Share News

Crime News: అర్ధరాత్రి గుప్తనిధుల వేట.. చివరికి ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Oct 05 , 2024 | 08:02 PM

సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన అనిత అనే మహిళకు తమ పాత ఇంట్లో గుప్త నిధులు ఉన్నట్లు కల వచ్చింది. అయితే అది నిజమేనని నమ్మిన ఆమె ఆ విషయాన్ని తన మేనల్లుడు జంగయ్యకు తెలిపింది.

Crime News: అర్ధరాత్రి గుప్తనిధుల వేట.. చివరికి ఏం జరిగిందంటే..

వికారాబాద్: పరిగి మండలం సయ్యద్‌పల్లి గ్రామంలో గుప్తనిధుల కోసం గాలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మెటల్ డిటెక్టర్ సహాయంతో నిధి, నిక్షేపాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన ఓ మహిళ సహా ముగ్గురిని పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. ఈ ఘటన పరిగి మండలంలో తీవ్ర కలకలం రేపింది.


సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన అనిత అనే మహిళకు తమ పాత ఇంట్లో గుప్త నిధులు ఉన్నట్లు కల వచ్చింది. అయితే అది నిజమేనని నమ్మిన ఆమె ఆ విషయాన్ని తన మేనల్లుడు జంగయ్యకు తెలిపింది. తనకు కల వచ్చిందని, ఆ కలలో తమ పూర్వీకులు ఇంట్లో బంగారం, వెండి వంటి వస్తువులు దాచినట్లు చెప్పారని యువకుడికి చెప్పింది. వాటిని వెలికి తీసేందుకు సహాయం చేయాలని కోరింది. అనంతరం వారిద్దరూ కలిసి అక్బర్ అనే వ్యక్తిని సంప్రదించారు. తమకు సహాయం చేయాలని అలా చేస్తే వాటా ఇస్తామని చెప్పారు. వీరంతా కలిసి మరో వ్యక్తిని సైతం తమ పథకంలో భాగం చేసుకున్నారు.


అయితే వీరంతా నేరుగా నిధిని వెతకడం చాలా కష్టమని భావించారు. ఆ ఇంటి చుట్టూ ఎప్పుడూ గ్రామస్థులు ఉంటారని రాత్రి వేళ అయితే పని సులువు అవుతుందని భావించారు. మరోవైపు త్వరగా నిధిని వెలికి తీసేందుకు మెటల్ డిటెక్టర్ కావాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా ఆన్ లైన్ ద్వారా దాన్ని బుక్ చేశారు. మెటల్ డిటెక్టర్ చేతికందిన వెంటనే పని ప్రారంభించారు. అయితే ఇటీవల వారు తరచుగా ఆ ప్రాంతానికి వెళ్లడం, అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో గ్రామస్థులకు వీరిపై అనుమానం కలిగింది. గత అర్ధరాత్రి వీరంతా పాడుబడిన ఇంట్లో గుప్తనిధుల కోసం వెతుకుతుండగా.. స్థానికులు పరిగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళతో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి నుంచి మెటల్ డిటెక్టర్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Oct 05 , 2024 | 08:02 PM