Telangana: సీఎం రేవంత్‌ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ..
ABN , Publish Date - Mar 05 , 2024 | 03:49 PM
BRS MLA Kale Yadaiah: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ (Congress) పార్టీ హౌస్ ఫుల్ అవుతోంది. బీఆర్ఎస్ (BRS) తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ముఖ్య నేతలు ‘కారు’ దిగి హస్తం గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మరికొందరు ముహూర్తం ఫిక్స్ చేసుకుని రెడీగా ఉన్నారు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ (Congress) పార్టీ హౌస్ ఫుల్ అవుతోంది. బీఆర్ఎస్ (BRS) తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ముఖ్య నేతలు ‘కారు’ దిగి హస్తం గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మరికొందరు ముహూర్తం ఫిక్స్ చేసుకుని రెడీగా ఉన్నారు. తాజాగా.. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య (Kale Yadaiah) పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమైనట్లుగా తెలియవచ్చింది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) యాదయ్య కలిశారు. తెలంగాణ సెక్రటేరియట్ వేదికగా ఈ భేటీ జరిగింది. తాను కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగానే ఉన్నట్లు ఎమ్మెల్యే చెప్పినట్లుగా సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే ఢిల్లీ వేదికగా కాలే యాదయ్య కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
అన్నీ ఎదురుదెబ్బలే..!
కాగా.. బీఆర్ఎస్ తరఫున చేవెళ్ల నుంచి పోటీచేసి యాదయ్య గెలిచారు. పార్లమెంట్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్.. బీఆర్ఎస్లోని అసంతృప్తులను పార్టీలో చేర్చుకునే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో యాదయ్యతో మంతనాలు జరిపి పార్టీలోకి ఆహ్వానించినట్లుగా సమాచారం. అయితే.. మర్యాదపూర్వకంగానే కలిసినట్లు యాదయ్య చెబుతున్నప్పటికీ.. భేటీ వెనుక మతలబు మాత్రం వేరే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ అన్నీ వరుస షాక్లే తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు వరుసగా సీఎంను కలుస్తుండటంతో బీఆర్ఎస్కు బై.. బై చెప్పేసి హస్తం గూటికి వచ్చేస్తున్నారనే సంకేతాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కుటుంబ సభ్యులతో కలవడం.. ఇప్పుడు యాదయ్య కలవడం ఇవన్నీ చూస్తుంటే.. బీఆర్ఎస్కు అనుకూల పరిస్థితులు అస్సల్లేవని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వరుస భేటీలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తునే చర్చనీయాంశం అవుతున్నాయి.
అటు.. ఇటు జంపింగ్‌లే..!
చూశారుగా.. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. సీఎం రేవంత్‌ను కలవడానికి ఏ రేంజ్లో క్యూ కడుతున్నారో..!. కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యేలు చేరుతుండగా.. ఎంపీలంతా ఒక్కొక్కరుగా బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. మొత్తానికి చూస్తే.. అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ రెండు పార్టీల్లోకి గులాబీ పార్టీ నేతలంతా వచ్చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల్లో సీన్ ఎలా ఉంటుందో అని బీఆర్ఎస్ వర్గాల్లో ఒకింత కలవరం మొదలైంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో మరి. మరోవైపు.. బీఆర్ఎస్ కచ్చితంగా ఖాళీ అవుతుందని.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని కొందరు మంత్రులు పదే పదే మీడియా ముందుకు వచ్చి చెబుతున్న సంగతి తెలిసిందే. మంత్రులు ముందు చెప్పినట్లుగానే.. ‘కారు’ పార్టీ కొంచెం కొంచెం ఖాళీ అవుతూనే వస్తోంది.