Mamata Banerjee: రెండు నెలల క్రితమే ఇంట్లో కూర్చొని.. ఎగ్జిట్ పోల్స్‌పై మమతా సెటైర్లు
ABN , Publish Date - Jun 03 , 2024 | 04:47 PM
కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని పీఠం ఎక్కుతారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే..
కేంద్రంలో మరోసారి బీజేపీ (BJP) ప్రభుత్వం ఏర్పడుతుందని, ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రధాని పీఠం ఎక్కుతారని ఎగ్జిట్ పోల్స్ (Exit Polls 2024) అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఎగ్జిట్ పోల్స్‌పై తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రంగా మండిపడ్డారు. రెండు నెలల క్రితమే వీటిని ఇంట్లో కూర్చొని తయారు చేశారని ఆమె ఆరోపణలు చేశారు. ఈ ఎగ్జిట్ పోల్స్‌కి ఏమాత్రం విలువ లేదన్న తృణమూల్ కాంగ్రెస్ చీఫ్.. 2016, 2021లో బెంగాల్ అసెంబ్లీ సమయంలో వచ్చిన ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పయ్యాయని గుర్తు చేశారు.
Read Also: అన్నింటికన్నా అదే ముఖ్యం.. హెడ్ కోచ్ వార్తలపై గంభీర్ క్లారిటీ
ఓ న్యూస్ ఛానెల్‌తో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ ఎగ్జిట్ పోల్స్‌ను రెండు నెలల క్రితమే కొందరు వ్యక్తులు ఇంట్లో కూర్చొని తయారు చేసినట్లు అనిపిస్తోంది. ఇవి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేవు. ఈ ఎగ్జిట్ పోల్స్‌కి ఎలాంటి విలువ లేదు. 2016, 2019, 2021లో ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహించబడ్డాయో అందరికీ తెలుసు. ఆ అంచనాలన్నీ నిజం కాలేదు’’ అని అన్నారు. తన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ప్రజల నుంచి వచ్చిన స్పందన.. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ధృవీకరించలేవని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో.. కాంగ్రెస్, సీపీఐ(ఎం) కలిసి పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి సహాయం చేశాయని ఆమె కుండబద్దలు కొట్టారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాలను ముస్లింలు తీసుకుంటారని బీజేపీ చేసిన తప్పుడు ప్రచార విధానాన్ని బట్టి చూస్తే.. ఆ పార్టీకి ముస్లింలు ఓటు ఉండరని తాను అనుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు.
Read Also: విరాట్ కోహ్లీపై సంచలనం.. అలాగైతే జట్టులో ఉండి దండగ!
ఇదే సమయంలో ఇండియా కూటమిపై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ పార్టీలతో విభేదాలు ఉన్నప్పటికీ.. కూటమి అధికారంలోకి వస్తే తాము అందులో చేరేందుకు సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. ‘‘సీపీఐ(ఎం) జోక్యం చేసుకుంటే తప్ప.. అఖిల భారత స్థాయిలో ఎలాంటి అడ్డంకులు ఉండవని నేను అనుకుంటున్నాను. ప్రతి ప్రాంతీయ పార్టీకి ఆత్మగౌరవం ఉంటుంది. అందరితో మాట్లాడిన తర్వాత మమ్మల్ని ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తాం. అవసరమైతే.. ఇతర ప్రాంతీయ పార్టీలను కూడా తీసుకెళ్తాం’’ అని మమతా బెనర్జీ అన్నారు.
Read Latest National News and Telugu News