Share News

Nirmala Sitharaman : ప్రైవేట్‌ హాస్టళ్లకు జీఎస్టీ మినహాయింపు

ABN , Publish Date - Jun 23 , 2024 | 02:47 AM

ప్రైవేటు హాస్టళ్లలో ఉండే విద్యార్థులు.. రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ అధ్యక్షతన శనివారం జరిగిన 53వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో..

 Nirmala Sitharaman : ప్రైవేట్‌ హాస్టళ్లకు జీఎస్టీ మినహాయింపు
Nirmala Sitaraman

  • రైల్వేలో పలు సేవలపైనా జీఎస్టీ రద్దు

  • పలు ఉత్పత్తులపై 12 శాతానికి తగ్గింపు

  • పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్రాలదే నిర్ణయం

  • జూన్‌ 30 దాకా రిటర్న్స్‌ దాఖలుకు చాన్స్‌

  • 53వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో నిర్మల

  • రాష్ట్రానికి కేంద్ర పథకాల వాటా పెంచాలి

  • ‘పాలమూరు-రంగారెడ్డి’కి జాతీయ హోదా ఇవ్వాలి: భట్టి

న్యూఢిల్లీ, జూన్‌ 22: ప్రైవేటు హాస్టళ్లలో ఉండే విద్యార్థులు.. రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ అధ్యక్షతన శనివారం జరిగిన 53వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో.. పలు సేవలకు పన్ను మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు విద్యాసంస్థల హాస్టళ్లలో కాకుండా.. ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటే.. నెలవారీ అద్దెపై జీఎస్టీని మినహాయించాలని కౌన్సిల్‌ నిర్ణయించింది. అయితే.. విద్యార్థుల నుంచివసూలు చేసే నెలవారీ అద్దె రూ.20 వేలలోపు ఉండాలి. హాస్టళ్ల నిర్వాహకులు మోసాలకు పాల్పడకుండా ఉండేందుకు.. సంబంధిత విద్యార్థి కనీసం 90 రోజులుగా ఆ వసతి గృహంలో ఉండాలనే నిబంధనను పెట్టారు. అంతేకాదు.. రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారం టికెట్లు, వెయిటింగ్‌ రూమ్‌, క్లోక్‌రూమ్‌ చార్జీలు, ప్లాట్‌ఫారాలపై బ్యాటరీ కారు సేవలను కూడా జీఎస్టీ నుంచి మినహాయించారు.

ఇక ఇప్పటి వరకు రెండు స్లాబులుగా ఉన్న సోలార్‌ కుక్కర్ల జీఎస్టీని 12శాతంగా సవరించారు. ఫైర్‌ సహా.. అన్నిరకాల స్ర్పింక్లర్లు, పౌలీ్ట్ర యంత్రాలు, అన్ని రకాల కార్టన్లు(అట్టెపెట్టెలు), ఇనుము, ఉక్కు, అల్యూమినియంతో తయారు చేసిన పాలక్యాన్లపై జీఎస్టీలను ఏకీకృతం చేస్తూ.. 12శాతానికి తగ్గించారు.


చిరు వ్యాపారులకు లబ్ధి

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో చిరు వ్యాపారులకు మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ వెల్లడించారు. జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘జీఎస్టీ ట్రైబ్యునళ్లు, కోర్టులకు వెళ్లే వారికి విధించే డిపాజిట్‌ మొత్తాన్ని తగ్గించాం. సీజీఎస్టీ చట్టంలో పలు సవరణలకు కౌన్సిల్‌ ప్రతిపాదనలు చేసింది. ఈ క్రమంలో జీఎస్టీ చెల్లింపులకు చివరి తేదీని పొడిగించాం. ఈ నిర్ణయాలతో చిరువ్యాపారులు, ఎంఎ్‌సఎంఈలకు లబ్ధి చేకూరుతుంది’’ అని ఆమె వివరించారు. జీఎస్టీ రిఫండ్‌ మోసాలను అరికట్టేందుకు ఆధార్‌ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేయాలని నిర్ణయించాం. 52వ కౌన్సిల్‌ సమావేశం గత ఏడాది అక్టోబరులో జరిగిందని, ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ కారణంగా భేటీ జరగలేదని గుర్తు చేశారు. ఆగస్టు చివరి వారంలో తదుపరి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

వాణిజ్యానికి బాసట

  • 2017-18 నుంచి 2019-20 వరకు జీఎస్టీ చట్టంలోని సెక్షన్‌ 73 కింద వర్తకులు, వ్యాపారులకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి.. వడ్డీ లేదా జరిమానా లేదా రెండింటినీ షరతులతో మినహాయించేలా సవరణలు చేయాలని కౌన్సిల్‌ నిర్ణయించింది.

  • జీఎస్టీ అప్పీళ్లకు రూ.20లక్షల దాకా ఉండే మొత్తానికి సంబంధించి జీఎస్టీ ట్రైబ్యునళ్లు, రూ.20లక్షల నుంచి రూ.కోటి మధ్య ఉండే మొత్తానికి హైకోర్టు, ఆపైన మొత్తానికి సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని కౌన్సిల్‌ సిఫారసు చేసింది. అప్పీల్‌ దాఖలు సమయాన్ని మూడు నెలల వ్యవధిని ఇవ్వాలని సూచించింది.

  • జీఎస్టీ అప్పీల్‌కు చెల్లించాల్సిన ప్రీ-డిపాజిట్‌ మొత్తాన్ని రూ.25 కోట్ల నుంచి రూ.20 కోట్లకు తగ్గించేలా జీఎస్టీ చట్టంలోని సెక్షన్లు 107, 112కు సవరణలు చేయాలని కౌన్సిల్‌ ప్రతిపాదించింది.

  • ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌(ఈఎన్‌ఏ)ను పన్ను మినహాయింపు జాబితా నుంచి తొలగించాలని కౌన్సిల్‌ సిఫారసు చేసింది.

  • చిన్న వ్యాపారులకు పన్ను చెల్లింపునకు జీఎస్టీఆర్‌-4 రిటర్న్స్‌ దాఖలు గడువును ఏప్రిల్‌ 30 నుంచి జూన్‌ 30కి మార్చారు.


పెట్రోల్‌, డీజిల్‌పై నిర్ణయం రాష్ట్రాలదే

పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్నదే ఎన్డీయే సర్కారు లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ స్పష్టం చేశారు. 2017లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కూడా ఈ విషయంపై విస్పష్టమైన వివరణ ఇచ్చినట్లు గుర్తుచేశారు. అయితే.. దీనిపై రాష్ట్రాలు తేల్చుకోవాల్సి ఉందని నిర్మల అన్నారు. ‘‘పెట్రోల్‌, డీజిల్‌పై జీఎస్టీ రేటు ఎంత ఉండాలి? అన్నదాన్ని రాష్ట్రాలు నిర్ణయించుకోవాల్సి ఉంది. ఒక్కసారి రాష్ట్రాలు ఒక రేటను చెబితే.. కేంద్రం అందుకు అనుగుణంగా పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తుంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

Updated Date - Jun 23 , 2024 | 08:33 AM