Share News

Bengaluru : బీమా సొమ్ము కోసం చనిపోయినట్టుగా నాటకం

ABN , Publish Date - Aug 25 , 2024 | 03:36 AM

జీవిత బీమా సొమ్ము పొందేందుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు నమ్మించారు. అందుకు అవసరమైన మృతదేహం కోసం ఓ యాచకుడిని హత్య చేశారు.

Bengaluru : బీమా సొమ్ము కోసం చనిపోయినట్టుగా నాటకం

  • మృతదేహం కోసం యాచకుడి హత్య

  • కర్ణాటకలో దంపతుల అరెస్టు

బెంగళూరు, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): జీవిత బీమా సొమ్ము పొందేందుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు నమ్మించారు. అందుకు అవసరమైన మృతదేహం కోసం ఓ యాచకుడిని హత్య చేశారు.

కర్ణాటకలోని హాసన్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన శనివారం వెలుగు చూసింది. బెంగళూరు గ్రామీణ జిల్లా చిక్కకోలిగ గ్రామానికి చెందిన మునిస్వామిగౌడతో పాటు, అతని భార్య శిల్పారాణిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఈ నెల 13న గండసి సమీపంలోని గొల్లరహొసహళ్లి గేట్‌ సమీపాన ఓ ప్రమాదం జరిగింది.

కారు టైరు మారుస్తున్న వ్యక్తిపై లారీ దూసుకెళ్లడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు కేసు నమోదైంది. మృతదేహాన్ని హాసన్‌ జిల్లా ఆసుపత్రిలో ఉంచారు. తర్వాత మునిస్వామిగౌడ భార్య శిల్ప ఆసుపత్రికి వెళ్లి.. అది తన భర్త మృతదేహమే అని నమ్మబలికింది. మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించింది.


అయితే, మృతదేహం గొంతుపై గాయం ఉండటంతో పోలీసులు అనుమానంతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే తన బంధువు, శిడ్లఘట్ట సీఐ శ్రీనివా్‌సకు అనుకోకుండా మునిస్వామి ఎదురుపడ్డాడు. చనిపోయిన వ్యక్తి ఎదురుగా కనిపించడంతో సీఐ షాక్‌కు గురయ్యారు.

ఎలా బతికావని అడిగితే.. తాను చనిపోలేదని, బీమా సొమ్ముకోసం నాటకం ఆడానని అసలు విషయం చెప్పాడు. దీంతో మునిస్వామిని సీఐ శ్రీనివాస్‌ అదుపులోకి తీసుకుని.. గండసి పోలీసులకు అప్పగించారు.


పోలీసుల విచారణలో మునిస్వామి అసలు విషయం చెప్పాడు. అప్పుల నుంచి బయటపడేందుకు చనిపోయినట్టు నటించాలని దంపతులిద్దరూ పథకం వేశారు. మృతదేహం కోసం ఒక యాచకుడిని ఎంచుకున్నారు.

అతడిని నమ్మించి మునిస్వామి కారులో తీసుకెళ్లాడు. గొల్లరహొసహళ్లి గేట్‌ సమీపాన కారు టైరు మార్చాలని యాచకుడికి సూచించాడు. అతను ఆ పనిలో ఉండగా.. పథకం ప్రకారం గొంతుకు తాడు బిగించి చంపేశాడు.

ఆ తరువాత తాను ఏర్పాటు చేసుకున్న లారీని యాచకుడి మీదుగా పోనిచ్చాడు. మృతదేహాన్ని గుర్తుపట్టలేకుండా మార్చి.. రోడ్డు ప్రమాదంలో తానే మృతి చెందినట్టు నమ్మించాడు.

Updated Date - Aug 25 , 2024 | 03:41 AM