Actor Prudviraj: రెడ్డి కాకపోవడమే నా దౌర్భాగ్యం.. వైఎస్సార్సీపీపై నటుడు పృథ్వీరాజ్ ఘాటు వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 24 , 2024 | 12:02 PM
Andhrapradesh: వైఎస్సార్పీకి రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీపై వరుసగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు నటుడు పృధ్వీరాజ్. బూతుల మినిస్టర్లు, బూతుల యూనివర్సీటి కుప్పకూలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి వైఎస్సార్పీపీ, మంత్రులపై పృధ్వీరాజ్ విరుచుకుపడ్డారు.
ప్రకాశం, జనవరి 24: వైఎస్సార్పీకి రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీపై విమర్శల దాడి చేస్తున్న నటుడు పృథ్వీరాజ్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బూతుల మినిస్టర్లు, బూతుల యూనివర్సిటీ కుప్పకూలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ సెటైర్లు వేశారు. వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారనే ఆయన మీడియాకు తెలియజేశారు. అలాగే పెద్దిరెడ్డి, అంబటి రాంబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చివరకు వైసీపీకి మిగిలేది 17 స్థానాలే అంటూ పృథ్వీరాజ్ విమర్శలు గుప్పించారు.
బుధవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... లోకేష్ వద్ద రెడ్ డైరీ ఉందని... తన దగ్గర పీఆర్ డైరీ ఉందని పృథ్వీ తెలిపారు. దుర్మార్గులు, మోసగాళ్లు, ఎమ్మెల్యేలుగా పనికి రాని అనర్హులు, వారి చరిత్రను డైరీలో రాసినట్లు చెప్పారు. బ్రో సినిమాలో శ్యాంబాబు లాంటి క్యారెక్టర్లన్నీ ఎన్నికల ప్రచారంలో బయటకు తీస్తానన్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న తొమ్మిదేళ్లు పార్టీ కోసం పని చేశానని, కోట్లు దండుకోలేదని, కబ్జాలు చేయలేదని స్పష్టం చేశారు. జగన్ మాట తప్పను మడమ తిప్పనని చెప్పి మడం తిప్పేశారన్నారు. రెడ్డి కాకపోవడమే తన దౌర్భాగ్యమని... వైసీపీలో రెడ్లకే పెద్దపీఠ అని వ్యాఖ్యలు చేశారు. కరోనా సమయంలో చావు బతుకుల్లో ఉన్నా ట్రీట్మెంట్‌కు బెడ్డు కూడా ఇవ్వలేదన్నారు. అందుకే వైసీపీలో నుండి బయటకు వచ్చినట్లు చెప్పారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వదిలిన బాణం పృధ్వీరాజ్...
రాబోయే ఎన్నికల్లో 136 స్థానాల్లో టీడీపీ, జనసేన గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 21 ఎంపీ స్థానాలు కూటమికి వస్తాయన్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి ఓడిపోతారని... బీజేవైఎం పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ గెలుస్తారన్నారు. వైనాట్ 175 అని చెప్పి వైసీపీ నేతలు భయపడుతున్నారని.. చివరి ఐదు పోతే వైసీపీకి 17 స్థానాలే మిగులుతాయంటూ ఎద్దేవా చేశారు. షర్మిల నిజమైన బాణమని... ఆ బాణం కాంగ్రెస్ పార్టీదన్నారు. తేల్చుకుందాం రమ్మని వైసీపీ నాయకులకు షర్మిల సవాల్ చేస్తున్నారన్నారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వదిలిన బాణం పృధ్వీరాజ్ అని చెప్పుకొచ్చారు. ఎలాంటి తప్పు చేయకపోయినా చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల అయినప్పుడు పది లక్షల మంది జనం ఆయన వెంట వచ్చారన్నారు. అంబటి రాంబాబు ఇరిగేషన్ మంత్రి కాదని... సినీ డిస్ట్రిబ్యూటర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. బూతుల యూనివర్సీటీల మంత్రులు ఘోరంగా ఓడిపోతారని.. వైసీపీకి చరమగీతం పాడేందుకే ఎన్నికలు జరుగుతాయని సినీనటుడు పృధ్వీరాజ్ పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..