Farooq Abdullah: ఉగ్రవాదులను చంపకూడదన్న ఫరూక్ అబ్దుల్లా
ABN , Publish Date - Nov 02 , 2024 | 09:07 PM
ఉగ్రదాడులు పెరుగుతుండటం వెనుక తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్ర ఉండవచ్చనే అనుమానం ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇటీవల బుద్గాం ఉగ్రదాడి ఘటనపై విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: టెర్రరిస్టులను చంపకుండా పట్టుకోవాలని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) కొత్త పల్లవి అందుకున్నారు. జమ్మూకశ్మీర్లో ఇటీవల ఉగ్రదాడులు పెరగడం వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ఎవరో వెలికితీయాలంటే ఉగ్రవాదులను కాల్చిచంపడం కాకుండా, సజీవంగా పట్టుకోవాలని ఆయన అన్నారు. ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
Arvind Sawant: క్షమాపణలు చెప్పిన ఎంపీ, నన్ను టార్గెట్ చేశారంటూ ఆవేదన
ఉగ్రదాడులు పెరుగుతుండటం వెనుక తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్ర ఉండవచ్చనే అనుమానం ఉందని కూడా ఫరూక్ అబ్దుల్లా శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ''ఇటీవల బుద్గాం ఉగ్రదాడి ఘటనపై విచారణ జరపాలి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే ఇలాంటివి జరగడం చూస్తే ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కుట్ర జరుగుతోందనే అనుమానాలకు తావిస్తోంది. ఉగ్రవాదులను చంపకుండా పట్టుకుంటే వారి వెనుక ఎవరున్నారో కూపీ లాగవచ్చు. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు ఏదైనా ఏజెన్సీ వారికి సహకరిస్తోందా అనే సమాచారం రాబట్టుకోవచ్చు'' అని ఆయన అన్నారు.
ఫరూక్ మాట కొట్టిపారేయలేం: పవార్
కాగా, ఉగ్రవాదులను చంపకుండా పట్టుకోవాలంటూ ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలతో ఎన్సీపీ-ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ ఏకీభవించారు. ఫరూక్ అబ్దుల్లా సూచనను కేంద్రం సీరియస్గా పరిశీలించాలని అన్నారు. ఫరూక్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్లో పెద్దనాయకుడని, అక్కడి ప్రజల కోసమే జీవితాన్నే అంకితం చేశారని, ఆయన నిబద్ధత, నిజాయితీపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. అలాంటి నేత ఒక ప్రకటన చేశారంటే దాన్ని సీరియస్గా తీసుకుని సమస్యను ఏవిధంగా పరిష్కరించాలనే విషయంలో కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా హోం శాఖ ఆలోచించాలని సూచించారు.
బీజేపీ అభ్యంతరం
ఉగ్రవాదులను చంపకుండా పట్టుకోవాలంటూ ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ రైనా మండిపడ్డారు. ఉగ్రవాదం పాకిస్థాన్ నుంచి వస్తున్నదనే విషయం ఫరూక్ అబ్దుల్లాకు బాగా తెలుసునని, అందరికీ తెలిసిన నిజం కూడా ఇదేనని అన్నారు. దీనిపై విచారణ చేసేందుకు ఏముందని ప్రశ్నించారు. పాకిస్తాన్, ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఈ దాడుల్లో ఉందని, ప్రజలంతా మన ఆర్మీ, పోలీసులు, సెక్యూరిటీ బలగాలకు బాసటగా నిలవాలని అన్నారు. మానవత్యానికి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారిపై ఐక్యంగా పోరాటం సాగించాలని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: