Share News

Darjeeling :విషాద ప్రయాణం

ABN , Publish Date - Jun 18 , 2024 | 05:00 AM

మరో రైలు ప్రమాదం..! కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటన మరువకముందే.. విశాఖ-రాయగడ ప్యాసింజర్‌ రైలు ఉదంతం కళ్లముందు కదలాడుతుండగానే.. ఇంకో ఉదంతం! పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలో సోమవారం ఒకే ట్రాక్‌పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి.

Darjeeling :విషాద ప్రయాణం

బెంగాల్‌లో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన గూడ్స్‌.. 15 మంది దుర్మరణం

సంఖ్య పెరిగే అవకాశం!.. 60 మందికి గాయాలు.. కొందరి పరిస్థితి విషమం

సిగ్నల్‌ పడినా ఆగని గూడ్స్‌!.. ఈ మార్గంలో అందుబాటులోకి రాని ‘కవచ్‌’

మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం.. గాయపడినవారికి 2.50 లక్షలు

అధ్వాన నిర్వహణతోనే ప్రమాదాలు: ఖర్గే, రాహుల్‌.. అనాథలా రైల్వే: మమత

1,500 కి.మీ. మార్గంలోనే ‘కవచ్‌’

దేశవ్యాప్త నెట్‌వర్క్‌లో ఇది 1 శాతమే

ఈ ఏడాదిలోగా మరో 3 వేల కి.మీ.లలో..

న్యూజల్పాయ్‌గరి/కోల్‌కతా, న్యూఢిల్లీ, జూన్‌ 17: మరో రైలు ప్రమాదం..! కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటన మరువకముందే.. విశాఖ-రాయగడ ప్యాసింజర్‌ రైలు ఉదంతం కళ్లముందు కదలాడుతుండగానే.. ఇంకో ఉదంతం! పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలో సోమవారం ఒకే ట్రాక్‌పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందిపైగా గాయపడ్డారు. వీరిలో తీవ్ర గాయాలతోఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అసోంలోని సిల్చార్‌ నుంచి బెంగాల్‌ రాజధాని కోల్‌కతాకు వెళ్తున్న కాంచనగంగా ఎక్స్‌ప్రె్‌సను న్యూజల్పాయ్‌గురి దాటిన తర్వాత రంగసాని స్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైలు వెనుకనుంచి గట్టిగా ఢీకొట్టింది. గూడ్స్‌ బోగీలు చెల్లాచెదురయ్యాయి. కాంచనగంగా బోగీలు రెండు పట్టాలు తప్పగా, ఓ బోగి అమాంతం గాల్లోకి లేచింది. రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

గూడ్స్‌ సిగ్నల్‌ జంప్‌తోనే..

కాంచనగంగా ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సిగ్నల్‌ పడినప్పటికీ, గూడ్స్‌ రైలు దానిని పట్టించుకోకుండా వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై రైల్వేశాఖ నుంచి అధికారికంగా ప్రకటన రావల్సి ఉంది. కాగా, గూడ్స్‌ డ్రైవర్‌, సహాయక డ్రైవర్‌, కాంచనగంగా గార్డ్‌ కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను ఉత్తర బెంగాల్‌ వైద్య కళాశాలకు తరలించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2.50 లక్షలు, స్వల్పగాయాలైన వారికి రూ.50 వేలు పరిహారం అందజేస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటించారు. సోమవారం ఢిల్లీ నుంచి విమానంలో బగ్డోగ్రా చేరుకున్న ఆయన.. అక్కడినుంచి ద్విచక్ర వాహనంపై ప్రమాద స్థలానికి వెళ్లారు.


కాగా, రైలు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందని రాష్ట్రపతి ముర్ము తెలిపారు. సహాయ చర్యలు విజయవంతం కావాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు. కాగా, బెంగాల్‌ రైలు ప్రమాదం పట్ల ప్రధాని మోదీ స్పందించారు. ఆప్తులను కోల్పోయినవారికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. రైల్వే మంత్రిని తక్షణమే ఘటనా స్థలికి వెళ్లమని ఆదేశించినట్లు తెలిపారు.

