Share News

RK Kothapaluku: జగన్ బుర్రలో ‘బురద’!

ABN , Publish Date - Sep 07 , 2024 | 09:11 AM

తెలంగాణలో ఖమ్మం జిల్లాను ముంచింది మున్నేరు.. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడను ముంచింది బుడమేరు. ఇటు మున్నేరు, అటు బుడమేరు అక్రమణలకు గురవడంతో పాటు ప్రణాళిక లేకుండా నిర్మాణాలకు అనుమతించడంతో భారీ వర్షం కురిసినప్పుడు వరద పోటెత్తి దిగువ ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వరద తాకిడికి గురవుతున్నారు. వరదలు సంభవించినప్పుడు యథావిథిగా బురద రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి.

RK Kothapaluku: జగన్ బుర్రలో ‘బురద’!
RK Kothapaluku

తెలంగాణలో ఖమ్మం జిల్లాను ముంచింది మున్నేరు.. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడను ముంచింది బుడమేరు. ఇటు మున్నేరు, అటు బుడమేరు అక్రమణలకు గురవడంతో పాటు ప్రణాళిక లేకుండా నిర్మాణాలకు అనుమతించడంతో భారీ వర్షం కురిసినప్పుడు వరద పోటెత్తి దిగువ ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వరద తాకిడికి గురవుతున్నారు. వరదలు సంభవించినప్పుడు యథావిథిగా బురద రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో బురద రాజకీయం పరాకాష్టకు చేరుకుంది. అఋద్దాలే పునాదులుగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత వరదలపై కూడా అబద్ధాలను ప్రచారం చేస్తూ ఆనందిస్తున్నారు. ఆయనకు చెందిన రోత మీడియా తన కడుపు మంటను దాచుకోకుండా బురద రాజకీయాలకు తన వంతు సహాయం చేస్తోంది.


తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఇప్పుడు అరెస్టుల పర్వం మొదలైంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ దాడి కేసును ఊరగాయ వేసిన పోలీసులు ఇప్పుడు ప్రభుత్వం మారగానే జాడీ నుంచి బయటకు తీసి విచారణను వేగవంతం చేశారు. పోలీసు శాఖ ఇలా ప్రభుత్వాలను బట్టి నడుచుకోవడమే విషాదం. అదే పోలీసులు అప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా వ్యవహరించడం ఏమిటీ? నేరం జరిగినప్పుడు పోలీసులు తమ విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చాలి కదా? అప్పుడైనా ఇప్పుడైనా పోలీసులు తమ పని తాము చేస్తే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. ప్రభుత్వం ఎవరిదైనా తప్పు చేయడానికి ఎవరికైనా భయం ఉండాలి కదా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున వైసీపీ కార్యాలయంపై దాడి చేసినా పట్టించుకోరా? పోలీసులు ఉన్నది అధికారంలో ఉన్న వారి సేవలో తరించడానికి కాదు కదా? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను విస్మరిస్తే ఎలా?


