Share News

Red Meat: రెడ్ మీట్ తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

ABN , Publish Date - Aug 26 , 2024 | 07:25 AM

నాన్ వెజ్ ప్రియులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా నగరాల్లో అయితే రెండు, మూడ్రోజులకు ఓ సారి తింటున్నారంటే అతిశయోక్తి కాదు. కొంత మంది అయితే రోజూ తింటుంటారు. ముక్క లేనిదే ముద్ద దిగని వారో ఎందరో. ఇందుకు అనుగుణంగానే పట్టణాలు, నగరాల్లో హోటళ్లు భారీగా వెలిశాయి. చికెన్, మటన్, ఫిష్ సహా పలు రకాల బిర్యానీలు నోరూరిస్తుండడంతో వాటిని తినే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇక వీకెండ్స్ అయితే చాలు హోటళ్లు కిక్కిరిసిపోతుంటాయి.

Red Meat: రెడ్ మీట్ తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

ఇంటర్నెట్ డెస్క్: నాన్ వెజ్ ప్రియులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా నగరాల్లో అయితే రెండు, మూడ్రోజులకు ఓ సారి తింటున్నారంటే అతిశయోక్తి కాదు. కొంత మంది అయితే రోజూ తింటుంటారు. ముక్క లేనిదే ముద్ద దిగని వారెందరో ఉన్నారు. ఇందుకు అనుగుణంగానే పట్టణాలు, నగరాల్లో హోటళ్లు భారీగా వెలిశాయి. చికెన్, మటన్, ఫిష్ సహా పలు రకాల బిర్యానీలు నోరూరిస్తుండడంతో వాటిని తినే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇక వీకెండ్స్ అయితే చాలు హోటళ్లు కిక్కిరిసిపోతుంటాయి.


అయితే వీటితోపాటు రెడ్ మీట్(ఎర్ర మాంసం) తినే వారి సంఖ్య కూడా అధికమే. ఎర్ర మాంసం అంటే క్షీరద జాతుల మాంసం. ఇందులో గొడ్డు మాంసం, పంది మాంసం, గొర్రెలు మొదలైనవి ఉంటాయి. ఈ మాంసంలో ప్రొటీన్, ఐరన్, జింక్, విటమిన్ డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా లభిస్తాయి. కొవ్వు, కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే రెడ్ మీట్ అధికంగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీన్ని తరచూ తింటున్న వారికి ఎక్కువగా షుగర్, రక్తపోటు, గుండె సంబంధిత జబ్బులు, ఊబకాయం సహా అనేక రకాల వ్యాధుల వచ్చే అవకాశం ఉందని అధ్యయనాల్లో తేలింది.


లాన్సెట్ నివేదిక

లాన్సెట్ నివేదిక ప్రకారం అధికంగా నాన్ వెజ్ తినే వారికి టైప్-2 మధుమేహం పొంచి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 20దేశాల్లోని 19లక్షల మందిపై చేసిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల షుగర్ వస్తుంది. ఇది వచ్చిందంటే చికిత్స లేదు. నియంత్రించుకోవడానికి మాత్రం మందులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రెడ్ మీట్ తినేవారికి టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. రోజూ 50గ్రాముల ప్రాసెస్ చేసిన మీట్, 100గ్రాములు ప్రాసెస్ చేయని రెడ్ మీట్, 100గ్రాముల పౌల్ట్రీ మీట్ తీసుకుంటున్న వారిపై చేసిన అధ్యయనంలో షుగర్ వచ్చే ప్రమాదం 15శాతం పెరిగింది. దీనికి సంబంధించిన షాకింగ్ వివరాలను "ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ మ్యాగజైన్"లో ప్రచురించారు. ప్రతిరోజు 50గ్రాముల ప్రాసెస్ మీట్ తింటున్నవారిలో మధుమేహం వచ్చే ముప్పు 15శాతంగా, 100గ్రాముల అన్ ప్రాసెస్ రెడ్ మీట్ తింటున్నవారిలో 10శాతంగా, అలాగే 100 గ్రాముల పౌల్ట్రీ మీట్ తింటున్నవారిలో 8శాతంగా ఉంది. చాలా దేశాల్లో ఎర్ర మాంసాన్ని ఎక్కువగా తింటున్నారని, దీని వల్లే టైప్-2 డయాబెటిస్ ముప్పుు పెరుగుతోందని వైద్య నిపుణలు తెలిపారు.


ఎపిడిమిలోజిస్ట్ జెఫ్రీ స్టాన్‌వే పరిశోధనలు..

2022లో అమెరికాకు చెందిన ఎపిడిమిలోజిస్ట్ జెఫ్రీ స్టాన్‌వే నేతృత్వంలో వైద్య నిపుణులు పలు పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనల్లో అమెరికాలోని 180ప్రాంతాలకు చెందిన వ్యక్తులపై అధ్యయనం చేయగా ప్రాసెస్ చేయని రెడ్ మీట్ రోజూ తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం 16శాతంగా ఉందని వెల్లడైంది. మరో విషయం ఏంటంటే వీరిలో పెద్దపేగు క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బులు, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలూ ఎక్కువే. కాబట్టి వారానికి ఒకసారి చొప్పున మితంగా తింటే మంచిది.

Updated Date - Aug 26 , 2024 | 07:28 AM