Share News

Karnataka: కర్ణాటకలో వెలుగులోకి మరో స్కాం..

ABN , Publish Date - Sep 06 , 2024 | 11:50 AM

కర్ణాటకలో మరో స్కాం వెలుగులోకి వచ్చింది. కరోనా సమయంలో కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీ ఈ నివేదికను ఆగస్టు 30నే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.

Karnataka: కర్ణాటకలో వెలుగులోకి మరో స్కాం..

బెంగళూరు: కర్ణాటకలో మరో స్కాం వెలుగులోకి వచ్చింది. కరోనా సమయంలో కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీ ఈ నివేదికను ఆగస్టు 30నే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. COVID-19 అక్రమాలపై మధ్యంతర నివేదికను లోతుగా పరిశీలించేందుకు సీనియర్ అధికారుల బృందానికి అందజేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. బీజేపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కాంగ్రెస్ తెలిపింది.

"కరోనా సమయంలో వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయి. ఆ ఫైళ్లను ట్రాక్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కనిపించకుండా పోయినట్లు గుర్తించాం" అని మైఖెల్ అన్నారు. చీఫ్ సెక్రటరీ, అడిషనల్ చీఫ్ సెక్రటరీ (ఆర్థిక శాఖ)తో కూడిన బృందం ఫలితాలను విశ్లేషించి, నివేదికను సీఎంకు, రాష్ట్ర మంత్రిమండలికి అందజేస్తుంది. వచ్చే రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ఈ మధ్యంతర నివేదికను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.


ఏంటి ఈ ముడా స్కాం..

మైసూరులో దశాబ్దాల క్రితం సిటీ ఇంప్రూవ్‌మెంట్‌ ట్రస్టు బోర్డు (సీఐటీబీ) ఉండగా.. దాని స్థానంలో 1987లో మైసూరు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ముడా) ఏర్పడింది. సీఎం సిద్దరామయ్య బావమరిది మల్లికార్జునస్వామి కెసరె గ్రామం సర్వే నం.464లో ఉన్న 3.16 ఎకరాల వ్యవసాయ భూమిని 2004లో కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ముడాస్కాం(MUDA Scam)లో సీఎం సిద్దరామయ్య, ఆయన సతీమణి పార్వతితో పాటు మరో ఇద్దరి ప్రమేయం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. సిద్దరామయ్య, పార్వతి, ముడా అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ ఫిర్యాదు చేశారు.

ఇప్పటికే ముడాలో అక్రమాల ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. పార్వతికి ఆమె సోదరుడు 1998లో ఇచ్చిన భూమికి నష్ట పరిహారం లభించిందని సీఎం చెబుతుండగా.. ఆ భూమిని మల్లికార్జున 2004లో కొనుగోలు చేసి 2010లో పార్వతికి బహుమతిగా ఇచ్చారని స్నేహమయి కృష్ణ చెబుతున్నారు. ఈ భూమి అప్పటికే డీనోటిఫై చేసినా వ్యవసాయ భూమిగా తప్పుగా చూపారని ఆరోపించారు. ఆ తర్వాత ఆ భూమిని ముడా సేకరించిందని.. అందుకు పరిహారంగా 2021లో దక్షిణ మైసూరులో అత్యంత ఖరీదైన 38,283చ.గ. స్థలాన్ని పార్వతి పొందారని తెలిపారు.


అయితే ప్రభుత్వం, రెవెన్యూ అధికారుల సహాయంతో ఫోర్జరీ పత్రాలతో మల్లికార్జున ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించారని స్నేహమయి కృష్ణ ఆరోపించారు. 1998లోనే ఆ భూమి కొనుగోలు చేసినట్టుగా చూపి, 2014లో సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్వతి లబ్ధి పొందారని తీవ్ర విమర్శలు చేశారు. ముడాలో అక్రమాలు జరిగాయని సీఎం సతీమణి పార్వతి అనుచిత లబ్ధి పొందారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముడా సేకరించిన భూమి కంటే పరిహారంగా చెల్లించిన భూమి అనేక రెట్లు విలువైనదని.. ఫలితంగా రాష్ట్ర ఖజానాకు రూ.4000 కోట్లు నష్టం వాటిల్లిందని కమలనాథులు ఆరోపిస్తున్నారు. దీనికి కౌంటర్‌గా బీజేపీని ఆత్మరక్షణ పడేయటానికే కొవిడ్ స్కాం అంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.

For Latest News click here

Updated Date - Sep 06 , 2024 | 11:50 AM