ధరణి సమస్యలకు పరిష్కారమేదీ...?
ABN , Publish Date - Dec 01 , 2024 | 11:21 PM
ధరణి సమ స్యల పరిష్కారం నానాటికీ జఠిలంగా మారుతోంది. భూ సమస్యలు పరిష్కరించాలని రైతులు రెవెన్యూ కార్యాల యాలకు, జిల్లా కేంద్రంలో కలెక్టర్ నిర్వహించే ప్రజావాణి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా వారి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
మంచిర్యాల, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ధరణి సమ స్యల పరిష్కారం నానాటికీ జఠిలంగా మారుతోంది. భూ సమస్యలు పరిష్కరించాలని రైతులు రెవెన్యూ కార్యాల యాలకు, జిల్లా కేంద్రంలో కలెక్టర్ నిర్వహించే ప్రజావాణి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా వారి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ధరణిపై ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రత్యేక కమిటీలను సైతం ఏర్పాటు చేసింది. ఫిబ్రవరిలో కలెక్టర్ ఆధ్వర్యంలో 18 మండలాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేశారు. జిల్లాలో ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు ప్రత్యేక డైరవ్ నిర్వహించారు.
ఆర్డీవో, తహసీల్దార్‌లకు ప్రత్యేక అధికారాలు...
ధరణి సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌తో సహా ఆర్డీవోలు, తహసీల్దార్‌లకు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. మండల స్థాయిలో తహసీల్దార్, నాయబ్ తహసీ ల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, లీగల్ వలంటీర్లు, కమ్యూనిటీ సర్వేయర్‌లు, పంచాయతీ కార్యదర్శులను సభ్యులుగా చేర్చి ఒక్కో మండలంలో కనీసం రెండు నుంచి మూడు కమిటీలను వేశారు. కమిటీ సభ్యులంతా మీ-సేవలు, తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. జిల్లాలో ప్రత్యేక బృందాలు పరిశీలించి ఏ రోజుకు ఆరోజు నివేదికలు కూడా అందించారు. కానీ నేటికీ కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో బాధిత రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
మాడ్యుల్స్ వారీగా...
జిల్లా వ్యాప్తంగా ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కలెక్టర్ కుమార్ దీపక్‌ధరణి సమస్యలు పరిష్కరించాలని కసరత్తు చేస్తున్నా ఇంకా భారీ సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పటికీ డేటా కరెక్షన్ చేయాల్సినవి, అర్బన్ ల్యాండ్స్, మ్యూటేషన్లు, పీవోబీ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆధార్ సీడింగ్స్, గ్రీవెన్స్ భూ సమస్యలను పరిష్కరించినా కొత్త దరఖాస్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. టీఎం మాడ్యు ల్స్ ఆధారంగా జిల్లాలో ప్రత్యేక డ్రైవ్‌కు ముందు పెం డింగ్‌లో ఉన్న దరఖాస్తులపై దృష్టిసారించగా, మార్చిలో నిర్వహించిన బృందాల క్షేత్రస్థాయి పరిశీలన, రికార్డుల నమోదు తర్వాత నివేదికల ఆధారంగా సమస్యలను పరి ష్కరించారు. ఇవిపోను మిగిలిన దరఖాస్తుల పరిష్కారా నికి మాత్రం మోక్షం లభించడం లేదు. క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు, తహసీల్దార్‌లు ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప పెండింగ్ సమస్యలకు పరిష్కారమయ్యే అవకాశం లేదు.
పెండింగ్ దరఖాస్తులు ఇలా...
జిల్లా వ్యాప్తంగా నాలుగు నెలలుగా దాదాపు 1,914 వరకు ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో డేటా కరెక్షన్, అర్బన్ ల్యాండ్స్‌కు సంబంధించినవి, మ్యుటే షన్‌లు, కోర్టు కేసులకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయి. ధరణి పెండింగ్ దరఖాస్తులు మండలాల్లో తహసీల్దార్ల స్థాయిలో 774 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఆర్డీవోల లాగిన్‌లో 636, అడిషనల్ కలెక్టర్ వద్ద 448, కలెక్టర్ లాగిన్‌లో 56 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
కులగణన సర్వేతోనూ ఆటంకం...
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ సమగ్ర కుల గణన సర్వే కారణంగానూ ధరణి దరఖాస్తులు పరిష్కా రానికి నోచుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ సహా ఆర్డీవోలు, తహసీల్దార్‌లు, ఇతర ఉద్యోగులు దాదాపు 15 రోజులపాటు సర్వే పనుల్లో తలమునకలై ఉన్నారు. దీంతో ధరణి దరఖాస్తుల వైపు పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం లేకుండా పోయింది.