Mamata: ఏమో.. మోదీ సర్కారు 15 రోజుల్లో కూలిపోవచ్చు
ABN , Publish Date - Jun 09 , 2024 | 04:21 AM
ఎన్నికల్లో కనీస మెజారిటీ సాధించడంలో విఫలమై.. మిత్రపక్షాల మద్దతుతో ఎన్డీఏ అధికారం చేపడుతున్న వేళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రభుత్వాలు ఒక్కరోజే ఉంటాయని.. మోదీ సర్కారు పదిహేను రోజుల్లో కూలిపోవచ్చేమో? అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అక్రమంగా అధికారంలోకి వచ్చిందని, వారికి శుభాకాంక్షలు చెప్పలేమని వ్యాఖ్యానించారు.
కేంద్రంలో త్వరలో ‘ఇండియా’ సర్కారు
ప్రమాణానికి పిలవలే.. వెళ్లేదీ లేదు: మమత
కొన్ని ప్రభుత్వాలు ఒక్క రోజే!
కేంద్రంలో త్వరలో ‘ఇండియా’ కూటమి ప్రభుత్వం: మమత
కోల్‌కతా, జూన్ 8: ఎన్నికల్లో కనీస మెజారిటీ సాధించడంలో విఫలమై.. మిత్రపక్షాల మద్దతుతో ఎన్డీఏ అధికారం చేపడుతున్న వేళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రభుత్వాలు ఒక్కరోజే ఉంటాయని.. మోదీ సర్కారు పదిహేను రోజుల్లో కూలిపోవచ్చేమో? అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అక్రమంగా అధికారంలోకి వచ్చిందని, వారికి శుభాకాంక్షలు చెప్పలేమని వ్యాఖ్యానించారు. కేంద్రంలో త్వరలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని అంటే ఎప్పటికీ చేయలేమని అర్థం కాదు కదా? అని తెలిపారు.
శనివారం కొత్తగా ఎన్నికైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశంలో మమతా మాట్లాడారు. ‘‘400 సీట్లు గెలుస్తామని మాట్లాడినవారు సొంతంగా కనీస మెజారిటీ కూడా సాధించలేకపోయారు. ఇండియా కూటమి వెనక్కుపోయిందని అనుకోవద్దు. పరిస్థితులు మారుతాయని మేం వేచి చూస్తున్నాం. కొద్ది రోజులు ఆగండి. ఏమో ఏమైనా జరగొచ్చు.
ఇలాంటి బలహీన, అనిశ్చిత ప్రభుత్వం పడిపోతేనే మాకు ఆనందం. మోదీ ప్రమాణానికి మమ్మల్ని పిలవలేదు. పిలిచినా మేం వెళ్లేవాళ్లం కాదు. అసంతృప్తులను పట్టుకుని బీజేపీ వాళ్లు మళ్లీ పార్టీలను చీలుస్తారు’’ అని మండిపడ్డారు. కాగా, తృణమూల్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా మమతా బెనర్జీని, లోక్‌సభాపక్ష నేతగా సుదీప్ బందోపాధ్యాయను, ఉపనేతగా కకోలీ ఘోష్ దస్తీదర్‌ను ఎన్నుకున్నారు. రాజ్యసభా పక్ష నేతగా డెరెక్ ఓబ్రయిన్‌ను మరోసారి నియమించారు.