రైలు ప్రమాదంపై పవన్‌ దిగ్ర్భాంతి

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం న్యూ జల్పాయిగురి ప్రాంతంలో జరిగిన రైలు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కాంచనజంగ రైలును గూడ్స్‌ ఢీ కొట్టిన ఈ ప్రమాదంలో 15 మంది మరణించడం దురదృష్టకరమన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కవచ్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని సోమవారం పార్టీ కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

రీల్స్‌పైనే మంత్రి దృష్టి.. రైళ్లపై లేదు: కాంగ్రెస్‌

మోదీ ప్రభుత్వ అధ్వాన నిర్వహణ, నిర్లక్ష్యంతో పదేళ్లలో రైలు ప్రమాదాలు పెరిగాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కేంద్రం తీరుతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైలు ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మోదీ ప్రభుత్వం రైల్వే శాఖను పూర్తిగా దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. రైల్వేలను స్వీయ ప్రచారానికి వేదికలా మార్చారని మండిపడ్డారు. అశ్విని వైష్ణవ్‌కు ఇన్‌స్టా రీల్స్‌ చేయడంలోనే సమయం సరిపోతోందని, ప్రజల భద్రత ఆయన ప్రాధాన్య అంశాల్లో లేదని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. దేశంలో రైల్వే వ్యవస్థ ఎవరూ పట్టించుకోని అనాథలా మారిందని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. చార్జీలు పెంచడంపై తప్ప ప్రయాణికుల రక్షణ, వసతుల కల్పనపై ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ లేదని మండిపడ్డారు.


1,500 కి.మీ. మార్గంలోనే ‘కవచ్‌’

రెండు రైళ్లు ఒకే ట్రాక్‌ (పట్టాలు)పైకి వచ్చినపుడు ఢీకొనకుండా తీసుకొచ్చిన వ్యవస్థ ‘కవచ్‌’. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ ఉన్న భారత్‌లో ఇంకా చాలా మార్గాల్లో అందుబాటులోకి రాలేదు. ఇప్పటివరకు 1,500 కి.మీ. పరిధి రైల్వే మార్గంలోనే కవచ్‌ వినియోగం ఉంది. ఇది 1.30 లక్షల రూట్‌ కిలోమీటర్లు ఉన్న భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ఒక శాతమే. అందులోనూ మొత్తం కూడా దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలోనే ఉండడం గమనార్హం. తెలంగాణ (684 కి.మీ.)దే అత్యధిక వాటా కావడం విశేషం. ఏపీలో 66, కర్ణాటకలో 117, మహారాష్ట్రలో 598 కి.మీ. నెట్‌ వర్క్‌ కవచ్‌ పరిధిలోకి వచ్చింది.

తాజాగా ప్రమాదం జరిగిన ఢిల్లీ-హౌరా రూట్‌ సహా మరో 3 వేల కి.మీ. మార్గంలో ఈ ఏడాది ఆఖరుకల్లా కవచ్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఒక రైలు వెళ్తున్న ట్రాక్‌పైనే మరో రైలు కూడా వస్తున్నట్లయితే ‘కవచ్‌’ వెంటనే సెన్సార్లతో గుర్తిస్తుంది. రైలు దానంతటదే ఆగిపోతుంది. పైలట్‌ రెడ్‌ సిగ్నల్‌ను పట్టించుకోకుండా వెళ్తున్నా, బ్రేకులు పడిపోతాయి. మరోవైపు బెంగాల్‌ దుర్ఘటనలో సిగ్నలింగ్‌ లోపాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి.

రాణిపత్ర-ఛత్తర్‌హట్‌ కూడలి మధ్య సోమవారం తెల్లవారుజాము నుంచి సిగ్నలింగ్‌ వ్యవస్థ పనిచేయలేదని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. కాంచనగంగా ఎక్స్‌ప్రెస్‌ 8.27 సమయంలో బయల్దేరినా, రాణిపత్ర-ఛత్తర్‌హట్‌ మధ్య ఆగిపోయింది. సాంకేతిక లోపంతో సిగ్నలింగ్‌ వ్యవస్థ పనిచేయనప్పుడు రైళ్లు నడవడానికి వీలుగా స్టేషన్‌ మాస్టర్‌ టీఏ912 సూచన జారీ చేస్తారు. కాంచనగంగాకూ ఇలానే టీఏ912ను జారీచేశారు. కానీ, ఇదే సమయంలో గూడ్స్‌ కూడా వచ్చింది. దీంతో గూడ్స్‌కూ టీఏ912 ఇచ్చారా? లేకపోతే గూడ్స్‌ డ్రైవర్‌ నిబంధనలను ఉల్లంఘించారా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది.

Updated Date - Jun 18 , 2024 | 05:00 AM