Share News

Cauvery Water: తమిళనాడుకు కావేరీ జలాల్ని విడుదల చేయం.. సీడబ్ల్యూఎంఏని తేల్చిచెప్పిన కర్ణాటక

ABN , Publish Date - Jul 13 , 2024 | 10:41 AM

వర్షాభావ పరిస్థితులకు తోడు జలాశయాల్లో నీటి మట్టం అడుగంటుతుండటంతో కావేరీ జలాల్ని(Cauvery Water) తమిళనాడుకి విడుదల చేసే ప్రసక్తే లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇదే అంశంపై మాట్లాడటానికి ఆయన ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Cauvery Water: తమిళనాడుకు కావేరీ జలాల్ని విడుదల చేయం.. సీడబ్ల్యూఎంఏని తేల్చిచెప్పిన కర్ణాటక

బెంగళూరు: వర్షాభావ పరిస్థితులకు తోడు జలాశయాల్లో నీటి మట్టం అడుగంటుతుండటంతో కావేరీ జలాల్ని(Cauvery Water) తమిళనాడుకి విడుదల చేసే ప్రసక్తే లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇదే అంశంపై మాట్లాడటానికి ఆయన ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కావేరీ వాటర్ రెగ్యులేటరీ కమిటీ (CWRC) జులై 31 వరకు తమిళనాడుకు రోజుకొక్క టీఎంసీ చొప్పున నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది.


అయితే కన్నడ సర్కార్ నీటి విడుదలకు అంగీకరించట్లేదు. తమ నీటి అవసరాలు ఎక్కువగా ఉన్నట్లు సీడబ్ల్యూఆర్సీ ముందు చెప్పాలని సిద్ధరామయ్య నిర్ణయించారు. వాతావరణ శాఖ అంచనా వేసిన విధంగా రాష్ట్రంలో వర్షాలు కురవట్లేదని ఆయన అన్నారు. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో కావేరీ నదీ పరివాహక ప్రాంతంలోని నాలుగు డ్యామ్‌లకు 28 శాతం ఇన్‌ఫ్లో తగ్గిందని పేర్కొన్నారు. ఇందుకోసమే తమిళనాడుకి నీటిని విడుదల చేయలేమని తెలిపారు.

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. 28 శాతం లోటు 19 టీఎంసీలకు సమానమని అన్నారు. జులై 31 వరకు తమిళనాడుకు రోజూ ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాల్సి వస్తే అది దాదాపు 20 టీఎంసీలు అవుతుందని చెప్పారు.


హారంగి డ్యాంలో 73 శాతం, హేమావతిలో 55 శాతం, కృష్ణరాజ సాగర్‌లో (KRS) 54 శాతం, కబినిలో 96 శాతం నీటి నిల్వలు ఉన్నాయని గుర్తు చేశారు. కావేరీ నీటిని వదలడంపై న్యాయవాదులు శ్యామ్‌ దివాన్‌, మోహన్‌ కటార్కి సహా ఇతర న్యాయవాద బృందంతో చర్చలు జరిపినట్లు శివకుమార్‌ తెలిపారు.

కబిని డ్యామ్ పూర్తిగా నిండటంతో దాదాపు 5 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. నాలుగు రిజర్వాయర్లు కలిపి కేవలం 60 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని, ఆ నీరు కర్ణాటక అవసరాలకే సరిపోదని, అలాంటిది తమిళనాడుకి ఎలా ఇవ్వాలని డీకే శివకుమార్ ప్రశ్నించారు.

For Latest News and National News click here

Updated Date - Jul 13 , 2024 | 10:43 AM