Share News

David Warner: ఫ్యాన్స్‌కు షాక్.. వన్డేలకు కూడా డేవిడ్ వార్నర్ గుడ్‌బై

ABN , Publish Date - Jan 01 , 2024 | 07:59 AM

David Warner Retirement: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నూతన సంవత్సరం రోజున అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ వన్డేలకు కూడా వీడ్కోలు పలికాడు.

David Warner: ఫ్యాన్స్‌కు షాక్..  వన్డేలకు కూడా డేవిడ్ వార్నర్ గుడ్‌బై

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నూతన సంవత్సరం రోజున అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ వన్డేలకు కూడా వీడ్కోలు పలికాడు. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచే తనకు చివరిదని వెల్లడించాడు. వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ టీ20 క్రికెట్‌లో కొనసాగుతానని తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్ క్రికెట్ ఆడాలని భావిస్తున్నట్టు చెప్పాడు. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. అలాగే అవసరమైతే 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫికి కూడా అందుబాటులో ఉంటానని 37 ఏళ్ల వార్నర్ చెప్పాడు.


‘‘నేను కచ్చితంగా వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాను. భారత్‌లో ప్రపంచకప్ గెలవడం భారీ విజయంగా భావిస్తున్నాను. నేను ఈ రోజు ఈ నిర్ణయం(రిటైర్మెంట్) తీసుకున్నాను. ఇది నన్ను ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇతర లీగ్‌లు ఆడేందుకు వీలు కల్పిస్తుంది. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడతా. అలాగే నా నిర్ణయంతో కొత్త వాళ్లకు అవకాశాలు వస్తాయి. ఛాంపియన్స్ ట్రోఫీ రాబోతుందని నాకు తెలుసు. రానున్న రెండేళ్లలో నేను డీసెంట్ క్రికెట్ ఆడితే అవసరమైతే ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాను.’’ అని వార్నర్ వెల్లడించాడు. కాగా తన 15 ఏళ్ల అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో 161 మ్యాచ్‌లాడిన డేవిడ్ వార్నర్ 45 సగటుతో 6,932 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలున్నాయి. తన వన్డే కెరీర్‌లో వార్నర్ 2015, 2023 వన్డే ప్రపంచకప్‌లను గెలిచాడు. ఇటీవల భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా గెలవడంలో వార్నర్ కీలకపాత్ర పోషించాడు. ఇక ఇప్పటికే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ జనవరి 3 నుంచి తన చివరి మ్యాచ్ ఆడనున్నాడు. సిడ్నీ మైదానంలో పాకిస్థాన్‌తో జరిగే మూడో టెస్టు మ్యాచ్ వార్నర్‌కు చివరిది.

Updated Date - Jan 01 , 2024 | 07:59 AM