అమరావతిలో రాజధాని ఏర్పాటు కావడం మొదటి నుంచీ ఇష్టం లేని జగన్ మోహన్ రెడ్డి తన రోత మీడియా ద్వారా రాజధాని మునిగిపోయిందని ప్రచారం చేయించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఇల్లు ముంపునకు గురికాకుండా కాపాడుకొనేందుకే ముందస్తు హెచ్చరికలు లేకుండా బుడమేరు గేట్లు ఎత్తేశారని జగన్ రెడ్డి తన అజ్ఞానాన్ని ప్రదర్శించారు. అదే సమయంలో సదరు రోత మీడియాలో మాత్రం చంద్రబాబు ఇల్లు మునిగిపోయిందని, రెండవ అంతస్థులోకి నీరు ప్రవేశించిందని అబద్ధాలు ప్రచారం చేశారు. కృష్ణా నది దిగువన కృష్ణలంక వద్ద రిటైనింగ్ వాల్‌ను తాను నిర్మించి ఉండకపోతే మరింత ప్రాణనష్టం జరిగి ఉండేదని కూడా చెప్పుకొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి అపరాత్రి అన్న తేడా లేకుండా వరద బాధితులను ఆదుకోవడానికి మోకాళ్ల లోతు బురదను సైతం లెక్కచేయకుండా యువకుడిలా తిరుగుతుండగా, జగన్ రెడ్డి మాత్రం కాసేపు నీళ్లలోకి దిగి ఫొటోలకు పోజులిచ్చి బురద రాజకీయాలకు తెరలేపారు. ఆబద్ధాలను పదే పదే ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని, ఫలితంగానే 2019లో తాను ముఖ్యమంత్రిని కాగలిగానని జగన్‌కు తెలుసు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజధానిగా ఎంపిక చేసిన అమరావతికి ముంపు ప్రమాదం ఉందని ప్రచారం చేసిన జగన్ రెడ్డి.. ఇప్పుడు కూడా తన రోత మీడియా ద్వారా రాజధాని మునిగిపోయిందని చెత్త ప్రచారం మొదలుపెట్టారు. ఒక సామాజిక వర్గంపై కక్ష పెంచుకున్న జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ దుష్టాచారాన్ని వదులుకోవడం లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రానికి ఎక్కడ పెట్టుబడులు వస్తాయోనన్న దుగ్ధతో జగన్‌కు అండగా ఉండే సైకో గుంపు సోషల్ మీడియా వేదికగా "అమరావతిని మర్చిపోయి తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి" అని ప్రచారం కూడా చేసింది.

ఒక రాష్ట్రం పట్ల ఇంతకంటే ద్రోహం ఉంటుందా? జగన్ రెడ్డి అనే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ పట్ల కనీస అభిమానం కూడా ఉండదు. తాను అధికారంలో ఉండటమే ఆయనకు కావాల్సింది. సైకో గుంపునకు పేటీఎం కూడా జగన్ అధికారంలో ఉంటే చాలు రాష్ట్ర ఏమైపోయినా పర్వాలేదు. అందుకే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలైనా కాకముందే రాళ్లు వేయడం ప్రారంభించాడు. పనిలో పనిగా భవిష్యత్తులో తనకు పోటీ అవుతాడని భావిస్తున్న మంత్రి లోకేశ్‌ను కూడా టార్గెట్ చేసుకున్నారు. విద్యా శాఖలో చీమ చిటుక్కుమన్నా భూతద్దంలో చూపించడం ద్వారా లోకేశ్‌ను ఫెయిల్యూర్‌గా ముద్ర వేసే ప్రయత్నాలను జగన్ అనుచర మూక ప్రారంభించింది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఆడపిల్లలు స్నానం చేసే బాత్రూంలలో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ అబద్ధాలు ప్రచారం చేశారు.

తనకు తప్ప ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత మరెవరికీ లేదని నమ్ముతున్న జగర్ రెడ్డి ప్రజలను కూడా తమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 14 ఏళ్లపాట ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు నాలుగవసారి ముఖ్యమంత్రి చంద్రబాబు అర్హతలను బట్టి అయితే జగన్ రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఏమాత్రం లేదని మెజారిటీ ప్రజలు తీర్పు ఇచ్చారు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి జరుగుతున్నట్టుగానూ, ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నట్లు గానూ కనిపించిన రోత మీడియాకు ఈ మూడు నెలల్లోనే రాష్ట్రం వల్లకాడు అయినట్టుగా కనిపిస్తోంది. జగన్ మనసులో ఏముందో నదరు రోత మీడియా ప్రచారం చేస్తోంది. రోత మీడియా ప్రచారం చేసే కథనాలను వైసీపీ మూక అందిపుచ్చుకుంటోంది. ఇదీ ప్రస్తుతం జరుగుతున్న తంతు.

