Share News

CM Chandrababu: ఢిల్లీకి చంద్రబాబు.. ఏం చేయబోతున్నారు..?

ABN , Publish Date - Jul 25 , 2024 | 08:18 PM

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. శుక్రవారం (జూలై 26) సాయంత్రం ఆరు గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి 8 గంటల ప్రాంతంలో ఢిల్లీ చేరుకోనున్నారు.

CM Chandrababu: ఢిల్లీకి చంద్రబాబు.. ఏం చేయబోతున్నారు..?
CM Nara Chandrababu Naidu

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. శుక్రవారం (జూలై 26) సాయంత్రం ఆరు గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి 8 గంటల ప్రాంతంలో ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటనపై సీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది. 27వ తేదీన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు తెలిసింది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.


ఢిల్లీలో ఏం చేయబోతున్నారు..?

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ప్రధానంగా పోలవరం అంశాన్ని కేంద్రం పెద్దల ఎదుట ప్రస్తావించనున్నారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ ముందు ప్రతిపాదనలు ఉంచనున్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా గతంలో నిర్దేశించిన మేరకే కట్టుబడి ఉండాలని గురువారం ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీర్మానించిన అంశాన్ని కూడా ఆయన కేంద్రానికి వివరించనున్నారు. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన అనంతరం అదే రోజు సాయంత్రం విజయవాడకు తిరిగి రానున్నారు.


నిధులు కూడా..!

రాజ‌ధాని నిర్మాణం, పోల‌వ‌రానికి నిధులు, విశాఖ రైల్వే జోన్‌తో పాటు వివిధ పెండింగ్ ప్రాజెక్టుల‌కు నిధులు విడుద‌ల, ఏపీకి పారిశ్రామిక రాయితీలు, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు స‌హ‌కారం, రోడ్లు మ‌ర‌మ్మత్తులు వంటి అంశాల‌ను లేవ‌నెత్తనున్నారు. ఈ అంశాల‌పై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల‌కు విజ్ఞప్తి చేయ‌నున్నారు.


కేబినెట్ సమావేశంలో..

మరోవైపు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం నాడు సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. డయాఫ్రం వాల్‌పై కేబినెట్‌లో తీర్మానం చేశారు. నీతి అయోగ్ సమావేశంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పెట్టాల్సి ఉండటంతో దానిపై కేబినెట్‌లో చర్చించారు.


కాగా.. ఈనెల 23న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి వరాల జల్లు కురిసింది. ఏపీకి ప్రత్యేక ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించినట్టు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించిన విషయం తెలిసిందే. అమరావతి నిర్మాణంలో వివిధ ఏజెన్సీల ద్వారా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. ఈ ఏడాది రూ.15వేల కోట్ల ప్రత్యేక ఆర్ధిక సాయాన్ని ఏపీకి కేంద్రం ప్రకటించింది. వచ్చే సంవత్సరాల్లో అవసరాన్ని బట్టి అమరావతికి మరిన్ని అదనపు నిధులు అందిస్తామని చెప్పారు. పోలవరం నిర్మాణానికి కూడా కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. వీలైనంత త్వరగా పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని బడ్జెట్‌లో కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. పోలవరం ఏపీ జీవనాడిగా పేర్కొన్నారు. ఆహార భద్రతకు కూడా పోలవరం నిర్మాణం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం అండగా ఉంటుందని.. అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

Updated Date - Jul 25 , 2024 | 09:17 PM