‌ చివరకు నవ్వులపాలయ్యారు. 2019నాటికి మిగిలిన 10 శాతం కుప్పం బ్రాంచి కెనాల్‌ పనులను కూడా పూర్తి చేయలేక చేతులెత్తేసిన జగన్‌, ఫిబ్రవరి 26న కృష్ణాజలాలను వదులుతున్నట్లు రామకుప్పంలో హంగామా చేశారు.అయితే మరుసటి రోజే అక్కడి గేట్లను తీసేయడం, నీటి ప్రవాహం ఆగిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా జగన్‌ నవ్వులపాలయ్యారు.

మార్చి 7 : అదృష్టవంతుడు ఆరణి

అసెంబ్లీ టికెట్‌ ఇవ్వడం కుదరదని చెప్పి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తామని జగన్‌ మోసం చేశాడంటూ చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు.చివరకు జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ సమక్షంలో మార్చి 7న ఆ పార్టీలో చేరి కూటమి కోటాలో తిరుపతి అసెంబ్లీ టికెట్‌ తెచ్చుకున్నారు. 2019-24 నడుమ చిత్తూరులో వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన, 2024 నుంచి మరో ఐదేళ్ల పాటు తిరుపతి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించనున్నారు. జూన్‌ 5న విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో అత్యధిక మెజార్టీ సాధించారు.

ఏప్రిల్‌ 29: బీసీవై అధినేతపై దాడి

పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్వగ్రామమైన సదుం మండలంలోని ఎర్రాతివారిపల్లెకు బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌ వెళితే.. అక్కడి వైసీపీ నాయకులు ఆయనపై దాడికి దిగారు. 11 వాహనాల్ని ధ్వంసం చేశారు. పోలీ్‌సస్టేషన్‌ ఎదుటే ప్రచార రథాన్ని దగ్ధం చేశారు. చాలామంది బీసీవై కార్యకర్తల్ని గాయపరిచారు.ఈ సంఘటనకు సంబంధించి ఎన్నికల సంఘం డీఐజీ అమ్మిరెడ్డిని, పలమనేరు డీఎస్పీ మహేశ్వర రెడ్డిని బదిలీ చేసి, సదుం ఎస్‌ఐ మారుతిని సస్పెండ్‌ చేసింది.కాగా ఎన్నికల అఫిడవిట్‌లో తన పేరుతో, తన భార్య పేరుతో ఉన్న 142 ఆస్తుల వివరాలను చూపించని పెద్దిరెడ్డిపై అనర్హత వేటు వేయాలని బీసీవై నేత రామచంద్రయాదవ్‌ మే 23వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు.

జూన్‌ 5: దిమ్మతిరిగేలా ఎన్నికల ఫలితాలు

ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికలు జగన్‌ పార్టీకి దిమ్మతిరిగే తీర్పునిచ్చాయి. వైసీపీ ఎమ్మెల్యేల, వారి అనుచరుల అరాచకాలను భయంతో మౌనంగా భరించిన ప్రజలు ఓట్ల ద్వారా తమ వ్యతిరేకతను ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో పుంగనూరు మినహా అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు ఓ పార్లమెంటు స్థానాన్ని మంచి మెజారిటీలతో కూటమి అభ్యర్థులు దక్కించుకున్నారు. చిత్తూరు పార్లమెంటు పరిధి పరంగా చూస్తే 7 అసెంబ్లీ స్థానాలూ కూటమికే దక్కాయి.ఎంపీ దగ్గుమళ్లకు వచ్చిన మెజార్టీ గతంలో ఎవరికీ రాకపోవడం విశేషం.

జూన్‌ 15: గోబ్యాక్‌ పెద్దిరెడ్డి

దాదాపు 15యేళ్లుగా పుంగనూరు నియోజకవర్గాన్ని శాసించిన పెద్దిరెడ్డికి పరాభవం ఎదురైంది. జూన్‌ 15న పుంగనూరుకు వస్తారని తెలిసి పట్టణంలో గోబ్యాక్‌ పెద్దిరెడ్డి అంటూ కూటమి నేతలు ధర్నాకు దిగారు. దీంతో తిరుపతిలోనే పోలీసులు ఆయన్ను హౌస్‌ అరెస్టు చేశారు. జూలై 18న ఎంపీ మిథున్‌రెడ్డి పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంట్లో ఉండగా.. నేతిగుట్లపల్లె ప్రాజెక్టు నిర్వాసిత రైతులు ముంపు భూములకు పరిహారం ఇవ్వలేదని కూటమి నేతలతో కలిసి నిరసనకు దిగారు.జూన్‌ 28న పుంగనూరు మున్సిపల్‌ ఛైర్మన్‌ అలీంబాషా సహా 11 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు పార్టీ ఇన్‌ఛార్జి చల్లా బాబును కలవడం చర్చకు దారి తీసింది.