చంద్రబాబుకు పనీపాటా లేదన్నట్టుగా, అందుకే వరద ప్రాంతాల్లో తిరుగుతున్నాడని జగన్ రెడ్డి భావిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తనలా ఎంచక్కా హెలికాప్టర్‌లో ఒక రౌండ్ తిరిగి సరి పెట్టకుండా బురదలో తిరగడం ఏమిటి అని జగన్‌కు అనిపిస్తుండవచ్చు. పరిపాలన చేయడం తనకు తప్ప మరెవరికీ చేతకాదని జగన్ నమ్ముతుండవచ్చు గానీ ప్రజలు అలా అనుకోవడం లేదు. నిజానికి చంద్రబాబు సరిగ్గా పట్టించుకొని ఉంటే జగన్ రెడ్డికి రెండు మూడు సీట్లకు మించి వచ్చి ఉండేవి కావు. జగనే రెడ్డి అభిప్రాయంతో, నమ్మకంతో నిమిత్తం లేకుండా ప్రజలు మాత్రం ఆయన ముఖ్యమంత్రిగా పనికిరాడని తెల్చిపారేశారు. ఈ నేపథ్యంలో అత్యపరిశీలన చేసుకోవాల్సిన జగన్ రెడ్డి, ఆత్మవంచన చేసుకుంటున్నారు.


వరద ప్రాంతంలో కొద్దిసేపు పర్యటించినప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా నువ్వుంటే బాగుండేదని ప్రజలు నినాదాలు చేసినట్టుగా ప్రచారం చేసుకుంటూ ఆనందం పొందుతున్నారు. వరదలొస్తే రాజధాని అమరావతి మునిగి పోతుందని అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన ప్రచారం నిజమని మళ్లీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని మునిగిపోయి ఉంటే హైకోర్టు, సచివాలయం ఎలా పనిచేస్తున్నాయనే ఇంగితం కూడా లేకుండా రోత మీడియా కథనాలను వండి వార్చింది. తాము చెప్పే అబద్ధాలను ఎంతో కొంత మంది నమ్మకపోతారా అన్నది జగన్ అండ్ కో భావన. గతంలో అలా నమ్మడం వల్లనే ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టారు. అందుకే ఇప్పుడు కూడా రాజధాని విషయంలోనే కాకుండా బుడమేరు విషయంలోనూ అబద్ధాలు ప్రచారం చేస్తు న్నారు.

రాష్ట్రంలోని ఇతర జిల్లాల ప్రజలకు బుడమేరు గురించి తెలిసే అవకాశం లేదు. అందుకే జగన్ రెడ్డి అబద్ధాలకు పదును పెట్టారు. చంద్రబాబు ఇల్లు మునగకుండా ఉండేందుకే బుడమేరు గేట్లు ఎత్తారని చెప్పడం తెలియక చేసిన పని కాదు. రోత మీడియాలో చంద్రబాబు ఇల్లు మునిగిపోయిందని రాసినప్పుడు ఇలా ఎలా చెబుతారని ప్రశ్నించే విలేఖరులు కూడా ఇప్పుడు లేరు. మీడియాలో వైరుధ్యాల వల్ల జగన్ అండ్ కో చేస్తున్న అసత్య ప్రచారం ఎంతో కొంత ప్రజల్లోకి వెళుతోంది. రాష్ట్రంలో ఏ అనర్థం జరిగినా అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని ప్రజలంతా నమ్మాలని ఆయన కోరుకుం టున్నారు. అందుకే ఈ బరితెగింపు.


నిరూపిస్తే ఇచ్చేస్తాం!

బుడమేరు కట్టలు తెగడానికి ఇబ్రహీంపట్నం వద్ద 24 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన మినీ హైడల్ ప్లాంట్ కారణం అని సరికొత్త ప్రచారానికి తెర లేపారు. నిజానికి ఈ ప్లాంట్ ఏర్పాటు విషయం 1998లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు కూడా తెలియదు. అప్పటి ప్రభుత్వ పాలసీ ప్రకారం ఆ ప్లాంట్‌కు జెన్‌కో అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు అనుమతించారు. ఈ ప్లాంట్ వల్ల వచ్చే ఆదాయంతోనే 'ఆంధ్రజ్యోతి' పత్రిక నడుస్తోందని నమ్మిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 తర్వాత దీనికి అనుమతులు రద్దు చేశారు. ఆ తర్వాతి వచ్చిన ప్రభుత్వాలు పునరుద్ధరించినా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ప్లాంట్‌కు అనుమతులు రద్దు చేశారు.

