హరియాణాలో ముగిసిన ప్రచారం
ABN , Publish Date - Oct 04 , 2024 | 03:36 AM
రైతుల ఉద్యమాలు.. రెజ్లర్ల ఆందోళనలతో తరచూ వార్తల్లో నిలిచిన హరియాణాలో అత్యంత కీలకమైన ఎన్నికలకు రంగం సిద్ధమైంది.
రేపు రాష్ట్రంలోని 90 నియోజకవర్గాలకు పోలింగ్
చండీగఢ్, అక్టోబరు 3: రైతుల ఉద్యమాలు.. రెజ్లర్ల ఆందోళనలతో తరచూ వార్తల్లో నిలిచిన హరియాణాలో అత్యంత కీలకమైన ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ.. కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్న ఈ రాష్ట్రంలో శనివారం పోలింగ్ జరగనుంది. మొత్తం 90 స్థానాలకూ ఒకే విడతలో ఓటింగ్ నిర్వహించనున్నారు. 20,269 పోలింగ్ బూత్‌లలో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. గురువారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ సబలో చివరి రోజు అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు.
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధానంగా పోటీ ఉన్నా వీటికి తిరుగుబాటు అభ్యర్థుల నుంచి తలనొప్పి ఎదురవుతోంది. కాంగ్రె్‌సతో సీట్ల పంపకం కుదరకపోవడంతో ఆప్ ఒంటరిగా బరిలో దిగింది. కాగా, సీనియర్ నాయకుడు, శిర్సా మాజీ ఎంపీ అశోక్ తన్వర్ అనూహ్యంగా బీజేపీకి రాజీనామా చేసి మహేంద్రగఢ్ జిల్లాలో అగ్ర నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. అంతకు కొన్ని గంటల ముందు వరకు కూడా తన్వర్ సఫీదన్ నియోజకవర్గ బీజేపీ అఽభ్యర్థి తరఫున ప్రచారం చేయడం గమనార్హం.