జూన్‌ 25: కుప్పంలో సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించారు.ఎన్నికలకు ముందు మార్చి 25న అక్కడినుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.27న పలమనేరులో ప్రజాగళం పేరుతో ప్రచార యాత్ర ప్రారంభించి పుత్తూరు,మదనపల్లెల్లో పర్యటించారు. రెండో విడతలో మే 7వ తేదీన రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి పుంగనూరులో ప్రచారం నిర్వహించారు. మే 11న చిత్తూరులో ప్రజాగళం నిర్వహించి తన ప్రచారాన్ని ముగించారు.

జూలై 5: చిత్తూరు మున్సిపాలిటీ టీడీపీ పరం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోనే చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని మేయర్‌ అముద సహా 21 మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ హయాంలో దొంగ సంతకాలతో, అక్రమ ఏకగ్రీవాలతో చాలామంది కార్పొరేటర్లుగా గెలిచిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే మున్సిపాలిటీ మొత్తం టీడీపీకి దక్కడం చిత్తూరు నుంచే ప్రారంభమైంది. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ చిత్తూరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కార్పొరేటర్లను టీడీపీలోకి ఆహ్వానించినట్లు ప్రకటించారు.

29 నవంబర్‌: భయపెట్టిన తుపాన్లు

ఆగస్టు, సెప్టెంబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో సంభవించిన నాలుగు తుపాన్లు జిల్లాలో వానలు కురిపించాయి.పలు చెరువులు నిండిపోగా ఎన్టీఆర్‌, కృష్ణాపురం ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారు.సదుం, నగరి, శ్రీరంగరాజపురం,విజయపురం ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి రోడ్లను అడ్డగించాయి.పంటలను ముంచెత్తాయి.

18 డిసెంబర్‌ : కుప్పంపై భువనేశ్వరి దృష్టి

సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి ప్రత్యేక దృష్టి సారించారు. ఏప్రిల్‌ 19వ తేదీన చంద్రబాబు తరఫున నామినేషన్‌ వేశారు. మే 7, 8 తేదీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చాక జూలై 23న కుప్పం వచ్చిన ఆమె నాలుగు రోజుల పాటు పర్యటించారు. ఈ నెల 18వ తేదీన కుప్పం చేరుకుని నాలుగు రోజుల పాటు ఆమె నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, మహిళలతో సమావేశమయ్యారు.కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబం కూడా కట్టుబడి వుందని ప్రకటించారు.


తిరుపతి జిల్లాలో..

14 మే: పులివర్తి నానిపై దాడి

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీపై ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద జరిగిన హత్యాయత్నం రాష్ట్రంలోనే సంచలనం అయ్యింది. వైసీపీ బరితెగింపు రాజకీయాలను ఈ సంఘటన బట్టబయలు చేసింది. మే 13న పోలింగ్‌ జరగగా మరుసటి రోజు మహిళా వర్శిటీ ఆవరణలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించేందుకు వెళ్ళిన పులివర్తి నానీపై వైసీపీ వర్గీయులు సమ్మెట, కర్రలతో దాడి చేశారు. నానీ వాహనం ధ్వంసం అయ్యింది. ఆయన గాయపడ్డారు. ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాలు, నానీ వాహనానికి అమర్చిన కెమెరాల ఫుటేజీల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌ అయ్యాయి. దీనిపై ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకుని నానీపై దాడి ఘటన సహా పోలింగ్‌ రోజు జరిగిన ఘటనలపైనా దర్యాప్తునకు సిట్‌ను నియమించింది. ఈ ఘటన చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలను తారుమారు చేసింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిలు తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారంటూ నానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

4 జూన్‌: దిమ్మదిరిగేలా ఫలితాలు

ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికలు జగన్‌ పార్టీకి దిమ్మతిరిగే తీర్పునిచ్చాయి. వైసీపీ ఎమ్మెల్యేల, వారి అనుచరుల అరాచకాలను భయంతో మౌనంగా భరించిన ప్రజలు ఓట్ల ద్వారా తమ వ్యతిరేకతను ప్రకటించారు. తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేట, గూడూరు తదితర ఆరు పూర్తి నియోజకవర్గాలు, నగరి, వెంకటగిరి తదితర రెండు పాక్షిక నియోజకవర్గాలు.. మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా వైసీపీ తిరుపతి ఎంపీ స్థానాన్ని మాత్రమే అదీ స్వల్ప తేడాతో నిలబెట్టుకుంది.

