Share News

యువతలో నైపుణ్యాభివృద్ధికి.. పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకం ప్రారంభం

ABN , Publish Date - Oct 04 , 2024 | 05:00 AM

పెద్ద పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలు రావట్లేదని వాపోతారు నిరుద్యోగులు! ‘మా దగ్గర బోలెడన్ని ఉద్యోగాలున్నాయి.. కానీ, తగిన నైపుణ్యాలున్న అభ్యర్థులే దొరకట్లేదు’ అంటాయి కంపెనీలు!

యువతలో నైపుణ్యాభివృద్ధికి.. పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకం ప్రారంభం

  • రూ.800 కోట్ల అంచనా వ్యయంతో పైలట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం.. ఐదేళ్లలో 21-24 వయసులోని కోటి మందికి శిక్షణ

  • టాప్‌-500 కంపెనీల్లో పని నేర్చుకునే చాన్స్‌

  • అక్టోబరు 12నుంచి వివరాల నమోదు

  • నెలకు రూ.5 వేల చొప్పున స్టైపెండ్‌

  • వన్‌ టైమ్‌ గ్రాంట్‌ కింద మరో రూ.6వేలు

న్యూఢిల్లీ, అక్టోబరు 3: పెద్ద పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలు రావట్లేదని వాపోతారు నిరుద్యోగులు! ‘మా దగ్గర బోలెడన్ని ఉద్యోగాలున్నాయి.. కానీ, తగిన నైపుణ్యాలున్న అభ్యర్థులే దొరకట్లేదు’ అంటాయి కంపెనీలు! చదివిన చదువుకు వాస్తవ ఉద్యోగ/వ్యాపార వాతావరణానికి పొంతన లేకపోవడం.. యువతలో ఆయా ఉద్యోగాలు చేసేంత నైపుణ్యాలు లేకపోవడమే ఈ సమస్యకు కారణం. ఈ నేపథ్యంలో యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించి ఈ సమస్యను పరిష్కరించే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ఏడాది బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించిన ‘పీఎం ఇంటర్న్‌షిప్‌’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం గురువారం పైలట్‌ ప్రాతిపదికన ప్రారంభించింది. వచ్చే ఐదేళ్లలో 21-24 సంవత్సరాల వయసులో ఉన్న కోటి మంది యువతీయువకులకు.. టాప్‌-500 కంపెనీల్లో ఏడాదిపాటు క్షేత్రస్థాయిలో పని నేర్చుకునే అవకాశం కల్పించడమే ఈ పథకం లక్ష్యం.

కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద.. గడిచిన మూడేళ్లలో చేసిన వ్యయం ఆధారంగా టాప్‌-500 కంపెనీలను కేంద్రం గుర్తించి, వాటి ద్వారా యువతకు ఈ పథకం కింద ఇంటర్న్‌షిప్‌ సౌకర్యాన్ని కల్పించనుంది. ఇంటర్న్‌గా ఉన్న సమయంలో అభ్యర్థులకు నెలకు రూ.5000 చొప్పున స్టైపెండ్‌, దానికి అదనంగా వన్‌టైమ్‌ గ్రాంట్‌ కింద రూ.6000.. మొత్తం కలిపి ఏడాదికి రూ.66 వేల ఆర్థికసాయం అందుతుంది. ఇంటర్న్‌లకు ప్రతి నెలా ఇచ్చే రూ.5 వేలల్లో రూ.4,500ను కేంద్రం భరిస్తుంది.

ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో అభ్యర్థి ఖాతాలో వేస్తుంది. మిగతా రూ.500, శిక్షణకు సంబంధించిన ఖర్చులను ఆయా కంపెనీలు కార్పొరేట్‌ సోష ల్‌ రెస్పాన్సిబిలిటీ నిధుల నుంచి ఇస్తాయి. అలాగే, ఇంటర్న్‌షి్‌పలో చేరగానే ఇచ్చే వన్‌టైమ్‌ గ్రాంట్‌ రూ.6వేలను కూడా కేంద్రమే ఇస్తుంది. రూ.800 కోట్ల ఖర్చుతో ప్రారంభించిన ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద 2025 మార్చి 31తో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల మందికి డిసెంబరు 2 నుంచి ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం కల్పించనున్నారు.


  • ఆశావహులు.. అక్టోబరు 12 నుంచి 25 దాకా ఈ పోర్టల్‌ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. 26న తుదిజాబితా ప్రకటిస్తారు.

  • అక్టోబరు 27 నుంచి నవంబరు 7 దాకా.. కంపెనీలు ఆ తుది జాబితాలో నుంచి తమకు తగిన అభ్యర్థులను ఎంచుకుంటాయి.

  • ఏడాది మొత్తానికీ ప్రతి ఇంటర్న్‌కూ పీఎం జీవన్‌ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్ష బీమా యోజన కింద బీమా సౌకర్యాన్ని ఉంటుంది.

  • తెలంగాణలో ఒక జిల్లా..

పని నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న యువతకు ఈ పథకం కింద ఆ అవకాశం కల్పించేందుకు.. ఇప్పటకే మూడు కంపెనీలు (అలెంబిక్‌, మహీంద్ర అండ్‌ మహీంద్ర, మాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌) నాలుగు రాష్ట్రాల్లోని ఏడు జిల్లాల్లో 1,077 ఆఫర్లు ఇచ్చాయి. ఆ జిల్లా ల్లో ఒకటి తెలంగాణ నుంచి ఉండడం గమనార్హం.

  • ఎవరు అర్హులు?

హైస్కూల్‌, హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ విద్యలో ఉత్తీర్ణులైనవారు, ఐటీఐ సర్టిఫికెట్‌ ఉన్నవారు, పాలిటెక్నిక్‌ విద్యాసంస్థల నుంచి డిప్లొమా పొందినవారు, బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీఫార్మా వంటి డిగ్రీలు పొందిన పట్టభద్రులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కాగా, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కుటుంబాలకు చెందినవారు, ఆదాయపన్ను చెల్లించే కుటుంబాలకు చెందినవారు, వార్షిక ఆదాయం రూ.8 లక్షలు మించిన కుటుంబాల నుంచి వచ్చినవారు పథకానికి అనర్హులు. ఐఐటీ, ఐఐఎం, ఐఐఎ్‌సఈఆర్‌ వంటి ఉన్నతస్థాయి విద్యాసంస్థల్లో చదివినవారు, సీఏ, సీఎంఏ చేసినవారు అనర్హులు.

Updated Date - Oct 04 , 2024 | 05:00 AM