Share News

Rahul Gandhi : మోదీ పద్మవ్యూహం.. భయోత్పాతం!

ABN , Publish Date - Jul 30 , 2024 | 03:26 AM

PM Modi and His Government Jointly Built the 'Modern Padma Vyuha', Held People Captive and Created an Atmosphere of Terror in Country.

Rahul Gandhi : మోదీ పద్మవ్యూహం.. భయోత్పాతం!

  • ద్రోణ, కర్ణాదులు అభిమన్యుడి ప్రాణాలు తీశారు

  • 21వ శతాబ్దపు పద్మవ్యూహంలోనూ ఆరుగురే

  • వారే మోదీ, షా, ధోబాల్‌, భగవత్‌, అదానీ, అంబానీ

  • వీరి చేతిలో దేశంలోని అన్ని వర్గాలు ఇబ్బందుల్లో

  • అన్ని రంగాల్లోనూ భయానక వాతావరణమే

  • లోటస్‌లానే పద్మవ్యూహం.. మోదీ ఛాతీపైన ఆ గుర్తు

  • నేటి యువత అర్జునులు.. వ్యూహాన్ని ఛేదిస్తారు

  • కులగణన ద్వారా పద్మవ్యూహాన్ని బద్దలు కొట్టేస్తాం

  • లోక్‌సభలో సుదీర్ఘ ప్రసంగంలో రాహుల్‌ ధ్వజం

న్యూఢిల్లీ, జూలై 29: ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వం కలిసి ‘ఆధునిక పద్మవ్యూహాన్ని’ నిర్మించి.. అందులో ప్రజలను బందీలను చేసి, దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించారని విపక్షనేత రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీలో ఒకే వ్యక్తికి ప్రధాని కావాలనే ఆకాంక్ష ఉంటుందని.. ఒకవేళ రక్షణమంత్రి తాను ప్రధాని కావాలని అనుకుంటే అది సాధ్యపడదని, దాని వెనుక కూడా భయమే కారణం అని.. ఈ విధంగా భయోత్పాతం అనేది దేశంలోని ప్రతి రంగానికి వ్యాపించిందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం లోక్‌సభలో బడ్జెట్‌పై రాహుల్‌ గాంధీ 46 నిమిషాల పాటు ప్రసంగించారు.

మహాభారత కాలంలో చక్రవ్యూహం (పద్మవ్యూహం) కమలం పువ్వు మాదిరిగానే ఉండేదని, అందులోకి ప్రవేశించిన అభిమన్యుడి చుట్టూ ద్రోణాచార్యుడు, కర్ణుడు, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, శకుని అనే అరుగురు కలిసి ఉచ్చు బిగించి చంపేసినట్లే.. ప్రధాని మోదీ సారథ్యంలో ఆరుగురు కలిసి చక్రవ్యూహానికి రూపకల్పన చేశారని విమర్శించారు.


21వ శతాబ్దపు ఈ పద్మవ్యూహం కూడా కమలం పువ్వు మాదిరిగానే ఉందని, ఆ చిహ్నాన్ని మోదీ తన ఛాతీ మీద పెట్టుకుంటారని పేర్కొన్నారు. అప్పట్లో అభిమన్యుడి పట్ల జరిగిన పరిణామాలే ఇప్పుడు దేశంలోని యువత, రైతులు మహిళలు, శ్రామికులు, చిన్న వ్యాపారుల పట్ల జరుగుతున్నాయని మండిపడ్డారు. నాడు అభిమన్యుడిని ఆరుగురు కలిసి చంపినట్లే.. ఈనాటి చక్రవ్యూహం కేంద్రంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోభాల్‌, పారిశ్రామికవేత్తలు అంబానీ, అదానీ అనే ఆరుగురు ఉన్నారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.