నిజానికి మా ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే కొద్దిపాటి విద్యుత్ అతి తక్కువ ధరకే ప్రభుత్వానికి సరఫరా చేసే వాళ్లం. నష్టపరిహారం ఇవ్వకుండా ప్లాంట్ తొలగిస్తే ఎలా? అని మాత్రమే మేం హైకోర్టును ఆశ్రయించాం. జరిగింది ఇది కాగా, చంద్రబాబు నాకు ఏదో మేలు చేశారని రోత పత్రికలో ప్రచారం చేస్తున్నారు. విచిత్రమేమిటంటే కృష్ణా నదికి వరద వస్తే ఈ ప్లాంట్ కూడా మునిగిపోతుంది. ఇప్పుడు కూడా మునిగిపోయింది. కృష్ణా నదికి భారీ వరద వచ్చినప్పుడు బుడమేరు నీరు నదిలోకి వెళ్లే అవకాశమే లేదు. ఇంకా చెప్పాలంటే ఇబ్రహీంపట్నం లోతట్టు ప్రాంతాలు కృష్ణా వరదల్లో మునిగిపోకుండా ఉండటానికి ఈ ప్లాంట్ రక్షణగా నిలబడిన సందర్భాలూ ఉన్నాయి. జగన్ రోత మీడియాలో చేస్తున్న ప్రచారం నిజమని రుజువు చేస్తే ఆ ప్లాంట్‌ను మా సొంత ఖర్చుతో తొలగించడానికి సిద్ధంగా ఉన్నాం. కనీస ప్రమాణాలు, నైతిక విలువలు పాటించని జగన్ రోత మీడియాకు బురద చల్లడం తప్ప మరేమీ తెలియదు. కడుపుకు అన్నం తినేవాళ్లు ఎవరూ ఇలాంటి ప్రచారాలు చేయరు.

అధికారంలో ఉన్నప్పుడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు బాబూ కొడుకులు ఈ మినీ హైడల్ ప్రాజెక్ట్ ఉసురు తీసే ప్రయత్నం చేశారు. మా ప్లాంట్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిందని రుజువు చేస్తే దాన్ని జగన్ అండ్ కోకు ఇచ్చేస్తాం. అయితే జగన్ మాత్రం తన రోత పత్రికను ఇప్పుడు బూతు పత్రికగా మార్చే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. అందుకే చెత్తతో పత్రికను నింపుతున్నారు. అధికారం కోల్పోయామన్న జగన్ అండ్ కో బాధను ఎవరు తీర్చాలి? ప్రజలే తీర్చాలి! అయితే ఐదేళ్ల పాటు చేసిన అరాచకాలను ప్రజలు ఇప్పట్లో మరచిపోయేలా లేరే! అందుకే అబద్ధాలను నమ్ముకొని మరోమారు ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ రెడ్డి ఏ ముహూర్తంలో పుట్టారో కానీ ఆయనలో మానవ లక్షణాలు నానాటికీ కనుమరుగవుతున్నాయి.


జగన్ అంతే!

