Share News

Yadagirigutta: గుట్టపై ‘స్నాన సంకల్పం’

ABN , Publish Date - Aug 12 , 2024 | 04:31 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని దర్శించుకునే భక్తులకు ‘స్నాన సంకల్పం’ ఆర్జిత సేవ అందుబాటులోకి వచ్చింది. యాదగిరిగుట్ట ఆలయ ఉద్ఘాటనకు ముందు కొండపైన ఉన్న గుండంలో భక్తులు స్నానమాచరించేవారు.

Yadagirigutta: గుట్టపై ‘స్నాన సంకల్పం’

  • భక్తుల కోసం విష్ణు పుష్కరిణిలో అందుబాటులోకి

  • తిరుమల తరహాలో నిత్యం వెలిగేలా అఖండ దీపారాధన

  • గిరి ప్రదక్షిణలో పాల్గొన్న 15వేల మంది భక్తులు

భువనగిరి అర్బన్‌, ఆగస్టు 11: యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని దర్శించుకునే భక్తులకు ‘స్నాన సంకల్పం’ ఆర్జిత సేవ అందుబాటులోకి వచ్చింది. యాదగిరిగుట్ట ఆలయ ఉద్ఘాటనకు ముందు కొండపైన ఉన్న గుండంలో భక్తులు స్నానమాచరించేవారు. ఉద్ఘాటన నేపథ్యంలో భక్తుల స్నానానికి కొండకింద లక్ష్మీ పుష్కరిణిని, కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి నీటిని దేవతా కైంకర్యాలకు వినియోగిస్తున్నారు. కొండపై ఉన్న గుండంలో స్నానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల్లో అనాదిగా ఉన్న నమ్మకం, పాత ఆచారాల పునరుద్ధరణ నేపథ్యంలో ఆదివారం నుంచి ‘స్నాన సంకల్పం’ ఆర్జితసేవను ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.


ఉదయం 9.30కు కొండపైన విష్ణు పుష్కరిణిలో ‘స్నాన సంకల్పం’ అర్జిత సేవను ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య ప్రారంభించారు. వేదమంత్రాల నడుమ ఈవో ఏ. భాస్కర్‌రావుతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన ఐలయ్య కుటుంబసమేతంగా పుష్కరిణిలో స్నాన సంకల్పం చేశారు. భక్తులు కూడా స్నాన సంకల్పంలో భాగస్వాములయ్యారు. ఆలయ తూర్పు రాజగోపురం ఎదురుగా ఈశాన్య దిశలో కొత్తగా ఏర్పాటు చేసిన అఖండ దీపారాధనను కూడా ప్రారంభించారు. తొలిరోజు భక్తులందరికీ ఉచితంగా స్నాన సంకల్పానికి అవకాశం కల్పించారు. దీనికి రూ.100 టికెట్‌ వసూలు చేయనున్నారు.


కాగా లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకుని యాదగిరికొండ చుట్టూ నిర్వహించిన గిరి ప్రదక్షిణలో భక్తులు పెద ్దసంఖ్యలో పాల్గొన్నారు. వేద మంత్రాల నడుమ ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాలతో అర్చక స్వాములు హారతి ఇవ్వగా ఆలయ ఈవో భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నరసింహమూర్తి పాల్గొనగా, ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తన కుటుంబసభ్యులతో కలిసి గిరిప్రదక్షిణ శుభ కార్యాన్ని గోవింద నామస్మరణ మధ్య ప్రారంభించారు. మొత్తం 15వేల మంది గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2024 | 04:31 AM