Share News

LSG vs PBKS: చెలరేగిన లక్నో బ్యాటర్లు.. పంజాబ్ ముందు భారీ టార్గెట్!

ABN , Publish Date - Mar 30 , 2024 | 09:34 PM

ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నోసూపర్ జెయింట్స్ బ్యాటర్లు చెలరేగారు. దీంతో పంజాబ్ ముందు లక్నో జట్టు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. లక్నో జట్టులో క్వింటాన్ డికాక్(54) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. డికాక్‌కు తోడు నికోలస్ పూరన్(42), క‌ృనాల్ పాండ్యా(43) ధాటిగా బ్యాటింగ్ చేశారు.

LSG vs PBKS: చెలరేగిన లక్నో బ్యాటర్లు.. పంజాబ్ ముందు భారీ టార్గెట్!

లక్నో: ఐపీఎల్ 2024లో(IPL 2024) భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నోసూపర్ జెయింట్స్ Lucknow Super Giants vs Punjab Kings) బ్యాటర్లు చెలరేగారు. దీంతో పంజాబ్ ముందు లక్నో జట్టు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. లక్నో జట్టులో క్వింటాన్ డికాక్(54) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. డికాక్‌కు తోడు నికోలస్ పూరన్(42), కృనాల్ పాండ్యా(43) ధాటిగా బ్యాటింగ్ చేశారు. పంజాబ్ పేసర్ సామ్ కర్రాన్(3/28) లక్నో బ్యాటర్లను కట్టడి చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన లక్నోసూపర్ జెయింట్స్ అర్ష్‌దీప్ సింగ్ వేసిన నాలుగో ఓవర్‌లో కేఎల్ రాహుల్(15) వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించినప్పటికీ ఎక్కువసేపు ఆడలేకపోయాడు. దీంతో 35 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. అయితే ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా కాకుండా ఇంపాక్టు ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. దీంతో ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్‌గా నికోలస్ పూరన్ వ్యవహరిస్తున్నాడు.


ఆ కాసేపటికే దేవదత్ పడిక్కల్(9)ను సామ్ కర్రాన్ పెవిలియన్ చేర్చాడు. అనంతరం మార్కస్ స్టోయినీస్‌తో కలిసి ఓపెనర్ డికాక్ మూడో వికెట్‌కు 33 పరుగులు జోడించాడు. అయితే 9వ ఓవర్‌లో స్టోయినీస్‌ను(19) స్పిన్నర్ రాహుల్ చాహర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 78 పరుగులకు లక్నో 3 వికెట్లు కోల్పోయింది. అనంతరం డికాక్, కెప్టెన్ పూరన్ కలిసి నాలుగో వికెట్‌కు 27 బంతుల్లో 47 పరుగులు జోడించారు. ఈ క్రమంలో డికాక్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో డికాక్‌కు ఇది 21వ హాఫ్ సెంచరీ. ఈ క్రమంలో లక్నో స్కోర్ కూడా 100 పరుగులు దాటింది. మరోసారి చెలరేగిన యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఈ భాగస్వామ్యాన్ని 14వ ఓవర్‌ మొదటి బంతికి విడదీశాడు. 5 ఫోర్లు, 2 సిక్సులతో 38 బంతుల్లో 54 పరుగులు చేసిన డికాక్ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఆ కాసేపటికే 3 ఫోర్లు, 3 సిక్సులతో 21 బంతుల్లో 42 పరుగులు చేసిన పూరన్‌ను పేసర్ రబాడ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 146 పరుగులకు లక్నో సగం వికెట్లు కోల్పోయింది.

అనంతరం కృనాల్ పాండ్యా చెలరేగి బ్యాటింగ్ చేశాడు. హర్షల్ పటేల్ వేసిన 18వ ఓవర్‌లో కృనాల్ రెండు ఫోర్లు, ఓ సిక్సు బాదాడు. ఆ ఓవర్లో 20 పరుగులొచ్చాయి. దీంతో డెత్ ఓవర్లలో లక్నో స్కోర్ పరుగులు పెట్టింది. అయితే 19వ ఓవర్‌లో వరుస బంతుల్లో ఆయుష్ బదోని(8), రవి బిష్ణోయ్‌ను కర్రాన్ పెవిలియన్ చేర్చాడు. బిష్ణోయ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో 189 పరుగులకు లక్నో 7 వికెట్లు కోల్పోయింది. దీంతో లక్నో స్కోర్ 200 దాటడం ఖాయంగా కనిపించింది. అయితే చివరి ఓవర్‌లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన హర్షల్ పటేల్ 8 పరుగులే ఇచ్చాడు. అలాగే మోహ్సీన్ ఖాన్(2) రనౌట్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో లక్నోసూపర్ జెయింట్స్ 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. చివరి 5 ఓవర్లలో 53 పరుగులు చేసిన లక్నో 4 వికెట్లు కోల్పోయింది. 4 ఫోర్లు, 2 సిక్సులతో 22 బంతుల్లో 43 పరుగులు చేసిన కృనాల్ నాటౌట్ గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో సామ్ కర్రాన్ 3, అర్ష్‌దీప్ సింగ్ 2, రబాడ, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024: మైలురాయిని చేరుకున్న ఆర్సీబీ.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో జట్టుగా..

IPL 2024: గంభీర్-కోహ్లీకి ఆస్కార్ ఇవ్వాలి.. దిగ్గజ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Mar 30 , 2024 | 09:52 PM