Share News

Delhi : ఐఐటీ మద్రాస్‌ ఆరోసారీ బెస్ట్‌

ABN , Publish Date - Aug 13 , 2024 | 05:15 AM

దేశంలోని ఉత్తమ విద్యాసంస్థలకు కేంద్రప్రభుత్వం సోమవారం ర్యాంకులు ప్రకటించింది. వరుసగా ఆరో ఏడాది కూడా ఐఐటీ మద్రాస్‌ అత్యుత్తమ విద్యాసంస్థగా టాప్‌లో నిలిచింది. బోధన, సిబ్బంది, సౌకర్యాలు.. ఇలా అన్ని అంశాల్లోనూ ముందు వరుసగా నిలిచింది.

Delhi : ఐఐటీ మద్రాస్‌  ఆరోసారీ బెస్ట్‌

  • ఈ సంస్థకే తొలి ర్యాంకు.. బోధన, సిబ్బంది, సౌకర్యాల్లో టాప్‌

  • ఉత్తమ సంస్థగా ఐఐఎస్‌సీ బెంగళూరు.. విద్యాసంస్థలకు ర్యాంకులు

  • స్టేట్‌ పబ్లిక్‌ వర్సిటీ విభాగంలో ఆంధ్రా వర్సిటీకి ఏడో ర్యాంక్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 12: దేశంలోని ఉత్తమ విద్యాసంస్థలకు కేంద్రప్రభుత్వం సోమవారం ర్యాంకులు ప్రకటించింది. వరుసగా ఆరో ఏడాది కూడా ఐఐటీ మద్రాస్‌ అత్యుత్తమ విద్యాసంస్థగా టాప్‌లో నిలిచింది. బోధన, సిబ్బంది, సౌకర్యాలు.. ఇలా అన్ని అంశాల్లోనూ ముందు వరుసగా నిలిచింది. ఉత్తమ విద్యాసంస్థల జాబితాలో ఐఐఎ్‌ససీ బెంగళూరుకు మొదటి ర్యాంకు లభించింది. ఈ ఏడాది కొత్తగా స్టేట్‌ పబ్లిక్‌ వర్సిటీల విభాగాన్ని చేర్చారు. ఈ జాబితాలో ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఏడో ర్యాంకు లభించింది. న్యాయ విద్యాలయాల జాబితాలో హైదరాబాద్‌లోని నల్సార్‌కు మూడో ర్యాంకు లభించింది. ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌- 2024’ కింద కేంద్ర విద్యాశాఖ ఈ ర్యాంకులను ప్రకటించింది.

అన్నింటా బెస్ట్‌ : ఎనిమిది ఐఐటీలు, ఎయిమ్స్‌, ఢిల్లీ, జేఎన్‌యూలు చోటు దక్కించుకున్నాయి. వరుసగా ఐఐటీ మద్రాస్‌, ఐఐఎ్‌ససీ బెంగళూరు, ఐఐటీ బెంగళూరు టాప్‌లో నిలిచాయి.

ఇంజనీరింగ్‌ కాలేజీలు : తొమ్మిది ఐఐటీలను ఎంపిక చేశారు. ఐఐటీ మద్రాస్‌ (వరుసగా ఇది తొమ్మిదోసారి), ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే వరుసగా మూడు ర్యాంకులు దక్కించుకున్నాయి. ఐఐటీయేతర సంస్థల్లో నిట్‌, తిరుచిరాపల్లి విద్యాసంస్థలు టాప్‌ టెన్‌లో నిలిచాయి.


మేనేజ్‌మెంట్‌ కాలేజీలు : ఐఐఎమ్‌ అహ్మదాబాద్‌, ఐఐటీ బెంగళూరు, ఐఐటీ కోజికోడ్‌లు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. మేనేజ్‌మెంటు కోర్సుల విభాగంలో ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ మొదటి రెండు ర్యాంకులు కైవసం చేసుకున్నాయి.

కాలేజీల కేటగిరీ : ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ హిందూ కాలేజీ, మిరిందా హౌస్‌ తొలి రెండు స్థానాలో ఉన్నాయి. సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీకు మూడో ర్యాంకు దక్కింది.

న్యాయ విద్యాలయాలు : నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ-బెంగళూరు, నేషనల్‌ లా యూనివర్సిటీ-ఢిల్లీ, నల్సార్‌- హైదరాబాద్‌కు వరుసగా మూడు ర్యాంకులు లభించాయి. ఆర్కిటెక్చర్‌ ప్లానింగ్‌లో ఐఐటీ రూర్కీ, ఐఐటీ ఖరగ్‌పూర్‌, నిట్‌ కాలికట్‌ వరుసగా మూడు ర్యాంకులు సాధించాయి.

మెడికల్‌ కాలేజీలు : ఎయిమ్స్‌-ఢిల్లీకి తొలి ర్యాంకు లభించింది. పీజీఐఎమ్‌ఈ-చండీగఢ్‌, సీఎమ్‌సీ- వెల్లూరు మిగతా రెండు స్థానాల్లో నిలిచాయి.

Updated Date - Aug 13 , 2024 | 05:16 AM