Share News

లక్ష కోట్ల వ్యవసాయం

ABN , Publish Date - Oct 04 , 2024 | 05:24 AM

దేశంలో సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహం.. ఆహార భద్రత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రూ.లక్ష కోట్లపైగా వ్యయంతో రెండు వ్యవసాయ పథకాల అమలుకు ఆమోదం తెలిపింది.

లక్ష కోట్ల వ్యవసాయం

  • 2 సాగు పథకాలకు కేంద్రం ఆమోదం

  • పీఎం రాష్ట్రీయ కృషి వికాస్‌, కృషోన్నతి.. అన్ని వ్యవసాయ స్కీంలూ వీటి కిందికే

  • వంట నూనెల్లో స్వయం సమృద్ధి సాధనకు రూ.10 వేల కోట్లతో మిషన్‌ ఏర్పాటు

  • రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌

  • మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాళీ, ప్రాకృతి భాషలకు ప్రాచీన హోదా

  • కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలు

న్యూఢిల్లీ, అక్టోబరు 3: దేశంలో సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహం.. ఆహార భద్రత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రూ.లక్ష కోట్లపైగా వ్యయంతో రెండు వ్యవసాయ పథకాల అమలుకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం క్యాబినెట్‌ సమావేశమైంది. ఇందులో.. ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన (పీఎంఆర్కేవీవై), కృషోన్నతి యోజన (కేవై)లకు పచ్చజెండా ఊపింది. కేంద్ర వ్యవసాయ శాఖ కింద అమలవుతున్న దాదాపు 18 పథకాలను హేతుబద్ధీకరించి ఇకపైన రెండు కొత్త పథకాల పరిధిలోకి తీసుకురానున్నారు. పీఎంఆర్కేవీవై సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించినది. కేవై.. ఆహార భద్రత, వ్యవసాయ స్వయం సమృద్ధికి నిర్దేశించినది. మొత్తం 1,01,321 కోట్లతో అమలు చేయనున్నారు.

Untitled-8 copy.jpg

దీంట్లో కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత వ్యయం రూ.69,088 కోట్లు కాగా, రాష్ట్రాలది రూ.32,232 కోట్లు. రూ.57,074 కోట్లను ఆర్కేవీవై కింద, రూ.44,246 కోట్లను కేవీ కింద కేటాయించనున్నారు. పాత 18 పథకాలనూ కలిపి కొత్త స్కీంల కింద రాష్ట్రాల ద్వారా అమలు చేస్తారు. తద్వారా ఇప్పటికే ఉన్న పథకాల ప్రయోజనాలను కొనసాగించినట్లు అవుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. పథకాల హేతుబద్ధీకరణ ద్వారా రాష్ట్రాల వ్యవసాయ రంగానికి సంబంధించి సమగ్ర వ్యూహ పత్రాన్ని సిద్ధం చేసేందుకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొంది. ఒకే విధమైన రెండు పథకాల (డూప్లికేషన్‌)కు ఇకపై ఉండదని వివరించింది.


  • ఐదు భాషలకు ప్రాచీన హోదా

త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర ప్రజలు మాట్లాడే మరాఠీతో పాటు బెంగాలీ, అస్సామీ, పాళీ, ప్రాకృతి భాషలకు కేంద్రం ప్రాచీన హోదా కల్పించింది. ప్రస్తుతం తెలుగు, తమిళం, సంస్కృతం, కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు ఈ హోదా ఉంది. మోదీ ప్రభుత్వం వచ్చాక ప్రాంతీయ భాషలకు ప్రాచీన హోదా ఇవ్వడం ఇదే తొలిసారి. 2004లో తమిళానికి తొలిగా, చివరగా 2014లో ఒడియాకు ఈ హోదా ఇచ్చారు. కాగా, దేశీయంగా వంట నూనె గింజల ఉత్పత్తి పెంపు, స్వయం సమృద్ధి సాధనకు రూ.10,103 కోట్లతో జాతీయ వంట నూనెలు- నూనె గింజల మిషన్‌ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్‌ అంగీకారం తెలిపింది. ప్రస్తుతం మన దేశం 50 శాతం పైగా వంట నూనెలను దిగుమతి చేసుకుంటోంది.

ఈ పరిస్థితిని నివారించేందుకు జాతీయ మిషన్‌ ఉపయోగపడనుంది. ఏడేళ్ల కాలావధికి దీనిని అమలు చేయనున్నారు. ప్రస్తుతం 39 మిలియన్‌ టన్నులుగా ఉన్న వంట నూనె గింజల ఉత్పత్తి 2030-31 నాటికి 69.7 మిలియన్‌ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం అదనంగా 40 లక్షల హెక్టార్లలో వంట నూనె గింజల సాగును ప్రోత్సహించనున్నారు.

Updated Date - Oct 04 , 2024 | 05:25 AM