లెక్చరర్ కుర్చీ కింద బాంబు పెట్టిన విద్యార్థులు
ABN , Publish Date - Nov 18 , 2024 | 04:13 AM
పాఠాలు చెబుతున్నప్పుడు మందలించిందని మహిళా సైన్స్ లెక్చరర్‌పై ప్రాంక్ పేరుతో ఆమె కూర్చునే కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చారు ఓ తరగతి విద్యార్థులు.
భివాని, నవంబరు 17: పాఠాలు చెబుతున్నప్పుడు మందలించిందని మహిళా సైన్స్ లెక్చరర్‌పై ప్రాంక్ పేరుతో ఆమె కూర్చునే కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చారు ఓ తరగతి విద్యార్థులు. ఈ ఘటన హరియాణాలోని భివాని జిల్లాలో శనివారం జరిగింది. బపోరా గ్రామంలోని ప్రభుత్వ స్కూల్‌లో పాఠం చెబుతున్న సందర్భంలో 12వ తరగతిలోని 15 మంది విద్యార్థుల్లో 13 మందిని మహిళా సైన్స్ లెక్చరర్ మందలించింది. కోపోద్రిక్తులైన విద్యార్థులు లెక్చరర్‌పై ప్రాంక్ పేరుతో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. యూట్యూబ్‌లో చూసి ఫైర్ క్రాకర్స్ తరహాలో బాంబు తయారుచేశారు. శనివారం లెక్చరర్ కుర్చీ కింద బాంబు అమర్చారు. ఆమె కుర్చీలో కూర్చున్నప్పుడు రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చారు. పేలుడు ధాటికి కుర్చీకి రంధ్రం పడింది. లెక్చరర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఉన్నతాధికారులు పాఠశాలకు వచ్చి దర్యాప్తు చేశారు. ఈ సంఘటనకు కారణమైన విద్యార్థులను వారం పాటు సస్పెండ్ చేశారు. అయితే పిల్లల తల్లిదండ్రులు క్షమాపణ చెప్పడంతో అధికారులు వెనక్కి తగ్గారు. ఆ మహిళా లెక్చరర్ కూడా విద్యార్థులను మన్నించింది.