Share News

U19 World Cup: ప్రపంచకప్ జట్టును ప్రకటించిన ఐసీసీ.. నలుగురు భారత కుర్రాళ్లకు చోటు

ABN , Publish Date - Feb 13 , 2024 | 10:26 AM

అండర్ 19 వన్డే ప్రపంచకప్ 2024 జట్టును ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ ప్రకటించిన అండర్ 19 వన్డే ప్రపంచకప్ 2024 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌‌ జట్టులో భారత ఆటగాళ్ల అధిపత్యం కనిపించింది. ఈ జట్టులో ఏకంగా నలుగురు టీమిండియా కుర్రాళ్లకు అవకాశం దక్కింది.

U19 World Cup: ప్రపంచకప్ జట్టును ప్రకటించిన ఐసీసీ.. నలుగురు భారత కుర్రాళ్లకు చోటు

అండర్ 19 వన్డే ప్రపంచకప్ 2024 జట్టును ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ ప్రకటించిన అండర్ 19 వన్డే ప్రపంచకప్ 2024 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌‌ జట్టులో భారత ఆటగాళ్ల అధిపత్యం కనిపించింది. ఈ జట్టులో ఏకంగా నలుగురు టీమిండియా కుర్రాళ్లకు అవకాశం దక్కింది. టీమిండియా నుంచి బ్యాటింగ్ విభాగంలో ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్, సచిన్ దాస్‌కు చోటు దక్కగా బౌలింగ్ విభాగంలో సౌమీ పాండేకు చోటు దక్కింది. 56 సగటుతో 397 పరుగులు చేసిన ఉదయ్ సహారన్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అతడిని ఐదో స్థానానికి ఎంపిక చేశారు. 60 సగటుతో 360 పరుగులు చేసిన ముషీర్ ఖాన్ వన్ డౌన్ బ్యాటర్‌గా అవకాశం దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో భారత్‌కు ఫినిషర్‌గా మంచి ఫలితాలను రాబట్టిన సచిన్ దాస్ ఆరో స్థానానికి ఎంపికయ్యాడు.


కాగా టోర్నీలో సచిన్ దాస్ 60 సగటుతో 303 పరుగులు చేశాడు. ఇక 18 వికెట్లతో సత్తా చాటిన బౌలర్ సౌమీ పాండేకు కూడా చోటు దక్కింది. అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా సౌమీ పాండే ఈ టోర్నీలో రికార్డు నెలకొల్పాడు. ఇక ఆ తర్వాత ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు, సౌతాప్రికా జట్టు నుంచి ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. పాకిస్థాన్, వెస్టిండీస్ నుంచి ఒక్కో ఆటగాడికి చోటు దక్కింది. ఈ జట్టులో దక్షిణాఫ్రికాకు చెందిన లువాన్ డ్రే ప్రిటోరియస్, ఆస్ట్రేలియాకు చెందిన హ్యారీ డిక్సన్ ఓపెనర్లుగా ఎంపికయ్యారు. ఈ జట్టుకు ఆస్ట్రేలియా ఆటగాడు హ్యూవీబ్‌జెన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆల్‌రౌండర్‌గా వెస్టిండీస్ ఆటగాడు నాథన్ ఎడ్వర్డ్‌ను ఎంపిక చేశారు. బౌలర్లుగా ఆస్ట్రేలియా ఆటగాడు కల్లమ్ విడ్లర్, పాకిస్థాన్ ఆటగాడు ఉబైద్ షా, సౌతాఫ్రికా ఆటగాడు క్వేనా మఫాకా చోటు దక్కించుకున్నారు.

ఐసీసీ అండర్ 19 వన్డే ప్రపంచకప్ జట్టు:

లువాన్ డ్రే ప్రిటోరియస్, హ్యారీ డిక్సన్, ముషీర్ ఖాన్, హ్యూవీబ్‌జెన్(కెప్టెన్), ఉదయ్ సహారన్, సచిన్ దాస్, నాథన్ ఎడ్వర్డ్, కల్లమ్ విడ్లర్, ఉబైద్ షా, క్వేనా మఫాక్, సౌమీ పాండే

Updated Date - Feb 13 , 2024 | 10:26 AM