Share News

Global Education Monitoring : చదువులను దెబ్బతీస్తున్న స్మార్ట్‌ఫోన్‌

ABN , Publish Date - Aug 05 , 2024 | 02:24 AM

స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం విద్యార్థులపై దుష్ప్రభావం చూపిస్తోందని గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌(జెమ్‌) నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయిలో అధ్యయనం చేసిన జెమ్‌..

 Global Education Monitoring : చదువులను దెబ్బతీస్తున్న స్మార్ట్‌ఫోన్‌

  • ప్రతి 4 దేశాల్లో ఒక దేశంలోని స్కూళ్లలో నిషేధం

  • గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ, ఆగస్టు 4: స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం విద్యార్థులపై దుష్ప్రభావం చూపిస్తోందని గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌(జెమ్‌) నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయిలో అధ్యయనం చేసిన జెమ్‌.. స్మార్ట్‌ఫోన్‌ వినియోగాన్ని సాంకేతికత వరకు పరిమితం చేస్తే మేలేనని పేర్కొంది.

కానీ, దీనికంటే కూడా విద్యార్థులపై వ్యతిరేక ప్రభావాలు పడుతున్నాయని దీంతో చదువుపై వారిలో ఆసక్తి సన్నగిల్లుతోందని వివరించింది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా నాలుగుదేశాలను పరిగణనలోకి తీసుకుంటే ఒక దేశంలోని స్కూళ్లలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగంపై నిషేధం విధించినట్టు తెలిపింది.

‘విద్యలో సాంకేతికత వినియోగం’ పేరుతో వెలువరించిన జెమ్‌ నివేదికను యునెస్కో ప్రచురించింది. ఐక్యరాజ్యసమితి విద్యా విభాగానికి చెందిన ఒక నిపుణుడు మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో సాంకేతికత వినియోగం ఖర్చుతో కూడుకున్న నేపథ్యంలో స్మార్ట్‌ ఫోన్లలో ఉండే టెక్నాలజీని వినియోగించుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. ‘‘విద్య, అభ్యసన విధానాల్లో డిజిటల్‌ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది.

కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్‌ మాధ్యమం ద్వారా విద్యాబోధన, అభ్యసన వంటివి కొనసాగాయి’’ అని నివేదిక వివరించింది. అయితే.. అంతర్జాతీయ స్థాయిలో రూపొందించిన అంచనా ప్రకారం.. విద్యలో సాంకేతికతను తీసుకురావడం వల్ల అభ్యసన తీరుపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా మొబైల్‌ వినియోగం ద్వారా విద్యార్థులు చదువుపై ఆసక్తి కోల్పోతున్నారని 14 దేశాల్లో చేసిన అధ్యయనం తాలూకు వివరాలను వెల్లడించింది. అయినప్పటికీ నాలుగింట ఒక దేశం మాత్రమే స్కూళ్లలో స్మార్ట్‌ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించారని పేర్కొంది. ఇక, యునెస్కో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. స్మార్ట్‌ ఫోన్లు, కంప్యూటర్ల వినియోగంతో విద్యార్థులపై ప్రభావం పడుతోందని పేర్కొంది. మరోవైపు, మెటా అధ్యయనం కూడా ఈ అభిప్రాయమే వ్యక్తం చేసింది. 14 దేశాల్లో ప్రాథమిక స్థాయి నుంచి హైస్కూల్‌ విద్య వరకు స్మార్ట్‌ఫోన్ల వినియోగం కారణంగా విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడుతోందని మెటా అధ్యయనం పేర్కొంది.

Updated Date - Aug 05 , 2024 | 02:24 AM