Untitled-1 copy.jpg

ఇద్దరు పారిశ్రామికవేత్తల చేతుల్లో సంపద నియంత్రణ.. ఈడీ, ఐటీ, సీబీఐ.. రాజకీయ కార్యనిర్వాహక వర్గం అనేవి దేశాన్ని గుప్పిట్లో పెట్టుకున్న ‘చక్ర వ్యూహానికి’ గుండెకాయ వంటివని.. ఇవి దేశాన్ని నాశనం చేశాయని వ్యాఖ్యానించారు. అగ్నివీర్‌ అనే చక్రవ్యూహంలో యువతను లక్ష్యంగా చేసుకున్నారని.. అగ్నివీరులకు పెన్షన్‌ కోసం బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదనలు పెట్టలేదన్నారు.


ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో చిరు వ్యాపారులకు శరాఘాతంగా పరిణమించిన పన్నుల వాత సమస్యను ప్రస్తావించనేలేదని విమర్శించారు. ‘చక్రవ్యూహం’ శక్తిని బలహీనపరిచేలా యువత, రైతులు, శ్రామికులు, చిరు వ్యాపారులకు దోహదకారిగా ఉంటుందని తాను ఆశించానని, అవేవీ లేకపోగా ఆర్థిక, రాజకీయ శక్తులను మరింత బలోపేతం చేసేలా ఉందని అభివర్ణించారు. ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో పేపర్‌ లీక్‌ అంశాన్నే ప్రస్తావించలేదని పేర్కొన్నారు.

కోట్లాదిమందికి నష్టపరిచేందుకు పన్నిన చక్రవ్యూహాన్ని తాము కులగణన చేయడం ద్వారా బద్దలు కొడతామని, భయానక వాతావరణాన్ని పొగొట్టేదాకా తమ పొరాటం కొనసాగుతుందని ఉద్ఘాటించారు. దేశంలోని యువత అర్జున సమానులని, పద్మవ్యూహాన్ని బద్దలు కొడతారని బీజేపీని హెచ్చరించారు. అనంతరం.. రాహుల్‌ ఎక్స్‌లోనూ ట్వీట్‌ చేశారు. ‘ఆధునిక చక్రవ్యూహం’లో నిరుద్యోగం, పేపర్‌ లీక్‌ ద్వారా యువత.. అప్పుల ద్వారా రైతులు, పన్నుల వాత ద్వారా సామాన్య ప్రజలు, అగ్నిపథ్‌ ద్వారా జవాన్లు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారని.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలు అన్యాయానికి గురయ్యారని ఎక్స్‌లో రాశారు.


ఏ-1, ఏ-2 అంటే ఓకేనా?

సభలో రాహుల్‌ గాంధీ తన ప్రసంగంలో భాగంగా ఆధునిక చక్రవ్యూహం వెనుక ఆరుగురు ఉన్నారంటూ మోదీ, షా, భగవత్‌, ధోబాల్‌, అంబానీ, అదానీ పేర్లను పేర్కొన్నారు. దీనిపై అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. జోక్యం చేస్తున్న స్పీకర్‌ ఓం బిర్లా సభలో లేని వారి పేర్లను ప్రస్తావించడం సరికాదని రాహుల్‌కు సూచించారు.

స్పందించిన రాహుల్‌.. ‘‘మీరు కోరుకుంటే దోభాల్‌, అంబానీ, అదానీ పేర్లను నేను ఉపసంహరించుకుంటాను’’ అని వ్యాఖ్యానించారు. అయితే గౌతమ్‌ అదానీ, ముకేశ్‌ అంబానీలను వారి పేర్లతో కాకుండా ఏ-1, ఏ-2గా పేర్కొన్నారు.

‘‘దేశ సంపదపై గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఆ ఇద్దరి పేర్లను నేను సభలో ప్రస్తావించొద్దంటున్నారు. అప్పుడు నేను అదానీ, అంబానీలను ఏ-1, ఏ-2 అని మాత్రమే చెబుతాను. ఇది అమోదయోగ్యమే కదా’’? అని రాహుల్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

దీనిపై పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి రిజిజు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా.. రాహుల్‌, ‘‘ఏ-1, ఏ-2లను రిజిజు వెనకేసుకొస్తున్నారు. ఇది ఆయనకు తప్పదు. ఇలా చేయాలని ఆయనకు పెద్దలు నిర్దేశించారు అని ఎద్దేవా చేశారు.

Updated Date - Jul 30 , 2024 | 03:26 AM