‘బాంబూ’చోళ్లు ఎవరు?
ABN , Publish Date - Oct 26 , 2024 | 03:45 AM
దేశంలో విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. రోజూ ఇలాంటి హెచ్చరికలు వస్తుండడం అధికారవర్గాల్లో అయోమయం సృష్టిస్తోంది.
మరో 25కు పైగా సర్వీసులకు బెదిరింపులు
హైదరాబాద్-చండీగఢ్ విమానానికి కూడా..
న్యూఢిల్లీ, శంషాబాద్ రూరల్, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): దేశంలో విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. రోజూ ఇలాంటి హెచ్చరికలు వస్తుండడం అధికారవర్గాల్లో అయోమయం సృష్టిస్తోంది. శుక్రవారం వివిధ సంస్థలకు చెందిన 25కుపైగా సర్వీసులకు బెదిరింపులు వచ్చాయి. వీటిలో ఇండిగో 8, విస్తారా 7, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియాలకు చెందిన 6 సర్వీసులున్నాయి. ఢిల్లీ, ముంబై నుంచి తుర్కియే రాజధాని ఇస్తాంబుల్ వెళ్లే విమానాలూ ప్రభావితమయ్యాయి. మొదటి బెదిరింపు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరే విమానానికి వచ్చింది. తర్వాత ముంబై, చెన్నై వంతు. కాగా, హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ విమానాశ్రయం నుంచి పంజాబ్‌లోని చండీగఢ్ వెళ్తున్న ఇండిగో సర్వీసుకూ ఈ బెడద తప్పలేదు. పోలీసులు తెలిపినదాని ప్రకారం.. ఉదయం 10.50గంటలకు చండీగఢ్ వెళ్లే విమానంలో బాంబు పెట్టామని ట్వీట్ వచ్చింది. సీఐఎ్‌సఎఫ్, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది బాంబు, డాగ్‌స్వ్కాడ్‌లతో తనిఖీలు నిర్వహించారు.
ఎలాంటి బాంబులేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాల్‌రాజు తెలిపారు. బాంబు బెదిరింపులపై శంషాబాద్ విమానాశ్రయంలో జనవరి నుంచి 11 కేసులు నమోదయ్యాయి. కాగా, దేశంలో 11 రోజుల్లో బెదిరింపులు వచ్చిన సర్వీసుల సంఖ్య 275 దాటింది. గత 24 గంటల్లోనే వివిధ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి 70పైగా విమానాలకు హెచ్చరికలు అందాయి. వీటిలో ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారాలవే 20 చొప్పున ఉన్నాయి. కాగా హెచ్చరికలు పంపుతున్నది ఎవరో నిఘా, భద్రతా వర్గాలు తెలుసుకోలేకపోయాయి. అయితే, కేంద్రం మల్టీ నేషనల్ టెక్నాలజీ సంస్థల సాయం కోరినట్లు సమాచారం. సోషల్ మీడియా వేదికల నుంచే బెదిరింపులు రావడంతో మెటా, ఎక్స్‌లను వివరాలు కోరింది.
ఈ సంస్థలు ఇంకా స్పందించాల్సి ఉంది. దుండగులు వీపీఎన్ లేదా డార్క్ వెబ్‌ను ఉపయోగిస్తున్నారని, విదేశం నుంచి ఈ చర్యకు పాల్పడుతున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అంతర్జాతీయ కుట్రపైనా ఆరా తీస్తున్నామని ఒక అధికారి చెప్పారు. కీలక రంగాల్లో 35 మంది ఎయిర్ మార్షల్స్‌ను నియమించామని, వీరి సంఖ్యను వందకు పెంచుతామని తెలిపారు. కాగా, అన్నీ ఆకతాయి హెచ్చరికలేనని, దీనివెనుక కుట్ర ఏమీ లేదని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పారు. ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.