Share News

Manipur : బాలుడి తల, చేతులు నరికి..

ABN , Publish Date - Nov 18 , 2024 | 02:48 AM

ఉన్మాదం రాజ్యమేలుతున్నప్పుడు మనుషులు మనుషులుగా ఉండరు. రాక్షసులుగా తయారై కనీస మానవ విలువలకు కూడా దూరమవుతారు.

Manipur : బాలుడి తల, చేతులు నరికి..

  • మణిపూర్‌లో రెండేళ్ల చిన్నారి దారుణ హత్య

  • కుటుంబంలోని మరో ఐదుగురినీ.. నదిలో మృతదేహాలు

  • వెలుగులోకి కుకీ మిలిటెంట్ల దుశ్చర్య

  • రాష్ట్రంలో తీవ్ర నిరసనలు, ఉద్రిక్తత.. కేంద్ర హోంశాఖ సమీక్ష

  • విద్వేషమే బీజేపీ రాజకీయం: కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే

  • బీరేన్‌ సర్కారుకు ఎన్‌పీపీ మద్దతు ఉపసంహరణ

  • వెలుగులోకి కుకీ మిలిటెంట్ల దుశ్చర్య

  • చిన్నారితోపాటు మొత్తం ఆరుగురి హత్య

ఇంఫాల్‌, గౌహతి, న్యూఢిల్లీ, నవంబరు 17: ఉన్మాదం రాజ్యమేలుతున్నప్పుడు మనుషులు మనుషులుగా ఉండరు. రాక్షసులుగా తయారై కనీస మానవ విలువలకు కూడా దూరమవుతారు. మణిపూర్‌ హింసాకాండ దీనినే కళ్లకు కడుతోంది. తాము అపహరించుకెళ్లిన ఆరుగురినీ హత్య చేసిన కుకీ మిలిటెంట్లు.. వారిలో ఓ రెండేళ్ల బాలుడిని తల, చేతులు నరికి అత్యంత దారుణంగా చంపిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తల, రెండు చేతులూ లేని ఆ చిన్నారి మృతదేహం జిరిబమ్‌ ప్రాంతంలోని బరాక్‌ నదిలో దొరికింది. అదే నదిలో ఆ బాలుడి అమ్మమ్మ మృతదేహం కూడా అర్ధనగ్న స్థితిలో బయటపడింది. సోమవారం కుకీ మిలిటెం ట్లు.. మెయితీ తెగకు చెందిన వీరి కుటుంబాన్ని ఓ శరణార్థి శిబిరం నుంచి అపహరించుకెళ్లిన విషయం తెలిసిందే. కిడ్నా్‌పనకు గురైన వారిలో రెండేళ్ల బాలు డు, ఎనిమిది నెలల వయసున్న అతడి తమ్ముడు, తల్లి, అమ్మమ్మ, చిన్నమ్మ, ఆమె కూతురు.. మొత్తం ఆరుగురు ఉన్నారు. అందరి మృతదేహాలు బరాక్‌ నదిలోనే శుక్ర, శనివారాల్లో లభ్యమయ్యాయి. ఈ దా రుణ హత్యలతో ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు వణుకుతున్నారు. శనివారం రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌ లో ఏకం గా ముఖ్యమంత్రి నివాసంపైనే మెయితీ నిరసనకారులు దాడికి దిగారు. పలువురు మంత్రు లు, బీజేపీ ఎమ్మెల్యేల ఇళ్లను దగ్ధం చేశారు. బాధిత కుటుంబాన్ని రక్షించటానికి ప్రభుత్వం తగిన ప్రయత్నాలు చేయలేదని నిరసనకారులు ఆరోపిస్తున్నారు.

Untitled-2 copy.jpg


  • ఎన్‌కౌంటర్‌తో మళ్లీ హింస మొదలు..

గత ఏడాది మే నుంచి జాతుల సంఘర్షణతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో.. ఇటీవల సీఆర్‌పీఎఫ్‌ జవాన్లతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది కుకీ మిలిటెంట్లు మరణించటంతో హింసాకాండ మరోసారి ప్రజ్వరిల్లింది. మరణించిన వారందరూ మెయితీ మిలిటెంట్ల దాడుల నుంచి రక్షణ కోసం గ్రామ వలంటీర్లుగా పని చేస్తున్నారని, వారిని సీఆర్‌పీఎఫ్‌ వాళ్లు కావాలనే పట్టుకొని చంపారని కుకీ సంఘాలు ఆరోపించాయి. ఇదిలా ఉండగానే, గురువారం కుకీల్లోనే ఓ తెగకు చెందిన మహిళను మెయితీ మిలిటెంట్లు అత్యంత దారుణంగా చంపారు. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆ మహిళ కాలిపై మేకులు కొట్టి చిత్రహింసలు పెట్టారు. సామూహిక అత్యాచారం జరిపి, ఆ తర్వాత ఆమెను సజీవ దహనం చేశారు. ఈ ఘటనల నేపథ్యంలోనే, కుకీ మిలిటెంట్లు.. మెయితీ కుటుంబాన్ని కిడ్నాప్‌ చేసి చంపారు.


  • బీజేపీ విద్వేష రాజకీయాల కోసమే: ఖర్గే

తన విద్వేషపూరిత రాజకీయాల కోసమే అందమైన సరిహద్దు రాష్ట్రం మణిపూర్‌ తగలబడాలని బీజేపీ కోరుకుంటున్నట్లు అర్థమవుతోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. తాజా హింసాకాండపై ఆదివారం ఆయన ఎక్స్‌లో స్పందించారు. ‘మే 2023 నుంచీ ఊహించనలవి కానంతటి బాధలో, హింసాకాండలో మణిపూర్‌ ఉంది. ఇది ఆ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును సర్వనాశనం చేసింది. మణిపూర్‌ను ప్రధాని మోదీ విఫలం చేశారు’ అని ఖర్గే పేర్కొన్నారు. మణిపూర్‌ను సందర్శించి, అక్కడ శాంతిభద్రతల స్థాపనకు ప్రయత్నించాలని మోదీని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కోరారు. కాగా, రాష్ట్రంలోని అన్ని మిలిటెంట్‌ సంస్థలపైనా ఉక్కుపాదం మోపాలని మెయితీ పౌరహక్కుల సంఘం ‘కొకొమీ’.. ఆదివారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేసింది. 24 గంటల్లో గట్టి చర్యలు చేపట్టాలంటూ అల్టిమేటం జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రతినిధులు, ఎమ్మెల్యేలు కలిసి కూర్చొని సంక్షోభ నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చింది.

  • సర్కారుకు ఎన్‌పీపీ మద్దతు ఉపసంహరణ

మణిపూర్‌లో హింసాకాండను అదుపులోకి తీసుకురావటంలో విఫలమైనందుకు బీజేపీ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు ఎన్‌పీపీ అధ్యక్షుడు, మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్‌ సంగ్మా ఆదివారం లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించటంలో, శాంతిభద్రతలను పునరుద్ధరించటంలో బీరేన్‌సింగ్‌ సారథ్యంలోని ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆ లేఖలో సంగ్మా పేర్కొన్నారు. కాగా, మణిపూర్‌లో ఆందోళన పరిస్థితుల నేపథ్యంలో.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మహారాష్ట్రలో ఆదివారం పాల్గొనాల్సిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. హోంశాఖ సీనియర్‌ అధికార్లతో ఢిల్లీలో సమీక్ష జరిపారు. మణిపూర్‌లో శాంతిభద్రతల పునరుద్ధరణకు అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.

Updated Date - Nov 18 , 2024 | 02:49 AM