చంద్రబాబును జైలుకు పంపడం వల్లే జగన్ రెడ్డి అధికారం కోల్పోయారని రాజమండ్రి మేధావిగా ప్రచారంలో ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతున్నారు గానీ, అందరికంటే ప్రజలే తెలివైనవాళ్లు. జగన్ రెడ్డి చేసిన అరాచకాలు అన్నింటినీ గుర్తుంచుకోవడం వల్లనే ప్రజలు ఆయన పార్టీని చిత్తుగా ఓడించారు. వరదల విషయంలో బురద రాజకీయం చేస్తున్న జగన్ రెడ్డికి వరద బాధితులకు విరాళం ఇవ్వడానికి మాత్రం మనసు రాదు. సొంత సొమ్ము ఇవ్వడానికి మనసు రానప్పుడు తాను ఏర్పాటు చేసిన కంపెనీలు లాభాల్లో ఉన్నాయి కదా? ఆ కంపెనీలైనా విరాళాలు ప్రకటించవచ్చు కదా? అంతటి విశాల హృదయం ఆయనకు ఎక్కడిది? ఇంతవరకూ ఆయన ఒక్కరికైనా రూపాయి సహాయం చేసిన సందర్భాన్ని చూశామా? లేదే! దటీజ్ జగన్! వన్ వే ట్రాఫిక్ మాత్రమే ఆయన విధానం. వారం రోజులుగా వరదల్లో చిక్కుకున్న విజయవాడ ప్రజలు చంద్రబాబుపై తిరగబడకపోవడం పాపం, జగన్ రెడ్డికి నచ్చడం లేదు. మూడో వంతు వరదల్లో చిక్కుకున్నప్పటికీ మృతుల సంఖ్య ఎక్కువగా లేకపోవడం కూడా ఆయనకు రుచించడం లేదు. విశ్రాంతి కూడా తీసుకోకుండా బాధితులను ఆదుకోవడానికి యువకుడిలా శ్రమిస్తున్న చంద్రబాబును పలువురు ప్రశంసిస్తుండగా, జగన్ అండ్ కో మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

విజయవాడ పూర్తిగా మునిగిపోయి వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఉంటే సైకో గుంపు ఆనందించి ఉండేది. రాజధాని మునిగిపోలేదు. చంద్రబాబు ఇల్లు కూడా మునిగిపో లేదు. మరోవైపు ముంపు ప్రాంతాలు కోలుకుంటున్నాయి. ఇవన్నీ జగన్‌కు సహజంగానే రుచించవు. జగన్‌తో పాటు అదే రక్తం పంచుకు పుట్టిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాత్రం చంద్రబాబు కృషిని ప్రశంసించారు. అయితే అందరికీ సహాయం అందడం లేదని ఆమె అన్నారు. ఇందులో కొంత నిజం ఉంది. అందుకే పీకల్లోతు నీళ్లలో చిక్కుకున్న ప్రజలకు ఆహారం అందించడానికి డ్రోన్లను ఉపయోగించారు. వరదల వల్ల రాజధాని మునగలేదు. చంద్రబాబు ఇంట్లోకి నీరు రాలేదని బాధపడుతూ కూర్చోకుండా సొంత పార్టీ మునిగిపోకుండా కాపాడుకోవడంపై జగన్ రెడ్డి దృష్టి పెట్టడం మంచిది.


అదే జరిగితే శిక్ష ఖాయం!

రాజ్యసభలో తన పార్టీకి ఉన్న బలంపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆధారపడి ఉందని జగన్ రెడ్డి ఇప్పటిదాకా దిలాసాగా ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభలో కూడా వైసీపీకి చిల్లు పడింది. భారతీయ జనతా పార్టీ ఒక వైపు నుంచి, తెలుగుదేశం పార్టీ మరోవైపు నుంచి రాజ్యసభ సభ్యులను జగన్‌కు దూరం చేసే పనిలో ఉన్నాయి. ఇప్పటికే బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకట రమణ తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. మరి కొందరూ అదే బాటలో ఉన్నారు. విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, నిరంజన్ రెడ్డి వంటి వాళ్లతో భారతీయ జనతా పార్టీ సంప్రదింపులు జరుపుతోంది. మిగతావారు తెలుగుదేశం పార్టీతో టచ్‌లో ఉన్నారు. రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందడానికి బీజేపీకి నలుగురు సభ్యుల బలం అదనంగా కావాలి. ఈ కారణంగా వైసీపీకి చెందిన నలుగురిని చేర్చుకోవడానికి బీజేపీ స్కెచ్ వేస్తోంది. వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ మినహా మిగతా వారందరూ బీజేపీ, తెలుగుదేశం పార్టీలలో ఏదో ఒక దానితో చేతులు కలుపుతారని ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాఫీగా నడవాలంటే లోక్ సభలో తెలుగుదేశం పార్టీ మద్దతు అవసరం. ఈ కారణంగా జగన్ రెడ్డికి పరోక్ష సహాయం అందించే పరిస్థితిలో కేంద్రం లేదు. రాజ్యసభలో వైసీపీ బలంపై ఆధారపడకూడదన్న నిర్ణయానికి బీజేపీ రావడానికి కూడా ఇదే కారణం. తెలుగుదేశం, బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతమైతే అవినీతి కేసులలో విచారణ వేగం పుంజుకొని వచ్చే ఎన్నికల నాటికి జగన్, విజయ సాయి రెడ్డిలకు శిక్షలు పడే అవకాశం ఉంది. అదే జరిగితే జగన్ రెడ్డి రాజకీయ జీవితం ప్రశ్నార్థకం అవుతుంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ సతీమణి భారతి ప్రమేయంపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. ఈ కారణంగా పార్టీ నాయకత్వ బాధ్యతలను ఆమె చేపట్టినప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండక పోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఇవన్నీ ప్రశ్నలే. మరికొంత కాలం వేచి చూస్తే గానీ జగన్ రాజకీయ భవితవ్యంపై స్పష్టత ఏర్పడదు.

