Share News

Central Budget: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అగ్రనేతలు ఏమన్నారంటే?

ABN , Publish Date - Jul 23 , 2024 | 06:19 PM

లోక్ సభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉపాధి, నైపుణ్య శిక్షణ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు.

Central Budget: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అగ్రనేతలు ఏమన్నారంటే?

ఢిల్లీ: లోక్ సభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉపాధి, నైపుణ్య శిక్షణ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. 4.1కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకోవడంపై కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా భూపతిరాజు శ్రీనివాస వర్మ సంతోషం వ్యక్తం చేశారు. వ్యవసాయంలో ఉత్పాదకత, స్థితిస్థాపకత, పట్టణాభివృద్ధి, తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం, మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పిచడంపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈసారి బడ్జెట్‌లో ఏపీ ప్రత్యేక శ్రద్ధ చూపడంపై ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.


ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చేలా బడ్జెట్..

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.."ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. రానున్న రోజుల్లో ఏపీకి పెద్దఎత్తున్న నిధులు కేటాయిస్తామని కేంద్రం చెప్పింది. ఎన్నికల్లో కూటమిగా టీడీపీ, బీజేపీ, జనసేనా పోటీ చేసింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. దేశ ఆర్థిక ప్రగతిని ముందుకు తీసుకెళ్లేలా బడ్జెట్ ఉంది. కేంద్ర మంత్రి సీతారామన్ జనరంజక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పన, గృహ నిర్మాణం, మహిళా సంరక్షణ కోసం నిధులు కేటాయించారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చేలా బడ్జెట్ ప్రకటించారు. భవిష్యత్తులో ఏపీ అభివృద్ధికి కేంద్రం నిధుల కేటాయింపు కొనసాగుతుంది" అని చెప్పారు.


ఏపీ రాజధాని బాధ్యత మోడీ ప్రభుత్వం తీసుకుంది..

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ.. ఎన్డీఏ విధానాలు దేశ ప్రజలు మెచ్చి మూడోసారి ప్రధాని మోడీకి అధికారం ఇచ్చారు. ఈసారి బడ్జెట్‌లో నాలుగు ప్రధాన రంగాలపై దృష్టి కేంద్రీకరించారు. పేదలు, యువత, మహిళలు, రైతులకు పెద్దపీట వేశారు. వైసీపీ నేతలు మూడు రాజధానులు అని చెప్పి అమరావతిని నిర్వీర్యం చేశారు. కానీ కేంద్ర బడ్జెట్‌లో అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్లు కేటాయించారు. ఇతర సంస్థల నుంచి వనరులను తీసుకొచ్చేలా కేంద్రం గ్యారంటీ ఇస్తామని చెప్పింది. ఏపీ రాజధాని బాధ్యతను మోడీ ప్రభుత్వం తీసుకుందని స్పష్టంగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం కట్టుబడి ఉంది. ఏ రాష్ట్రం ఆర్థికంగా ముందుకెళ్లాలన్నా మౌలిక వసతులు కీలకం. గడచిన ఐదేళ్లుగా రోడ్లను ఎలా విస్మరించారో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మౌలిక వసతుల కల్పన, పునర్నిర్మాణంపై ఫోకస్ పెట్టాం. కొప్పర్తి ఇండస్ట్రీయల్ నోడ్‌కు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని బడ్జెట్‌లో చెప్పాం. ఓర్వకల్లు ఇండస్ట్రీయల్ నోడ్‌కు కూడా కేంద్రం పూర్తి సహాయం అందిస్తామని చెప్పింది. దీని ద్వారా రాయలసీమ అభివృద్ధి వేగవంతం కానుంది. పూర్వోదయ పేరుతో తూర్పు రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టామని" చెప్పుకొచ్చారు.


ఏపీకి రానున్న ఇండస్ట్రీయల్ కారిడార్లు..

పోలవరం కుడి, ఎడమ కాలువల విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. అమరావతికి రూ.15వేల కోట్లు అనేవి రుణం కాదని అవి గ్రాంట్ కింద ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ నగదుకు కేంద్రం బాధ్యత తీసుకుంటుందని ఎంపీ చెప్పారు. అదనంగా ఇతర సంస్థల నుంచి నిధులను కేంద్రం సమకూరుస్తుందని సీఎం రమేశ్ వెల్లడించారు. అమరావతికి 6నెలలకి కేంద్ర బడ్జెట్‌లో రూ.15వేల కోట్లు కేటాయించారని, వచ్చే సంవత్సరం కూడా సహకారం అందిస్తామని కేంద్రం చెప్పిందన్నారు. పారిశ్రామిక కారిడార్ల ఒక్కో దాని కింద రూ.25వేల కోట్ల పెట్టుబడులు, మౌలిక వసతులు రాష్ట్రానికి వస్తాయని ఎంపీ వెల్లడించారు. ఉత్తరాంధ్రకు సైతం రకరకాల ఇండస్ట్రీయల్స్ వస్తాయన్నారు. చోడవరంలో 5వేల ఎకరాల్లో ఇండస్ట్రీయల్ కారిడార్ తీసుకొస్తామని చెప్పారు. ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి ఏపీ ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్పామని" తెలిపారు.

Updated Date - Jul 23 , 2024 | 06:39 PM