Share News

Purandheswari : సేవకులమై ప్రజల కన్నీరు తుడుస్తాం

ABN , Publish Date - Aug 16 , 2024 | 05:03 AM

‘ప్రజలే దేవుళ్లన్న ఎన్టీ రామారావు, జనతా జనార్దన్‌ అన్న నరేంద్ర మోదీ.. వ్యాఖ్యల స్ఫూర్తితో ప్రజలకు సేవకులమై వారి కన్నీరు తుడుస్తాం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

Purandheswari : సేవకులమై ప్రజల కన్నీరు తుడుస్తాం

  • ‘వారధి’ ప్రారంభంలో బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

  • వైసీపీ నేతలు ఉపాధి నిధుల్లో 500 కోట్లు కొట్టేశారని విమర్శ

అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ‘ప్రజలే దేవుళ్లన్న ఎన్టీ రామారావు, జనతా జనార్దన్‌ అన్న నరేంద్ర మోదీ.. వ్యాఖ్యల స్ఫూర్తితో ప్రజలకు సేవకులమై వారి కన్నీరు తుడుస్తాం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆమె ‘వారధి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘రోజుకొక ప్రజా ప్రతినిధి పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల వినతులు స్వీకరిస్తారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. ప్రతి సమస్యను సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపి పరిష్కారం దిశగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పని చేస్తారు’ అని అన్నారు.

కాగా, గురువారం పలువురు సమస్యలపై వినతులు ఇచ్చారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం కొర్రపాటిపల్లెలో కల్లూరి బాబు అనే వ్యక్తిని వైసీపీ నాయకుడు రాజారెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 28న హత్య చేయించినా పోలీసులు చర్య తీసుకోలేదని బాధితులు వాపోయారు.

‘కృష్ణా జిల్లా వీరపనేనిగూడెం, టెంపుల్లి, మర్లగూడెం గ్రామాలకు అనుకూలంగా ఉన్న ర్యాంపును నేషనల్‌ హైవే అధికారులు తొలగించారు. దీంతో అదనంగా నాలుగు కిలోమీటర్లు చుట్టుకుని రైల్వే గేటు దాటి రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ర్యాంపు తిరిగి ఏర్పాటు చేయించాలి’ అని గ్రామస్తులు కోరారు.

ప్రకాశం జిల్లాలో 2019-24 మధ్య కేంద్రం ఇచ్చిన 3,383 కోట్ల ఉపాధి నిధుల్లో రూ.500 కోట్లు వైసీపీ నేతలు అవినీతి చేశారని, డ్వామా అధికారులపై విచారణ జరిపించాలని ఆ జిల్లాకు చెందినవారు కోరారు. కాగా, 40 కోట్ల మంది భారతీయుల పోరాట ఫలితమే దేశానికి స్వాతంత్య్రమని పురందేశ్వరి అన్నారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆమె మాట్లాడారు.

Updated Date - Aug 16 , 2024 | 06:33 AM