HD Kumaraswamy: బీజేపీతో వేదిక పంచుకోం... హెచ్‌డీ కుమారస్వామి సీరియస్
ABN , Publish Date - Jul 31 , 2024 | 06:12 PM
లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన జేడీసీ తాజాగా అడ్డం తిరిగింది. కర్ణాటక బీజేపీ తలపెట్టిన పాదయాత్రకు తమ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన జేడీసీ (JDS) తాజాగా అడ్డం తిరిగింది. కర్ణాటక బీజేపీ (BJP) తలపెట్టిన పాదయాత్ర (Padayatra)కు తమ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) తెలిపారు. పాదయాత్రలో పాల్గొనేందుకు హసన్ మాజీ ఎమ్మెల్యే ప్రీతం గౌడకు ఆహ్వానం పంపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య ప్రభుత్వం అవకతవకలపై ఆగస్టు 3 నుంచి వారం రోజుల పాదయాత్ర చేపడుతున్న బీజేపీ ఇటీవల ప్రకటించింది.
పెన్‌డ్రైవ్‌లు పంచిందెవరో బీజేపీకి తెలియదా?
బీజేపీ పాదయాత్రకు జేడీఎస్ మద్దతు ఇచ్చేది లేదని, దేవెగౌడ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తితో వేదిక ఎలా పంచుకుంటున్నానని బుధవారంనాడు మీడియా ముందు కుమారస్వామి నిప్పులు చెరిగారు. ''వాళ్లు (బీజేపీ) మమ్మల్ని పరిగణనలోకి తీసుకోనప్పుడు వారికి మేము ఎందుకు మద్దతిస్తాం? పాదయాత్రలో మమ్మల్ని ఎలా చూసుకుంటారో వాళ్లు చెప్పాలి. వాళ్లు ఏం సాధించాలనుకుంటున్నారు? నేను గాయపడ్డాను. అసలు ప్రీతం జే గౌడ ఎవరు? హెచ్‌డీ దేవెగౌడ కుటంబాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించిన వారిలో అతను ఒకడు. వాళ్లు (బీజేపీ) ఆయనను వేదికపై తేవాలనుకుంటున్నారు. నాతో పాటు కూర్చుపెట్టాలనుకుంటున్నారు. పెన్‌డ్రైవ్ (ప్రజ్వల్ రేవణ్ణ కేసులో)ల పంపిణీ వెనుక బాధ్యులెవరు? హసన్‌లో ఏమి జరిగిందో బీజేపీకి తెలియదా? ఎన్నికల్లో పొత్తు వేరు, రాజకీయాలు వేరు'' అని కుమారస్వామి తీవ్రస్వరంతో అన్నారు.
Puja Khedkar: పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యూపీఎస్‌సీ
దీనికి ముందు, జేడీఎస్ కోర్ కమిటీ జీటీ దేవెగౌడ అధ్యక్షతన బెంగళూరులో సమావేశమైంది. రాష్ట్రంలో వర్షాలు పడుతున్న కారణంగా పాదయాత్ర వాయిదా వేయాలని కూడా బీజేపీని కోర్‌కమిటీ కోరింది. తాజాగా బీజేపీ పాదయాత్రకు దూరంగా ఉండాలని కుమారస్వామి నిర్ణయించారు. వర్షాలు, కొండచరియలు, పంటల ధ్వంసంతో రాష్ట్రం వణుకుతోందని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పాదయాత్ర చేస్తే ప్రజల నుంచి విమర్శలు ఎదురయ్యే అవకాశాలున్నాయని, ఆ కారణంగా తాము పాదయాత్రను ఉపసంహరించుకుంటున్నామని ఆయన చెప్పారు. బీజేపీ తలపెట్టిన పాదయాత్రకు నైతిక మద్దతు కూడా ఇవ్వడం లేదన్నారు. తమను నమ్మనప్పుడు మద్దతు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. బెంగళూరు నుంచి మైసూరు వరకూ తమ పార్టీ చాలా బలంగా ఉందన్నారు. ప్రస్తుతానికైతే పాదయాత్రలో చేరేందుకు జేడీఎస్ కోర్ కమిటీ ఏమాత్రం సానుకూలంగా లేదని ఆయన తెగేసి చెప్పారు.
Read More National News and Latest Telugu News