12 జూన్‌ : ముఖ్యమంత్రిగా మూడోసారి

నారావారిపల్లె బిడ్డ చంద్రబాబు నాయుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అదేరోజు తిరుమలకు వచ్చిన ఆయన జూన్‌13న శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే అక్టోబరు4వ తేదీన మరోసారి తిరుమలకు చేరుకుని బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్ర్తాలు సమర్పించారు.

12 ఆగస్టు : తిరుపతిని కుదిపేసిన టీడీఆర్‌ బాండ్లు

తిరుపతి అసెంబ్లీ ఎన్నికను తీవ్రంగా ప్రభావితం చేసిన అంశం మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల అవినీతి. అధికార వైసీపీ దీనిని గొప్ప అభివృద్ధి అని చెప్పుకోగా విపక్షాలు దీని వెనుక అవినీతి ఉందని ఆరోపణలు చేశాయి. కొన్ని రోడ్లకు భూమన కరుణాకరరెడ్డి చైర్మన్‌గా ఉన్న టీటీడీ పాలకమండలి నిధులు ఇవ్వాలని తీర్మానించడం పెను వివాదంగా మారింది. రోడ్ల విస్తరణ పేరుతో టీడీఆర్‌ బాండ్ల జారీ వెనుక వెయ్యి కోట్లకు పైగా అవినీతి జరిగిందని టీడీపీ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దీనిపై విచారణ ఆగస్టు 12న విచారణకు ఆదేశించింది.

26 ఆగస్టు: కౌశిక్‌కు మానవీయ సాయం

ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న తిరుపతి యువకుడు కౌశిక్‌ (19) వార్తకు మానవీయ స్పందన లభించింది. చికిత్స కోసం రూ. 60 లక్షలు ఖర్చవుతుందంటూ తల్లి సరస్వతమ్మ మీడియా ముం కన్నీరుమున్నీరవుతూ తన కొడుకు ప్రాణం కాపావాలని వేడుకున్నారు. జూనియర్‌ ఎన్టీయార్‌ వీరాభిమాని అయిన కౌశిక్‌, చనిపోయే లోపు దేవర సినిమా చూడాలనుకుంటున్నాడని వెల్లడించారు. స్పందించిన జూనియర్‌ ఎన్టీయార్‌ వీడియో కాల్‌ చేసి కౌశిక్‌తో మాట్లాడి ధైర్యం చెప్పారు. కోలుకున్నాక వచ్చి కలుస్తానని మాటిచ్చారు. కౌశిక్‌ తండ్రి టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగి అయినా టీటీడీ మానవీయంగా స్పందించి రూ.40 లక్షల సాయం అందించింది. చికిత్స పూర్తయ్యాక అదనంగా అయిన బిల్లు రూ. 12 లక్షలు జూనియర్‌ ఎన్టీయార్‌ చెల్లించారు. అందరి మానవీయ సాయంతో కౌశిక్‌ కోలుకుంటున్నాడు.

18 సెప్టెంబరు: లడ్డూలో కల్తీ నెయ్యి

భక్తులు పవిత్రంగా భావించే లడ్డూలో కల్తీ నెయ్యి కలిపి అపవిత్రం చేశారనే అంశం దేశవ్యాప్తంగా భగ్గుమంది. ఈ అంశాన్ని తొలిసారి పార్టీ సమావేశంలో చంద్రబాబు ఆవేదనగా ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వంలో టెండరు దక్కించుకున్న దిండిగల్‌కు చెందిన ప్రైవేటు డెయిరీ టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిందని శాంపిల్‌ పరీక్షించిన ప్రముఖ ల్యాబ్‌ నిర్ధారించింది. పందికొవ్వు వంటి ఆనవాళ్లు ఆ నెయ్యిలో ఉన్నాయనే ఆరోపణలు భక్తులను తీవ్రంగా కలిచివేశాయి. ఈ నేపథ్యంలో జగన్‌ తిరుమల పర్యటననే రద్దు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ అంశంపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించగా సుప్రీం కోర్టు ఏకంగా . సీబీఐ, ఏపీ పోలీస్‌, కేంద్ర ఆహార భద్రత విభాగం ఉన్నతాధికారులతో సిట్‌ ఏర్పాటు చేసింది.

