అదృశ్యమైన వారి కేసు మినహా మిగిలిన కేసుల విచారణ
ABN , Publish Date - Oct 19 , 2024 | 03:38 AM
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఉన్న ఈశా యోగా కేంద్రం వ్యవహారంలో ఇద్దరు మహిళలు అదృశ్యమైన కేసును మూసివేసిన సుప్రీంకోర్టు.. మిగిలిన ఫిర్యాదులపై పోలీసులు విచారణ చేపట్టవచ్చని పేర్కొంది.
ఈశా యోగా కేంద్రం వ్యవహారంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు
చెన్నై, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఉన్న ఈశా యోగా కేంద్రం వ్యవహారంలో ఇద్దరు మహిళలు అదృశ్యమైన కేసును మూసివేసిన సుప్రీంకోర్టు.. మిగిలిన ఫిర్యాదులపై పోలీసులు విచారణ చేపట్టవచ్చని పేర్కొంది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. తన ఇద్దరు కుమార్తెలను ఈశా కేంద్రంలో నిర్బంధించారంటూ మాజీ ప్రొఫెసర్ ఎస్.కామరాజ్ దాఖలు చేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ ఈషా కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్పై ఈ నెల 3వ తేదీన విచారణ చేపట్టిన ధర్మాసనం.. సవివరంగా నివేదిక దాఖలు చేయాలని తమిళనాడు పోలీ్సశాఖను ఆదేశించింది. దీంతో కోయంబత్తూరు జిల్లా ఎస్పీ కార్తికేయన్ నేతృత్వంలోని పోలీసులు 23 పేజీలతో కూడిన నివేదిక దాఖలు చేశారు. యోగా కేంద్రంలో ఆరుగురు అదృశ్యమైనట్టు కేసులున్నాయని, అందులో ఐదు కేసుల్ని ఉపసంహరించుకోగా, మరో కేసు మాత్రం పెండింగ్లో ఉందని నివేదికలో పేర్కొన్నారు.
అలాగే మరో ఏడు కేసులు నమోదు చేయగా, వాటిల్లో ఒక కేసు విచారణలో ఉందని వివరించారు. ఈ పిటిషన్పై శుక్రవారం మరోమారు విచారణ జరగ్గా.. ఈశా కేంద్రం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ.. మాజీ ప్రొఫెసర్ కుమార్తెల వయసు 42, 39 వుందని, వారి ఇష్టప్రకారమే యోగా కేంద్రంలో ఉంటున్నారని వివరించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఆ పిటిషన్ను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈశా కేంద్రంపై ఉన్న ఇతర కేసులు విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది.