YSRCP: అవకాశాన్ని జారవిడ్చుకుని.. జగన్ నోట అన్ని అబద్ధాలేనా..
ABN , Publish Date - Nov 20 , 2024 | 12:18 PM
ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సింది పోయి.. ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని విమర్శిస్తూ.. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించాలనే లక్ష్యంతో వైసీపీ అధ్యక్షులు జగన్ వ్యవహారిస్తున్నారనే ప్రచారం..
అధికారంలో ఉన్నప్పుడు అరాచక పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్‌సీపీ.. విపక్షంలో ఉంటూ అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సింది పోయి.. ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని విమర్శిస్తూ.. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించాలనే లక్ష్యంతో వైసీపీ అధ్యక్షులు జగన్ వ్యవహారిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రజల పక్షాన శాసనసభలో గొంతు వినిపించాల్సిన విపక్ష నాయకులు సభకు వెళ్లకుండా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటూ ప్రకటించడాన్ని ఓవైపు ప్రజలు హర్షించడంలేదనే చర్చ జరుగుతోంది. జగన్ నిర్ణయంపై ప్రజల నుంచి సొంత పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత రావడంతో జగన్ డైలమాలో పడ్డారంట. ఇక అసెంబ్లీలో తమ గళం వినిపించే అవకాశం లేకపోవడంతో మరోసారి ఇవాళ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారంటూ ఆ పార్టీ సోషల్ మీడియా పోస్టులు పెట్టింది. అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ చేతులారా చేజార్చుకుని ప్రస్తుతం తమకు అవకాశం లేదని ఫేక్ పోస్టులు పెట్టడం చూస్తుంటే జగన్ అబద్ధాలకు అంతులేకుండా పోతుందనే చర్చ జరుగుతోంది.
అవకాశాన్ని వదిలేసి..
రాష్ట్రంలో ప్రజల సమస్యలను విపక్షంగా శాసనసభలో లేవనెత్తే అవకాశం కేవలం వైసీపీకి మాత్రమే ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీకి చెందిన ప్రతినిధులు మాత్రమే శాసనసభకు ఎన్నికయ్యారు. వీరిలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండటంతో.. వైసీపీ మాత్రమే విపక్షంగా ఉంది. దీంతో ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాలన్ని ఓటర్లు వైసీపీకి ఇవ్వగా.. కొన్ని కారణాలతో శాసనసభ సమావేశాలకు హాజరుకాబోమని వైసీపీ అధ్యక్షులు జగన్ ప్రకటించడం చూస్తే, ప్రజల అభిప్రాయాన్ని ఆయన గౌరవించడం లేదనే విషయం స్పష్టమవుతోందనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ వేదికగా కాకుండా.. మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దానికి పెద్దగా ప్రాధాన్యత ఉండకపోవచ్చు. ప్రభుత్వం సైతం మీడియా ద్వారా విపక్షం సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పాలనే నిబంధన ఎక్కడా లేదు. అదే శాసనసభలో అయితే విపక్ష సభ్యలుు అడిగే ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం తరపున సమాధానం చెప్పాల్సి ఉంటుంది. శాసనసభకు వెళ్లే అవకాశం ఉన్నా దానిని వదులుకోవడం ఏమిటంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అన్ని అబద్ధాలేనా..
వైసీపీ అంటే కేరాఫ్ అబద్ధాలంటూ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఆ పార్టీ అధ్యక్షులు జగన్ మాట్లాడేవన్నీ అవాస్తవాలేనని విమర్శిస్తున్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన నాయకుల మాటలను ఎవరూ విశ్వసించడంలేదన్నారు. ఇప్పటికైనా అవాస్తవాలను ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here