Share News

‌కాంగ్రెస్‌కు నో ఎంట్రీ బోర్డు!

ABN , Publish Date - Oct 09 , 2024 | 05:25 AM

దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రె్‌సకు ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టారని ప్రధాని మోదీ అన్నారు. దశాబ్దాల తరబడి ఆ పార్టీకి అధికారం ఇవ్వకుండా దూరం పెడుతుండడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

‌కాంగ్రెస్‌కు నో ఎంట్రీ బోర్డు!

చాలా రాష్ట్రాలు ఆ పార్టీని కోరుకోవడంలేదు.. కుల చిచ్చు ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టారు

కార్యకర్తల వల్లే హరియాణా గెలుపు : మోదీ

న్యూఢిల్లీ, అక్టోబరు 8: దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రె్‌సకు ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టారని ప్రధాని మోదీ అన్నారు. దశాబ్దాల తరబడి ఆ పార్టీకి అధికారం ఇవ్వకుండా దూరం పెడుతుండడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మంగళవారం హరియాణా, జమ్ముకశ్మీర్‌ ఎన్నికల ఫలితాల అనంతరం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మోదీ మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా పలుచన చేసేందుకు కాంగ్రెస్‌ కుట్ర పన్నిందని ఆరోపించారు. చివరికి ఎన్నికల కమిషన్‌ వంటి సంస్థపై కూడా నిందలు వేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ కులగణన పేరుతో ప్రజల మధ్య చీలిక తెచ్చేందుకు, ఎస్సీ, ఎస్టీలను, రైతులను, యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. కానీ, హరియాణా ప్రజలు కాంగ్రెస్‌ దేశవ్యతిరేక చర్యలను తిప్పికొట్టేలా తీర్పునిచ్చారని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలు పూర్తి అంకితభావంతో ప్రజా సంక్షేమానికి పాటుపడుతూ, అభివృద్ధి అజెండాను ప్రజల వద్దకు తీసుకెళ్లటం వల్లే హరియాణాలో చరిత్రాత్మక విజయం దక్కిందన్నారు. ఇక జమ్ముకశ్మీర్‌ ఫలితం..

భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం సాధించిన విజయమన్నారు. అక్కడ బీజేపీ అత్యధిక ఓట్లు సాధించిందని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రతి రాష్ట్రంలోనూ సుదీర్ఘకాలం ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారని మోదీ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ.. ఇతర పార్టీలపై ఆధారపడే పరాన్నజీవిగా మారిందని, చివరికి ఆ పార్టీలనే మింగేస్తుందని ధ్వజమెత్తారు. జమ్ముకశ్మీర్‌లో కాంగ్రె్‌సతో పొత్తు పెట్టుకున్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కూడా.. హస్తం పార్టీ కారణంగా తమ అవకాశాలు ఎక్కడ దెబ్బతింటాయోనని భయపడిందన్నారు. కాగా, హరియాణాలో బీజేపీ గెలుపు కోసం అలుపెరగకుండా శ్రమించిన కార్యకర్తలందరికీ అభినందలు తెలియజేస్తున్నానని ‘ఎక్స్‌’లో మోదీ పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో అధికారం సాధించిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌కుఅభినందనలు తెలిపారు. అయితే, ఆ పార్టీ భాగస్వామ్యపక్షం కాంగ్రె్‌సను మాత్రం తన ట్వీట్‌లో ప్రస్తావించకపోవటం గమనార్హం. జమ్మూకశ్మీర్‌లో బీజేపీ పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. హరియాణా ప్రజలు మోదీ నాయకత్వంలో అభివృద్ధి ఎజెండాను విశ్వసించి బీజేపీని గెలిపించారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.


హరియాణా ఫలితాన్ని ఊహించలేదు: ఖర్గే

హరియాణాలో ఫలితం ఇలా వస్తుందని తాము ఊహించలేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అయితే ప్రజాతీర్పును శిరసావహిస్తామని, ఫలితాలపై విశ్లేషణ చేసుకుంటామని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్‌లో మాత్రం బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారని అన్నారు. కాగా, ఈ ఓటమి తమకు గుణపాఠం నేర్పిందని ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దని, ఎన్నికల సమయంలో అతివిశ్వాసం పనికిరాదని, ప్రతి ఎన్నికను, ప్రతి స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగానే భావించాలని ఆయన పార్టీ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు.

Updated Date - Oct 09 , 2024 | 05:28 AM