Share News

UPI Wallet: యూపీఐ చెల్లింపుల కోసం కొత్త విధానం.. వివరాలు ఇవే..

ABN , Publish Date - Oct 22 , 2024 | 01:02 PM

రోడ్డు పక్కన ఇడ్లీ బండిల నుంచీ ఐదు నక్షత్రాల హోటళ్ల వరకూ ఎక్కడ పడితే అక్కడ విరివిరిగా యూపీఐ ఉపయోగిస్తున్నారు. టీ స్టాల్‌కి వెళ్లినా, కిరాణా సరకులు తీసుకున్నా, కూరగాయాల మార్కెట్ వెళ్లినా నేడు ఎవ్వరూ నగదును ప్రత్యక్షంగా తీసుకెళ్లడం లేదు.

UPI Wallet: యూపీఐ చెల్లింపుల కోసం కొత్త విధానం.. వివరాలు ఇవే..

ఇంటర్నెట్ డెస్క్: భారతదేశంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం యూపీఐ (UPI)ని తీసుకువచ్చింది. మన దేశంలో ఇది ఎంతగా సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోడ్డు పక్కన ఇడ్లీ బండిల నుంచీ ఐదు నక్షత్రాల హోటళ్ల వరకూ ఎక్కడ పడితే అక్కడ విరివిరిగా ఉపయోగిస్తున్నారు. టీ స్టాల్‌కి వెళ్లినా, కిరాణా సరకులు తీసుకున్నా, కూరగాయాల మార్కెట్ వెళ్లినా నేడు ఎవ్వరూ నగదును ప్రత్యక్షంగా తీసుకెళ్లడం లేదు. కేవలం ఒక్క ఫోన్ ఉంటే చాలు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్‌ సహాయంతో ఇట్టే నగదు చెల్లిస్తున్నారు. అయితే సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో యూపీఐ నగదు లావాదేవీల వ్యవస్థను మరింత శక్తిమంతంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) నిరంతరం కృషి చేస్తోంది. ఈ మేరకు ఎన్పీసీఐ కొత్తగా యూపీఐ వాలెట్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా సులభతరమైన చెల్లింపులు, సురక్షితమైన చెల్లింపులు చేయెుచ్చని ఎన్పీసీఐ అధికారులు వెల్లడించారు.


యూపీఐ, యూపీఐ వాలెట్ మధ్య వ్యత్యాసం..

అయితే యూపీఐ, కొత్తగా వచ్చిన యూపీఐ వాలెట్ చెల్లింపుల మధ్య తేడాలు ఉన్నాయి. యూపీఐని వియోగించాలంటే ఓ వ్యక్తి ముందుగా పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్‌ని తన మెుబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని ఓపెన్ చేసి తమ బ్యాంక్ ఖాతాలను అనుసంధానం(లింక్) చేసుకోవాలి. అలాగే దానికి పిన్ నంబర్ సెట్ చేసుకోవాలి. మనం ఏదైనా దుకాణానికి వెళ్లినప్పుడు లేదా నగదును యూపీఐ ద్వారా చెల్లించాల్సి వచ్చినప్పుడు పిన్ నంబర్ ఎంటర్ చేసి నగదు చెల్లించాలి. ఆ సమయంలో డబ్బులు అనేవి నేరుగా మన బ్యాంక్ ఖాతా నుంచి రిసీవర్ బ్యాంక్ ఖాతాకు వెళ్లిపోతాయి.


అయితే యూపీఐ వాలెట్ మాత్రం అలా ఉండదు. యూపీఐ వాలెట్ ద్వారా నగదు చెల్లింపులు చేయాలంటే ముందుగా యూపీఐ నుంచి కొంత నగదును వాలెట్‌లో జమ చేసుకోవాలి. అలా యూపీఐ వాలెట్‌లో వేసుకున్న నగదుకు బ్యాంక్ ఖాతాలకు ఏమాత్రం సంబంధం ఉండదు. అప్పుడు మీరు ఎక్కడ పేమెంట్ చేసినా ఎలాంటి సైబర్ దాడులకు గురయ్యే ప్రమాదం ఉండదు. ఇది మరింత సురక్షితమని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెబుతోంది.


యూపీఐ వాలెట్ ప్రయోజనాలు..

యూపీఐ వాలెట్‌ను చిన్న లావాదేవీల కోసం ఎన్పీసీఐ తీసుకువచ్చింది. దీని ద్వారా ఒకేసారి గరిష్ఠంగా రూ.వెయ్యి వరకూ చెల్లింపులు చేయెుచ్చు. రోజుకు గరిష్ఠంగా రూ.10వేలు బదిలీ చేయవచ్చు. అలాగే నగదు చెల్లింపుల సమయంలో ఎలాంటి పిన్ నంబర్ ఎంటర్ చేయాల్సిన పని లేదు. అలాగే యూపీఐ నుంచి దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ లింక్ చేసుకోవచ్చు. దీని వల్ల వేగంగా చెల్లింపులు అవుతాయి. కిరాణా సరకులు, టీ స్టాళ్లు, హోటళ్లు, బిర్యానీ పాయింట్లు, ఫ్రూట్ మార్కెట్లు వంటి దుకాణాల వద్ద త్వరగా చెల్లింపులు చేసేందుకు యూపీఐ వాలెట్ బాగా ఉపయోగపడుతుంది.


టెక్నాలజీ పెరిగే కొద్ది సైబర్ దాడులూ పెరిగిపోతున్నాయి. బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నగదును కేటుగాళ్లు ఇట్టే మాయం చేస్తున్నారు. యూపీఐ మోసాలు కూడా పెరుగుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు యూపీఐ వాలెట్ బాగా ఉపయోగపడుతుంది. బ్యాంక్ ఖాతాలకు యూపీఐ వాలెట్‌కు సంబంధం ఉండదు కాబట్టి సురక్షితమైన చెల్లింపులు చేయెుచ్చు. దీని వల్ల బ్యాంకుల్లోని మీ నగదు భద్రంగా ఉంటుందని ఎన్పీసీఐ అధికారులు చెబుతున్నారు.

Updated Date - Oct 22 , 2024 | 01:09 PM