4 నవంబరు: రాజకీయ అత్యాచారం

ఎర్రావారిపాలెం మండలం ఎల్లమంద ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగిందంటూ అధికారం కోల్పోయిన వైసీపీ నేతలు నానా రచ్చ చేశారు. సోషల్‌ మీడియాలో హోరెత్తించారు. ఆసుపత్రిలో ఉన్న బాలికను పరామర్శించేందుకు రోజా, భూమన కరుణాకరరెడ్డి, అభినయరెడ్డి, నారాయణస్వామి వచ్చి నిరసన తెలిపారు. నా బిడ్డపై దాడి మాత్రమే జరిగిందంటూ తండ్రి చేతులు జోడించి వేడుకోవాల్సి వచ్చింది. తమ కుమార్తె భవిష్యత్తును దెబ్బతీశారని మైనర్‌ బాలిక తండ్రి ఫిర్యాదు చేశాడంటూ పోలీసులు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు మరికొందరిపై పోక్సో, ఎస్సీ అట్రాసిటీ తదితర చట్టాల కింద కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు తనతో తప్పుడు ఫిర్యాదు చేయించారని ఆ తర్వాత తండ్రి , భూమన కరుణాకర్‌రెడ్డి ఇంట్లో మీడియాతో తెలిపారు. మొత్తం మీద ఈ వ్యవహారం పేద దళిత మైనర్‌ బాలిక కుటుంబంపై జరిగిన రాజకీయ అత్యాచారంగా పరిణమించింది.

29 నవంబరు: భయపెట్టిన ఫెంగల్‌

ఫెంగల్‌ తుపాను జిల్లాను కలవరపరిచింది. వరుసగా కురిసిన నవంబరు ఆఖరులో పట్టుకున్న వానలు డిసెంబరు తొలివారం దాకా విడవలేదు. జిల్లాలోని చెరువులు నిండిపోయాయి. ప్రాజెక్టులు గేట్లు ఎత్తేశారు. వాగులు, వంకలు పొంగి రోడ్లను అడ్డగించాయి. జిల్లా తూర్పు ప్రాంతం తీవ్రవంగా తుఫాను ప్రభావానికి గురైంది. అయితే జిల్లా సరిహద్దుల్లో తమిళనాడులో తీరం దాటు తుందనుకున్న తుపాను కరుణించి వెళ్లిపోయింది. ఆగస్టు, సెప్టెంబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో సంభవించిన నాలుగు తుపాన్లు జిల్లాకు వానలు కురిపించాయి.

18 డిసెంబరు: శ్రీసిటీలో ఇసుజి లక్షవ కారు

భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన సెజ్‌గా శ్రీసిటీ రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతోంది. శ్రీసిటీలోని జపాన్‌కు చెందిన ఇసుజి మోటార్స్‌ ఇండియా ప్లాంట్‌ లో తయారైన లక్షవ కారును మేడిన్‌ ఇండియా పేరిట విడుదల చేశారు.

30 డిసెంబరు: 99వ రాకెట్‌ ఎగిరింది

మన జిల్లాలోని శ్రీహరికోట నుంచి 99వ రాకెట్‌ దిగ్విజయంగా అంతరిక్షంలోకి దూసుకుపోయింది. పిఎ్‌సఎల్వీ-సి 60 రాకెట్‌ రెండు ఉపగ్రహాలను మోసుకుపోయింది. మన సొంత అంతరిక్ష కేంద్రం నెలకొల్పే దిశగా సాగిన ప్రయోగం ఇది. ఇక ఈ ఏడాది శ్రీహరికోట నుంచి ఇస్రో ఐదు రాకెట్‌లను విజయవంతంగా ప్రయోగించింది. నాలుగు పూర్తిగా దేశీయ అవసరాల కోసం చేపట్టగా ఒకటి మాత్రం యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ తరపున శాటిలైట్‌ను ప్రయోగించారు.

Updated Date - Dec 31 , 2024 | 02:09 AM