Share News

Guntur : లక్ష చేతిలో పెట్టి కిడ్నీ కాజేశారు..!

ABN , Publish Date - Jul 09 , 2024 | 04:50 AM

ఆర్థిక ఇబ్బందులు... అప్పుల బాధలు... లోన్‌ యాప్‌ వేధింపులను ఆసరాగా చేసుకుని కిడ్నీ రాకెట్‌ ముఠా ఓ నిరుపేద యువకుడిని మోసం చేసింది. కిడ్నీ దానం చేస్తే రూ.30 లక్షలు ఇస్తామని ఆశ చూపించి..

Guntur : లక్ష చేతిలో పెట్టి కిడ్నీ కాజేశారు..!

  • తొలుత రూ.30 లక్షలు ఇస్తామని ఒప్పందం

  • ఆపరేషన్‌ చేసి కిడ్నీ తీసుకున్నాక అంతే సంగతులు

  • డబ్బుల కోసం నిలదీస్తే చంపేస్తామని బెదిరింపులు

  • విజయవాడలో కిడ్నీ రాకెట్‌ ముఠా ఆగడాలు

  • న్యాయం కోరుతూ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు

గుంటూరు, జూలై 8: ఆర్థిక ఇబ్బందులు... అప్పుల బాధలు... లోన్‌ యాప్‌ వేధింపులను ఆసరాగా చేసుకుని కిడ్నీ రాకెట్‌ ముఠా ఓ నిరుపేద యువకుడిని మోసం చేసింది. కిడ్నీ దానం చేస్తే రూ.30 లక్షలు ఇస్తామని ఆశ చూపించి.. లక్ష రూపాయలు చేతిలో పెట్టి కిడ్నీ కొట్టేసింది. పక్కా ప్లాన్‌ ప్రకారం జరుగిన ఈ ఈ కిడ్నీ రాకెట్‌ వ్యవహారం విజయవాడలో వెలుగుచూడగా.. బాధితుడు సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. మధుబాబు ఫిర్యాదు మేరకు.. పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రాంతానికి చెందిన గార్లపాటి మధుబాబుకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. శైలు అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్న మధు ఆ తర్వాత కాపురాన్ని గుంటూరుకు మార్చాడు.

వీరికి 9 ఏళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. మధుబాబు గుంటూరులో కూరగాయల వ్యాపారం, నూడిల్స్‌ బండి నడిపాడు. వ్యాపారాల్లో నష్టాలు వచ్చాయి. కరోనా సమయంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. రూ.8 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. లోన్‌ యాప్‌ల్లోనూ అప్పులు చేశాడు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో కిడ్నీ డోనర్‌ కావాలనే ప్రకటన మధుబాబును ఆకర్షించింది. దీంతో తన కిడ్నీ దానం చేసి వచ్చిన సొమ్ముతో అప్పులు తీర్చేసుకోవచ్చని ఆశపడ్డాడు. కిడ్నీ దానం చేసేందుకు ఫేస్‌బుక్‌ లింక్‌పై నొక్కాడు. కొద్దిరోజుల తర్వాత బాషా (9390003970) అనే వ్యక్తి ఫోన్‌ చేసి మధ్యవర్తి వెంకట్‌ నంబర్‌ (8899269999) ఇచ్చాడు. దీంతో మధుబాబు ఆ నంబర్‌కు కాల్‌ చేశాడు. బి-పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూపు ఉన్న వ్యక్తి కిడ్నీ దానం చేస్తే రూ.30 లక్షలు వరకు ఇప్పిస్తానని వెంకట్‌ చెప్పాడు.


రోగి బావ అయిన నిమ్మకాయల సుబ్రహ్మణ్యంను పరిచయం చేసి ఆన్‌లైన్‌ ద్వారా కొద్దిపాటి డబ్బు పంపి నమ్మకం కలిగించాడు. కిడ్నీ దానం చేయాలంటే సమీప బంధువై ఉండాలని చెప్పి మధుబాబుతో పాటు ఆయన సంబంధీకులందరి ఆధార్‌ కార్డులు, ఇతర వివరాలను మార్పించాడు. ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ను కూడా సిద్ధం చేశాడు. తన ఇష్టపూర్వకంగానే కిడ్నీ దానం చేస్తున్నానని మధుబాబుతో చెప్పిస్తూ.. వెంకట్‌, కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేసే ‘శరత్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ’ ఆస్పత్రి వైద్యుడు జి.శరత్‌బాబు కలిసి వారికి అవసరమైన విధంగా వీడియోలు తీసుకున్నారు.

