Share News

Srikalahasti: శ్రీకాళహస్తిలో సీన్‌ రివర్స్‌.. మధుసూదన్‌రెడ్డికి ఎదురుగాలి

ABN , Publish Date - Apr 22 , 2024 | 01:35 PM

శ్రీకాళహస్తిలో ఈసారి సీన్‌ రివర్సవుతోంది. ఒకసారి ఓటమి సానుభూతి.. వైసీపీ వేవ్‌లో ఎమ్మెల్యేగా గెలుపొందిన మధుసూదన్‌రెడ్డికి ప్రస్తుతం ఎదురుగాలి వీస్తోంది. విపరీతమైన అవినీతి ఆరోపణలున్నాయి. నిత్య వివాదాస్పద నేతగా ముద్ర వేసుకున్నారు.

Srikalahasti: శ్రీకాళహస్తిలో సీన్‌ రివర్స్‌.. మధుసూదన్‌రెడ్డికి ఎదురుగాలి

  • వైసీపీ ఎమ్మెల్యేపైవిపరీతమైన అవినీతి ఆరోపణలు

  • ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి

  • ప్రభావత నేతల చేరికతో టీడీపీలో జోష్

  • కలసివస్తున్న బీజీపీ, జనసేన మద్దతు

శ్రీకాళహస్తి వైసీపీ శ్రేణుల్లో అంతులేని అసంతృప్తి అలముకుంది. ఎమ్మెల్యే మధుసూదనరెడ్డి వైఽఖరితో సొంత పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో భరించలేని అసహనం, అసంతృప్తి నెలకొంది. గుర్తింపు రాకపోవడం, పదవులు దక్కకపోవడం, పనులు జరగకపోవడం వంటి కారణాలతో అసంతృప్తి పేరుకుపోయింది. గ్రూపులు పెరిగిపోయాయి. వలసనేతలకు పెద్దపీట వేయడం వీరి అసంతృప్తికి మరింత ఆజ్యం పోసింది. ఎమ్మెల్యే కుటుంబం చుట్టూ కోటరీ ఏర్పడింది.

కోటరీ నేతల అతిపెత్తనంతో ఆత్మాభిమానం దెబ్బతింటోందని పార్టీ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు జడ్పీటీసీలు ఇలాంటి కారణంతోనే వైసీపీకి ఝలక్‌ ఇచ్చారు. ఈ అనూహ్య పరిణామంతో వైసీపీ చతికిలపడింది. గత ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సత్రవాడ ముని రామయ్య, నాయకులు లక్కమనేని మధు వంటి నేతలు పార్టీని వీడారు.

వైసీపీ అభ్యర్థి ఓటమే లక్ష్యంగా వీరంతా పనిచేస్తున్నారు. మరోపక్క భూకబ్జాలు, దాడులు, దౌర్జన్యాలు, అక్రమాల్లో ఇక్కడి ఎమ్మెల్యే తీవ్రమైన అపప్రద మూటగట్టుకున్నారు. శ్రీకాళహస్తి మున్సిపల్‌ ఎన్నికలు జరగకపోవడంతో వైసీపీలోని ఆశావాహులు భంగపడ్డారు. వార్డుల్లో చిన్నాచితకా నాయకులందరూ పార్టీకి దూరమయ్యారు. ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి నియామకాల విషయంలోను మధు విఫలమయ్యారని సొంత పార్టీ నేతలు భగ్గుమంటున్నారు.

పట్టణంలో దాడులు పెరిగిపోయాయి. స్వపక్షంలోను దాడులకు తెగబడటం పార్టీ పరువును బజారుకీడ్చింది. ప్రశాంత శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో రౌడీయిజం పెరిగిందన్న ఆవేదన స్థానికుల్లో నెలకొంది. ఈనేపథ్యంలో ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కలసిరాక ఎమ్మెల్యే ఎదురీదుతున్నారు.

పోటెత్తిన వలసలు:

సాధారణంగా ఎన్నికలకు ముందు వలసలు మామూలే. కానీ, శ్రీకాళహస్తిలో 14నెలల ముందే మాజీ ఎమ్మెల్యే సత్రవాడ ముని రామయ్య టీడీపీలో చేరారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు గతేడాది జూలైలో భారీగా అనుచర వర్గంతో సొంతగూటికి చేరారు. ముగ్గురు జడ్పీటీసీలు, ఆతర్వాత కొందరు ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు ఇక పలువురు మాజీ కౌన్సిలర్లు వైసీపీని వీడారు. టీడీపీ బలం పుంజుకోవడంతో నెల రోజులుగా చేరికలు మరింత పెరిగాయి.

కూటమితోఅదనపు బలం:

ఎన్డీఏ కూటమితో టీడీపీ అభ్యర్థికి అదనపు బలం చేకూరింది. బలమైన ఓటు బ్యాంకు ఉన్న బలిజ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్‌, ఆపార్టీ శ్రేణులు తోడయ్యారు. జనసేన నుంచీ నేతలు, శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తున్నారు.


బలం పుంజుకున్న టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి :

టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి బాగా బలం పుంజుకున్నారు. అభివృద్ధి ప్రదాతగా, పాలనాదక్షుడిగా పేరొందిన గోపాలకృష్ణారెడ్డికి వారసుడు సుధీర్‌ గెలిస్తే మళ్లీ ప్రశాంత వాతావరణం నెలకొంటుందనే మాట ప్రజల్లో వినిపిస్తోంది. రెండేళ్ల కిందట గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. ఆయన కర్మ క్రియల రోజునే సోదరుడు హరినాథరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు.

ఇద్దరు పెద్ద దిక్కులను కోల్పోయిన సుధీర్‌కు తల్లి బృందమ్మ, భార్య రిషితారెడ్డి వెన్నంటి నిలుస్తున్నారు. ఎన్నడూ గడప దాటని ఆ ఇద్దరూ బరువైన బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు. నియోజకవర్గంలో ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ పలుమార్లు గడప గడపను చుట్టేశారు. ఇక, గతంలో సుధీర్‌ రెడ్డి మాట కటువు అన్నవారే నేడు ఆయన కలుపుగోలుతనం, అభివృద్ధి పనులపై మాట్లాడే విజన్‌, నిజాయితీతో కూడిన విధానాలను ప్రశంసిస్తున్నారు. కేడర్‌నూ ఆయన మృదువుగా పలకరిస్తూ కలుపుకొని వెళ్తున్నారు.

Updated Date - Apr 22 , 2024 | 02:04 PM