Delhi: వరుసగా షాక్‌లు.. కాంగ్రెస్ నుంచి మరో ఇద్దరు కీలక నేతలు బయటకి
ABN , Publish Date - May 01 , 2024 | 11:43 AM
లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్(Congress) పార్టీకి వరుస షాక్‌లు కలవరపెడుతున్నాయి. తాజాగా ఢిల్లీకి చెందిన ఇద్దరు పరిశీలకులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్(Congress) పార్టీకి వరుస షాక్‌లు కలవరపెడుతున్నాయి. తాజాగా ఢిల్లీకి చెందిన ఇద్దరు పరిశీలకులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఢిల్లీలోని రెండు లోక్‌సభ స్థానాలకు పరిశీలకులుగా ఉన్న నీరజ్ బసోయా, నసీబ్ సింగ్ ఇద్దరూ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు(Mallikharjuna Kharge) వేర్వేరుగా రాజీనామా లేఖలు పంపారు పశ్చిమ ఢిల్లీ పార్లమెంటరీ స్థానానికి పరిశీలకుడిగా ఉన్న నీరజ్ బసోయా మాట్లాడుతూ.. “ఢిల్లీలో ఆప్‌తో మే 1న కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం నాకు నచ్చలేదు.
ఈ చర్య కాంగ్రెస్ కార్యకర్తలకు చెడ్డపేరు తీసుకువస్తోంది. ఆత్మగౌరవం ఉన్న పార్టీ నాయకుడిగా నేను ఇకపై పార్టీతో కలిసి ఉండలేను. నేను కాంగ్రెస్‌లో అన్ని పదవులను అనుభవించాను. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. గత 30 ఏళ్లలో నాలాంటి సామాన్యుడికి అన్ని అవకాశాలు కల్పించినందుకు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ధన్యవాదాలు" అని అన్నారు.
అధ్యక్షుడి నియామకాన్ని వ్యతిరేకిస్తున్న నసీబ్..
ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్‌గా దేవేంద్ర యాదవ్ నియామకాన్ని వాయువ్య ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ పరిశీలకుడు నసీబ్ సింగ్ తీవ్ర వ్యతిరేకిస్తున్నారు. "దేవేంద్ర యాదవ్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అజెండాను అమలు చేస్తున్నాడు. అలాంటి వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం నచ్చలేదు.అందుకే పార్టీ నుంచి బయటకి వస్తున్నా" అని నసీబ్ తన లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలో మే 25న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.
డీపీసీసీ అధ్యక్షుడిగా దేవేంద్ర యాదవ్
కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ విభాగం తాత్కాలిక అధ్యక్షుడుగా దేవేంద్ర యాదవ్ (Devendra Yadav)ను ఏప్రిల్ 30న ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్టు ఏఐసీసీ (AICC) ఒక ప్రకటనలో తెలిపింది. పంజాబ్ ఏఐసీసీ ఇన్‌చార్జి కూడా ఆయన కొనసాగుతారని పేర్కొంది. డీపీసీసీఐ చీఫ్ పదవికి అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేయడంతో తాజా నియామకం జరిగింది. కీలకమైన ఢిల్లీ యూనిట్ చీఫ్ పదవికి దేవేందర్ యాదవ్ పేరుతో పాటు రాజేష్ లిలోతియా, అభిషేక్ దత్ పేర్లు కూడా పరిశీలనకు వచ్చినట్టు డీపీసీసీ వర్గాలు సోమవారం ఉదయం తెలిపాయి.
కాగా, డీపీసీసీ చీఫ్ పదవికి అరవీందర్ సింగ్ లవ్లీ శనివారంనాడు రాజీనామా చేయడం పార్టీలో ఒకింత కలకలం రేపింది. ఢిల్లీ యూనిట్ వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో 'ఆప్'తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం తనకు అసంతృప్తి కలిగించినట్టు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపిన రాజీనామా లేఖలో లవ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, తాను పార్టీలోనే కొనసాగుతానని లవ్లీ ప్రకటించారు. ఈ పరిణామలతో అసంతృప్తిగా ఉన్న ఇద్దరు సీనియర్ నేతలు రాజీనామా చేయడం ఎన్నికల ముందు కాంగ్రెస్‌కి గట్టి ఎదురు దెబ్బే అనుకోవచ్చు.
Read Latest News and National News here