Share News

Supreme Court : ఆప్‌ ప్రభుత్వానికి సుప్రీం షాక్‌

ABN , Publish Date - Aug 06 , 2024 | 05:12 AM

ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పెద్ద దెబ్బ తగిలింది. చట్టం ప్రకారం ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎంసీడీ)లో సభ్యులను నామినేట్‌ చేసే అధికారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ)కే ఉందని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది.

Supreme Court : ఆప్‌ ప్రభుత్వానికి సుప్రీం షాక్‌

  • ఎంసీడీలో నామినేటెడ్‌ సభ్యుల నియామక అధికారం ఎల్జీకే

  • మంత్రిమండలి సలహాను పాటించనక్కర్లేదన్న ధర్మాసనం

న్యూఢిల్లీ/చెన్నై, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పెద్ద దెబ్బ తగిలింది. చట్టం ప్రకారం ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎంసీడీ)లో సభ్యులను నామినేట్‌ చేసే అధికారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ)కే ఉందని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ విషయంలో రాష్ట్ర మంత్రిమండలి సలహా, సూచనలను ఎల్జీ పట్టించుకోనవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్‌ నరసింహ, జస్టిస్‌ జేబీ పార్దీవాలాలతో కూడిన ధర్మాసరం సోమవారం తీర్పు చెప్పింది.

10 మంది సభ్యులను ఎల్జీ నామినేట్‌ చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై విచారణను 15 నెలల క్రితమే పూర్తిచేసిన సుప్రీంకోర్టు అప్పుడు రిజర్వు చేసిన తీర్పును తాజాగా వెల్లడించింది. ప్రత్యేక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను ఎంసీడీకి నామినేట్‌ చేసే అధికారాన్ని ఎల్జీకి కల్పిస్తూ 1993లో ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం-1957కు సవరణలు చేశారని ధర్మాసనం తెలిపింది. ఎంసీడీలో 250 మంది ఎన్నికైన, 10 మంది నామినేటెడ్‌ సభ్యులు ఉంటారు.

2022 డిసెంబరులో జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధించింది. మెజారిటీ మార్కు 126 స్థానాలు కాగా, ఆప్‌ 134, బీజేపీ 104, కాంగ్రెస్‌ 9 స్థానాలు గెలుపొందాయి. అనంతరం 10 మంది సభ్యులను ఎల్జీ నామినేట్‌ చేయగా, మంత్రిమండలి సూచించిన వ్యక్తులను ఎల్జీ నామినేట్‌ చేసేలా ఆదేశించాలని కోరుతూ ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది.

కాగా, ఎంసీడీలో సభ్యులను నామినేట్‌ చేసే అధికారాన్ని ఎల్జీకి ఇవ్వడం వల్ల ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన స్థానిక సంస్థను ఆయన అస్థిర పరిచే అవకాశం ఉందని విచారణ సందర్భంగాసుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో, తాజా తీర్పు ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ అని ఆప్‌ పేర్కొంది. విచారణ సందర్భంగా సీజేఐ, జడ్జిలు చేసిన వ్యాఖ్యలకు ఈ తీర్పు పూర్తి భిన్నంగా ఉందని ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ అన్నారు.


  • యూట్యూబ్‌ ఛానళ్ల నియంత్రణకు మద్రాస్‌ హైకోర్టులో పిల్‌

యూట్యూబ్‌ చానళ్ల నియంత్రణకు తగిన విధివిధానాలు రూపొందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని మద్రాసు హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. చెన్నైకి చెందిన పార్తీబన్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌లో..

యూట్యూబ్‌ ఛానళ్లను నియంత్రించే విధానం లేకపోవడంతో ఆయా ఛానళ్లు క్రిమినల్‌ కేసులపై ఇష్టానుసారంగా ప్రసారం చేస్తున్నాయని, ఇది పోలీసుల విచారణపై ప్రభావం చూపుతోందని అన్నారు. ఈ ఛానళ్ల నియంత్రణకు విధివిధానాలు రూపొందించేలా ఆదేశాలు జారీచేయాలని అభ్యర్థించారు.

Updated Date - Aug 06 , 2024 | 05:12 AM