ప్రొద్దుటూరు SEB కార్యాలయంలో ఎమ్మెల్యే రాచమల్లు వీరంగం
ABN , Publish Date - Jan 11 , 2024 | 08:02 PM
ప్రొద్దుటూరులో SEB పోలీసు అధికారులపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.. పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రాంతానికి చెందిన వైసీపీ కార్యకర్త పుల్లయ్య అనే వ్యక్తి..
కడప: ప్రొద్దుటూరులో SEB పోలీసు అధికారులపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.. పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రాంతానికి చెందిన వైసీపీ కార్యకర్త పుల్లయ్య అనే వ్యక్తి.. 30 మద్యం బాటిళ్లను తీసుకెళ్తూ ఎస్ఈబీ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ విషయం ఎమ్మెల్యేకు తెలియడంతో నేరుగా ఎసఈఈబీ కార్యాలయానికే వచ్చేశాడు. తమ పార్టీ కార్యకర్తను ఎందుకు అరెస్ట్ చేశారంటూ పోలీసులపై మండిపడ్డారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులను సైతం దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే తీరుకు బిత్తరపోయిన పోలీసులు.. నిబంధనల ప్రకారమే సదరు వ్యక్తిని అరెస్ట్ చేశామని తెలిపారు. నిబంధనల ప్రకారం ఒక్కో వ్యక్తి వద్ద 3 మద్యం బాటిళ్లు ఉండాలని, అందుకు విరుద్ధంగా అతడి వద్ద 30 బాటిళ్లు ఉండడంతో అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని నచ్చజెప్పారు. అయినా ఎమ్మెల్యే వినకుండా.. ‘‘ఇలా బీద వారిని అరెస్ట్ చేస్తే రోజూ స్టేషన్‌కు వస్తా.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి’’.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే చట్టాన్ని మార్చుకో, ప్రభుత్వాన్ని మార్చుకో... అంతేగానీ పేదల జోలికి వెళ్లొద్దంటూ హెచ్చరించారు. చివరకు నిందితుడు పుల్లయ్యను పీఎస్ నుంచి తన వెంట తీసుకెళ్లారు. ఎమ్మెల్యే తీరుపై పోలీసులతో పాటూ స్థానికులూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.