Share News

CJI Chadrachud : కోర్టు వ్యవహారాలతో ప్రజలు విసిగిపోయారు

ABN , Publish Date - Aug 04 , 2024 | 02:45 AM

కోర్టు వ్యవహారాలతో ప్రజలు విసిగిపోయారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. వారు కేవలం సమస్యలకు ఏదో విధమైన సత్వర పరిష్కారం కావాలని కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.

 CJI Chadrachud : కోర్టు వ్యవహారాలతో ప్రజలు విసిగిపోయారు

  • విచారణ ప్రక్రియే శిక్షగా మారింది

  • సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఆగస్టు 3: కోర్టు వ్యవహారాలతో ప్రజలు విసిగిపోయారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. వారు కేవలం సమస్యలకు ఏదో విధమైన సత్వర పరిష్కారం కావాలని కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.

విచారణ ప్రక్రియే ఓ శిక్షగా మారిందని, ఇది జడ్జీలకు సయితం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక లోక్‌అదాలత్‌ కార్యక్రమం శనివారం ముగిసిన సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.

ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే రాజీ మార్గంలో కేసులు పరిష్కరించేందుకు లోక్‌అదాలత్‌ను నిర్వహించామని చెప్పారు. ప్రజల ఇంటి వద్దకు న్యాయాన్ని తీసుకెళ్లడం, వారి జీవితాల్లో భాగంగా ఉన్నామని చెప్పడమే లోక్‌ అదాలత్‌ల ఉద్దేశమని చెప్పారు. ఇందుకు న్యాయమూర్తులు, న్యాయవాదుల నుంచి సహకారం లభించిందని ప్రశంసించారు.

ఇద్దరు న్యాయమూర్తులు, ఇద్దరు న్యాయవాదులతో కలిసి లోక్‌అదాలత్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. తొలుత ఏడు బెంచ్‌లు ఏర్పాటు చేయగా, వాటి సంఖ్యను 13కు పెంచామని, ఇవి కేసుల పరిష్కారానికి విశేషమైన కృషి చేశాయని చెప్పారు.

తాను ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో దేశంలోని అన్ని ప్రాంతాల వారికి ప్రాతినిధ్యం ఉండేలా చూశానని జస్టిస్‌ చంద్రచూడ్‌ వివరించారు.

Updated Date - Aug 04 , 2024 | 02:45 AM