YSRCP: వైఎస్ జగన్ నిర్ణయంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీరియస్..!
ABN , Publish Date - Jul 15 , 2024 | 02:00 PM
ఇప్పటికే ఘోర పరాజయంతో సతమతం అవుతున్న జగన్‌కు(YS Jagan).. సొంత పార్టీ నేతల అసమ్మతి మరో తలనొప్పిగా మారింది. తాజాగా వైసీపీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni Srinivas Reddy). ‘నాయకులకు మా జిల్లా ఏమైనా గొడ్డు పోయిందా?..
ప్రకాశం, జులై 15: ఇప్పటికే ఘోర పరాజయంతో సతమతం అవుతున్న జగన్‌కు(YS Jagan).. సొంత పార్టీ నేతల అసమ్మతి మరో తలనొప్పిగా మారింది. తాజాగా వైసీపీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni Srinivas Reddy). ‘నాయకులకు మా జిల్లా ఏమైనా గొడ్డు పోయిందా?’ అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అసంతృప్తికి కారణం.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించడమే.
గత ఎన్నికల్లో అభ్యర్థుల మార్పు పేరుతో అసలు తమకు సంబంధమే లేని నియోజకవర్గాలకు నాయకులను కేటాయించారు. ఏళ్లుగా ఒక నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్న కీలక నేతలను ఇతర నియోజకవర్గాలకు షిఫ్ట్ చేయడంతో ఘోర పరాజయం పాలయ్యారు. ఈవిధంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ నిర్ణయంపై తాజాగా మాజీ మంత్రి బాలినేని తీవ్రంగా స్పందించారు.
నాయకులకు కొదవ లేదు..
జగన్ నిర్ణయంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రకాశం జిల్లాలో నాయకులకు కొదవ లేదన్నారు. నేతలకు జిల్లా ఏమీ గొడ్డు పోలేదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవిని జిల్లాకు సంబంధించిన వ్యక్తులకే ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని బాలినేని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. చెవిరెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు. అంతేకాదు.. జిల్లా నేతలకే అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని కరాఖండిగా తేల్చి చెప్పారు.