ఈ విషయం అలా ఉంచితే, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఇప్పుడు అరెస్టుల పర్వం మొదలైంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ దాడి కేసును ఊరగాయ వేసిన పోలీసులు, ఇప్పుడు ప్రభుత్వం మారగానే జాడీ నుంచి బయటకు తీసి విచారణను వేగవంతం చేశారు. పోలీసు శాఖ ఇలా ప్రభుత్వాలను బట్టి నడుచుకోవడమే విషాదం. అదే పోలీసులు అప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా వ్యవహరించడం ఏమిటి? నేరం జరిగినప్పుడు పోలీసులు తమ విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చాలి కదా? అప్పుడైనా ఇప్పుడైనా పోలీసులు తమ పని తాము చేస్తే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. ప్రభుత్వం ఎవరిదైనా తప్పు చేయడానికి ఎవరికైనా భయం ఉండాలి కదా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున వైసీపీ కార్యాలయంపై దాడి చేసినా పట్టించుకోరా? పోలీసులు ఉన్నది అధికారంలో ఉన్న వారి సేవలో తరించడాని కాదు కదా? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను విస్మరిస్తే ఎలా? దేశంలో వివిధ వ్యవస్థలు అధికారంలో ఉన్న వారికి ఊడిగం చేయడం వల్లనే వాటిపై ప్రజలకు నమ్మకం పోతున్నది. నేరస్తులు ఎదురుదాడి చేస్తూ తప్పించుకుంటున్నారు. జగన్ రెడ్డిపై ఉన్న కేసులే ఇందుకు నిదర్శనం. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఒక మహిళను లైంగికంగా వేధించిన విషయం తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క రోజు కూడా జాప్యం చేయకుండా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? ఇలాంటి వారికి ప్రమోషన్లు ఇచ్చారు. మంత్రులను చేశారు. చంద్రబాబు, జగన్కు మధ్య ఉన్న మౌలిక తేడా ఇదే. ప్రజలంటే చంద్రబాబుకు వెరపు ఉంటుంది. జగన్ మాత్రం ప్రజలను వెర్రిబాగులోళ్లుగా భావిస్తారు. అందుకే అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేశారు. చేసేవాళ్లను ప్రోత్సహించారు. అన్నీ గుర్తుపెట్టుకున్న ప్రజలు తగిన సమయంలో తగిన తీర్పు ఇచ్చారు. అయినా జగన్ రెడ్డిలో మార్పు రాకపోవడం ఆయన ఖర్మ. ప్రజలను ఎల్లకాలం బురిడీ కొట్టించలేమని ఆయన ఎప్పటికి తెలుసుకుంటారో!

Updated Date - Sep 10 , 2024 | 11:55 AM