ఎడమ కిడ్నీ అని చెప్పి...

జూన్‌ 10న మధుబాబును ఆస్పత్రిలో చేర్చుకుని.. 15న కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేశారు. తొలుత ఎడమ పక్క కిడ్నీ తీసుకుంటామని చెప్పిన వైద్యుడు ఆపరేషన్‌ సమయంలో కుడివైపు కోత పెట్టడంతో ఆపరేషన్‌ సమయంలోనే మధుబాబు ప్రశ్నించాడు. కానీ.. డాక్టర్‌ అతన్ని దూషించి బెదిరించాడు. ఆపరేషన్‌ పూర్తయ్యాక పరిశీలించగా తన కుడివైపు కిడ్నీ తీసి కేతినేని వెంకటస్వామి అనే వ్యక్తికి అమర్చారని మధుబాబు చెప్పారు.

గతేడాది నవంబరులో తాను పరిచయమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో ఫోన్‌ పే ద్వారా రూ.59,500 ఇచ్చారని, ఆస్పత్రిలో చేరే సమయంలో రూ.50 వేలు ఇచ్చారని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో తనకు రావలసిన మొత్తం ఇవ్వాలని అడిగితే.. నీకు ఇష్టమయ్యే కదా కిడ్నీ ఇచ్చావు’ అన్నారు. గట్టిగా అడిగితే ‘‘ఏం చేస్తావురా.. నీకు డబ్బులు రావు, ఏం పీక్కుంటావో పీక్కో.. దిక్కున్న చోట చెప్పుకో. కిడ్నీ తీసిన వాళ్లం.. నీ ప్రాణం తీయడం పెద్ద లెక్కా.. చంపేస్తాం’ అని బెదిరించారు.

తనను మోసం చేసిన బాషా, వెంకట్‌, సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ శరత్‌బాబు, వెంకటస్వామిలపై చట్టం ప్రకారం చర్యలు తీసుకొని, తనకు న్యాయం చేయాలని మధుబాబు వాపోయాడు. విజయవాడలోని శరత్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీఆస్పత్రి, దానికి అనుబంధంగా ఉం డే మరో ఆస్పత్రిలోనూ ప్రతినెలా 5-10 కిడ్నీ మార్పి డి ఆపరేషన్లు చేస్తున్నారని తెలిసిందని చెప్పాడు.


ప్రభుత్వ నిబంధనల ప్రకారమే చేశాం

  • ఆరోపణలను ఖండించిన డాక్టర్‌ శరత్‌బాబు

విజయవాడ, జూలై 8 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో కిడ్నీ రాకెట్‌ వ్యవహారం మరోసారి కలకలం రేపింది. గతంలో స్వర ఆసుపత్రిపై ఆరోపణలు రాగా, తాజాగా శరత్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ ఆస్పత్రిపై ఆరోపణలు వచ్చాయి. తన నుంచి కిడ్నీ తీసుకుని మోసం చేశారని గార్లపాటి మధుబాబు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఆరోపణలను డాక్టర్‌ శరత్‌బాబు ఖండించారు. కేతినేని వెంకటస్వామికి గత నెలలో కిడ్నీ మార్పిడి చేశామని, ప్రభుత్వ నిబంధనలు పాటించి, ఆరోగ్యశ్రీ పథకంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ ఆపరేషన్‌ చేశామని చెప్పారు. అవయవదానంలో ఆర్థిక లావాదేవీలకు అవకాశం ఉండదన్నారు. రెవెన్యూ, పోలీసు శాఖల నుంచి అనుమతి వచ్చాకే రోగి కుటుంబ మిత్రుడైన మధుబాబు కిడ్నీని వెంకటస్వామికి అమర్చామని చెప్పారు.

Updated Date - Jul 09 , 2024 | 04:50 AM