Share News

Hardik Pandya: హార్దిక్ పాండ్యాపై వేటు.. నేనే అతని స్థానంలో ఉండుంటే..

ABN , Publish Date - Jul 24 , 2024 | 03:05 PM

గతంలో రోహిత్ శర్మ గైర్హాజరులో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం, టీ20 వరల్డ్‌కప్‌లోనూ వైస్-కెప్టెన్‌గా ఉండటం చూసి.. భారత టీ20 జట్టుకి అతడే కెప్టెన్‌గా కొనసాగుతాడని..

Hardik Pandya: హార్దిక్ పాండ్యాపై వేటు.. నేనే అతని స్థానంలో ఉండుంటే..
Hardik Pandya

గతంలో రోహిత్ శర్మ (Rohit Sharma) గైర్హాజరులో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం, టీ20 వరల్డ్‌కప్‌లోనూ వైస్-కెప్టెన్‌గా ఉండటం చూసి.. భారత టీ20 జట్టుకి అతడే కెప్టెన్‌గా కొనసాగుతాడని అంతా అనుకున్నారు. ఆ దిశగా సంకేతాలు కూడా కనిపించాయి. తీరా చూస్తే.. బీసీసీఐ (BCCI) ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. టీ20లకు శాశ్వత సారథిగా సూర్యకుమార్ యాదవ్‌ని (Suryakumar Yadav) నియమించింది. పాండ్యా ఫిట్‌నెస్ సమస్యల దృష్ట్యా.. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. దీంతో.. హార్దిక్‌కి అన్యాయం జరిగిందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ.. భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప మాత్రం అందుకు భిన్నంగా స్పందించాడు. అతని స్థానంలో తాను ఉండుంటే.. ఎగిరి గంతేసేవాడినని పేర్కొన్నాడు.


సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో జరిగిన ఓ డిబేట్‌లో భాగంగా ఊతప్ప మాట్లాడుతూ.. ‘‘నేను హార్దిక్ పాండ్యా స్థానంలో ఉండి ఉంటే.. నా కెరీర్ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారని సంతోషించేవాడిని. ఎందుకంటే.. భారత క్రికెట్ ఎకోసిస్టమ్‌లో ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ దొరకడం అత్యంత అరుదైన విషయం. తనకు అన్యాయం జరిగిందని హార్దిక్ భావించకూడదు. ఈ విషయంలో.. కెరీర్‌కు మెరుగులు దిద్దుకునేందుకు తనకు మంచే జరిగిందని ఆలోచించాలి. ఒకవేళ నాకు 34- 35 ఏళ్ల వయసు ఉండి, తరచూ గాయాల బారిన పడుతూ ఉన్నప్పుడు నాపై ఇలాంటి వేటు వేస్తే.. అది నా కెరీర్‌ను పొడిగించుకోవడానికి, మరింత మెరుగుపరచుకోవడానికి ఉత్తమ అవకాశమని భావిస్తాను. జాతీయ జట్టుకు మరింత సేవలు అందించవచ్చు. ఆ కోణంలో చూసుకుంటే.. కెప్టెన్సీకి దూరం అవ్వడం అనేది ఒక మంచి పరిణామమే’’ అని తెలిపాడు.


ఎవరైనా తనని ఆటగాడిగా కొనసాగుతావా? లేక కెప్టెన్సీ బాధ్యతలు చేపడతావా? అని ప్రశ్నిస్తే.. అప్పుడు తాను భారత్‌కు ప్రాతినిథ్యం వహించడానికే మొగ్గు చూపుతానని సమాధానం ఇస్తానని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు. ఓ ఆటగాడిగా భారత్‌కు వీలైనన్ని ప్రపంచకప్ ఛాంపియన్‌షిప్‌లను అందించేందుకు ప్రయత్నిస్తానని గర్వంగా చెప్తానని తెలిపాడు. సామర్థ్యం ఉన్న ఆటగాడు వీలైనంత కాలం దేశానికి సేవ చేయాలని వారు (బీసీసీఐ) కోరుకుంటారని.. తానైతే అదే చేస్తానని, అదే తనకు ఎంతో ఇష్టమని వెల్లడించాడు. తనకు పాండ్యా వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి.. తనకు జరిగింది సరైందేనని అతను అర్థం చేసుకుని ఉంటాడని భావిస్తున్నానని ఊతప్ప చెప్పుకొచ్చాడు. కాగా.. జులై 27వ తేదీన శ్రీలంకతో భారత జట్టు మూడు మ్యాచ్‌లు చొప్పున టీ20, వన్డే సిరీస్‌లు ఆడనున్న విషయం అందరికీ తెలిసిందే.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 24 , 2024 | 03:05 PM