Share News

congress president kharge : మత స్వేచ్ఛను కాపాడతాం!

ABN , Publish Date - May 19 , 2024 | 05:00 AM

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరాన్ని బుల్డోజర్‌తో నేలమట్టం చేస్తారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కూటమి పార్టీల అగ్రనేతలు నిప్పులు చెరిగారు. అయోధ్య నిర్మాణాన్ని పూర్తి చేయడంతోపాటు దేశంలో మత స్వేచ్ఛను కాపాడతామని స్పష్టం చేశారు.

congress president  kharge : మత స్వేచ్ఛను కాపాడతాం!

అయోధ్య నిర్మాణం పూర్తిచేస్తాం.. రామ మందిరం కూలుస్తామన్న మోదీ వ్యాఖ్యలు దారుణ అబద్ధాలు

  • ఇండియా’ కూటమి నేతల ఫైర్‌

  • బుల్డోజర్‌ సంస్కృతి బీజేపీదేనని ఎద్దేవా

ముంబై, మే 18: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరాన్ని బుల్డోజర్‌తో నేలమట్టం చేస్తారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కూటమి పార్టీల అగ్రనేతలు నిప్పులు చెరిగారు. అయోధ్య నిర్మాణాన్ని పూర్తి చేయడంతోపాటు దేశంలో మత స్వేచ్ఛను కాపాడతామని స్పష్టం చేశారు. తన అబద్ధాలతో మోదీ ప్రజలను తప్పుదోవ పటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదో దశ ఎన్నికల ప్రచారం చివరి రోజైన శనివారం ఇండియా కూటమి అగ్రనేతలు కాంగ్రెస్‌ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్‌ శరద్‌ పవార్‌లు ముంబైలో సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు.

ఖర్గే మాట్లాడుతూ.. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లకు ఎలాంటి భంగం వాటిల్లదని, అవి అలానే కొనసాగుతాయని తెలిపారు. ‘‘మేం ఎవరి మీదా బుల్డోజర్‌ ప్రయోగించలేదు. బుల్డోజర్‌ సంస్కృతి బీజేపీదే. మోదీకి అబద్ధాలు చెప్పడం, ప్రజలను తపుదోవ పట్టించడం అలవాటైపోయింది’’ అని అన్నారు. ‘‘ఆయన(మోదీ) ఎక్కడికి వెళ్లినా సమాజాన్ని విభజించేలా మాట్లాడుతున్నారు’’ అని దుయ్యబట్టారు.


‘‘నా 53 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదు. సమాజాన్ని విభజించడం మోదీకి అలవాటుగా మారింది. విపక్షాలను విచ్ఛిన్నం చేసేందుకు బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతున్నారు’’ అని ఖర్గే నిప్పులు చెరిగారు. మహారాష్ట్రలోని 48 పార్లమెంటు స్థానాలకు 46 స్థానాలను ఇండియా కూటమి కైవసం చేసుకుంటుందన్నారు.

  • వారికి కూటమి వ్యతిరేకం కాదు

ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. బీజేపీ నకిలీ పార్టీ అని, ఆర్‌ఎ్‌సఎస్‌ నకిలీ సంఘ్‌ అని దుయ్యబట్టారు. బీజేపీకి జన్మనిచ్చిన సంస్థను ఆ పార్టీ ఎప్పుడో వదిలేసిందని విమర్శించారు. జూన్‌ 4 నుంచి దేశానికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పారు. ఇండియా కూటమి హిందువులకు వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.

  • మమత మాతోనే

బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమతోనే ఉంటారని, ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతామని ఆమె ఇటీవలే చెప్పారని ఖర్గే వ్యాఖ్యానించారు. మమతను నమ్మలేమన్న అధిర్‌ రంజన్‌ చౌధరి వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. అధిర్‌ ఎలాంటి నిర్ణయాలూ తీసుకునే స్థాయిలో లేరని వ్యాఖ్యానించారు. ‘‘ఈ విషయంపై నిర్ణయం తీసుకునేది నేను, లేదా హైకమాండ్‌. మా నిర్ణయాలతో ఏకీభవించలేని వారు బయటకు పోవచ్చు’’ అని అధిర్‌ను ఉద్దేశించి ఖర్గే అన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో.. మావోయిస్టులదని వ్యాఖ్యానించిన ప్రధానిపై ఖర్గే మండిపడ్డారు. ‘‘మీ(మోదీ) సలహాదారు ఎవరండీ? ఇది హాస్యాస్పదం. ప్రజలను ప్రతిసారీ మోసం చేయలేరు’’ అని అన్నారు.

Updated Date - May 19 , 2024 | 05:00 AM