Share News

Viral Video: ఒక్కసారిగా బద్దలైన భూమి.. బాంబు అనుకొని పరుగులు.. తీరా చూస్తే..

ABN , Publish Date - Jul 24 , 2024 | 03:57 PM

అదొక నేషనల్ పార్క్. అక్కడికి వెళ్లిన పర్యాటకులందరూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. కానీ.. ఇంతలోనే అక్కడ ఎవ్వరూ ఊహించని ఓ ఘటన చోటు చేసుకుంది. భూమిని చీల్చుకుంటూ ఒక భారీ పేలుడు..

Viral Video: ఒక్కసారిగా బద్దలైన భూమి.. బాంబు అనుకొని పరుగులు.. తీరా చూస్తే..
Yellowstone National Park

అదొక నేషనల్ పార్క్. అక్కడికి వెళ్లిన పర్యాటకులందరూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. కానీ.. ఇంతలోనే అక్కడ ఎవ్వరూ ఊహించని ఓ ఘటన చోటు చేసుకుంది. భూమిని చీల్చుకుంటూ ఒక భారీ పేలుడు సంభవించింది. దీంతో.. పర్యాటకులంతా బతుకు జీవుడా అంటూ పరుగులు పెట్టారు. బాంబు పేలుడు సంభవించిందేమోనని భయబ్రాంతులకు గురయ్యారు. చివరికి అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో (America) చోటు చేసుకోగా.. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


అది యూఎస్‌లోని ఎల్లోస్టోన్‌ నేషనల్‌ పార్క్‌ (Yellowstone National Park). అందులోని బిస్కట్ బేసిన్ అనే ప్రాంతంలో.. సందర్శకులు బోర్డు వాక్‌పై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో అక్కడ ఒక్కసారిగా వంద మీటర్ల ఎత్తులో నీరు, ఆవిరి ఎగిసిపడ్డాయి. దాంతో.. పర్యాటకులంతా పరుగులు పెట్టారు. బాంబు పేలుడు అని భావించి.. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగు లంకించారు. కొందరు ఈ దృశ్యాలను తమ ఫోన్‌లో బంధించి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది తమ దృష్టికి చేరడంతో.. అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం, ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ సంయుక్తంగా స్పందించాయి. అందరూ భావిస్తున్నట్టు అదేమీ బాంబు పేలుడు కాదని, హైడ్రోథర్మల్ పేలుడని స్పష్టం చేశాయి. భూమి అడుగు భాగంలోని నీరు బాగా వేడెక్కినప్పుడు.. అవి ఆవిరిగా మారి, ఒత్తిడి పెరిగి భయంకరమైన పేలుళ్లు సంభవిస్తుంటాయని తెలిపాయి.


అంతేకాదు.. ఆ ప్రాంతంలో ఇలాంటి పేలుడు చోటు చేసుకోవడం ఇది మొదటిసారి కాదని, గతంలోనూ చాలాసార్లు జరిగాయని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అధికారులు తెలిపారు. నోరిస్ గీజర్ బేసిన్‌లోని పోర్క్‌చాప్ గీజర్‌లో 1989లో పేలుడు సంభవించిందని.. అలాగే ఇదే ఏడాది ఏప్రిల్ 15వ తేదీన కూడా అదే ప్రాంతంలో ఓ చిన్న సంఘటన జరిగిందని.. మానిటరింగ్ ఎక్విప్‌మెంట్ ద్వారా అది రికార్డు చేయబడిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఎక్కడైతే హైడ్రోథర్మల్ పేలుడు జరిగిందో.. అదే బిస్కట్ బేసిన్‌లో 2009 మే 19వ తేదీన కూడా పేలుడు వెలుగు చూసిందని స్పష్టం చేశారు. ఇలాంటి పేలుడు సంభవించినప్పుడు.. నీరు, నీటి ఆవిరి, బురద, రాళ్లు కొన్ని వందల అడుగుల ఎత్తున ఎగిరిపడతాయని.. కొన్నిసార్లు 100 మీటర్ల గోతులు కూడా ఏర్పడుతాయని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ క్లారిటీ ఇచ్చింది.


ఇదిలావుండగా.. ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఒక సూపర్ వోల్కనోపై ఉంది. ఇక్కడి భూగర్భంలోని నీళ్లు ఎల్లప్పుడూ వేడెక్కుతుంటాయి. అక్కడ 100 డిగ్రీల నుంచి 250 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. అప్పుడు నీళ్లు అవిరిగా మారి.. విస్ఫోటనానికి దారి తీస్తాయి. ఇవి చూడ్డానికి బాంబు పేలుళ్ల తరహాలో కనిపిస్తాయి కానీ.. వాటి వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. కాకపోతే.. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండకుండా కాస్త దూరం పాటించాలని సూచిస్తున్నారు.

Read Latest Prathyekam News and Telugu News

Updated Date - Jul 24 , 2024 | 03:57 PM